Site icon vidhaatha

ఒంటిమిట్ట శ్రీ కోదండరామాలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

విధాత‌: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామివారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు బుధ‌వారం పవిత్ర సమర్పణ శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. ఉద‌యం బాల‌బోగం, చ‌తుష్టానార్చ‌న‌, ప‌విత్ర హోమం, మ‌ధ్యాహ్న ఆరాధ‌న‌, బ‌రిహ‌ర‌ణ‌, శాత్తుమొర చేప‌ట్టారు. ఈ సంద‌ర్భంగా యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు నిర్వహించి ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, బలిమూర్తులకు, విష్వక్సేనులవారికి, ద్వారపాలకులకు, గరుడాళ్వార్‌కు, యాగశాలలోని హోమగుండాలకు, బలిపీఠానికి, ధ్వజస్తంభానికి, ఆలయం ఎదురుగా గల ఆంజనేయస్వామివారికి పవిత్రాలు సమర్పించారు. సాయంత్రం ప‌విత్ర‌హోమం, నివేద‌న‌, శాత్తుమొర జ‌రుగ‌నున్నాయి. ఈ కార్యక్రమంలో ఆలయ ఏఈవో ముర‌ళీధ‌ర్‌, సూపరింటెండెంట్ వెంక‌టేష్‌, కంక‌ణ‌భ‌ట్టార్ రాజేష్ స్వామి త‌దిత‌రులు పాల్గొన్నారు.

Exit mobile version