Son kills mother | తండ్రిని బంధించి, తల్లిని చంపేసి, పాటలు వింటున్న కొడుకు : పోలీసులు షాక్​

కడప జిల్లా ప్రొద్దుటూరులో ఓ కుమారుడు తండ్రిని బంధించి, తల్లిని హత్య చేసిన ఘటన షాక్‌కు గురిచేసింది. డబ్బులు ఇవ్వలేదన్న కోపంతో ఈ దారుణానికి పాల్పడ్డాడు.

Kadapa shock: Man locks father, kills mother over money, listens to songs after murder

Representational Image (AI)

Kadapa shock: Man locks father, kills mother over money, listens to songs after murder

Son kills mother | కడప జిల్లా ప్రొద్దుటూరులో ఆదివారం ఉదయం ఒళ్లు గగుర్పొడిచే దుర్ఘటన జరిగింది. డబ్బులు ఇవ్వలేదని కోపంతో ఓ కొడుకు తండ్రిని గదిలో బంధించి, తల్లిని హత్య చేసి, తన ఫోన్‌లో పాటలు వింటూ కూర్చున్న దృశ్యం అక్కడి వారిని షాక్‌కు గురి చేసింది. ఈ సంఘటన శ్రీరామ్‌నగర్ ప్రాంతంలో చోటుచేసుకుంది.

మృతురాలు లక్ష్మీదేవి (52), భర్త విజయభాస్కర్ రెడ్డి దంపతులు. లక్ష్మీదేవి ఈశ్వర్‌రెడ్డినగర్ జడ్పీ హైస్కూల్‌లో టీచర్‌గా పనిచేస్తుండగా, భర్త గతంలో ప్రైవేట్ ఉద్యోగం చేసి రిటైర్​ అయ్యారు. వీరి ఏకైక కుమారుడు యశ్వంత్ కుమార్ రెడ్డి మూడు సంవత్సరాల క్రితం చెన్నైలో బీటెక్ పూర్తి చేశాడు కానీ,  ఉద్యోగం చేయాలనే ఆసక్తి లేక, సినిమాల్లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్నాడు.

హైదరాబాద్‌లో ఉండే యశ్వంత్‌కు ప్రతినెల తల్లిదండ్రులు ఖర్చులకు డబ్బులు పంపేవారు. ఇటీవల డబ్బులు ఆలస్యం కావడంతో తల్లిని ఫోన్ చేసి అడిగాడు. ఆమె 3,000 రూపాయలు పంపినా, యశ్వంత్ మరో 10వేలు కావాలని పట్టుబట్టాడు. తల్లి నిరాకరించడంతో అతడిలో కోపం పెరిగింది. సినీ అవకాశాలు రాకపోవడం, ఆర్థిక ఒత్తిడి, తల్లిదండ్రుల సలహాలతో విసుగెత్తి మానసికంగా దెబ్బతిన్నట్లు స్థానికులు చెబుతున్నారు.

ఆదివారం ఉదయం అతడు హైదరాబాద్‌ నుంచి ప్రొద్దుటూరుకు వచ్చాడు. ఇంటికి వచ్చిన వెంటనే తల్లితో వాగ్వాదం మొదలైంది. తండ్రి బయటకు వచ్చి ఆపేందుకు ప్రయత్నించగా, యశ్వంత్ ఆయనను గదిలోకి నెట్టివేసి తలుపు మూసేశాడు. తరువాత కత్తితో తల్లి గొంతు కోసి హత్య చేశాడు. మృతదేహాన్ని ఈడ్చి బయట వరండాలో పడేశాడు. తర్వాత ఫోన్‌లో పాటలు వింటూ కుర్చీలో కూర్చున్నాడు. ఇంతలో లక్ష్మీదేవి అరుపులు విన్న పొరుగువారు పరుగున వచ్చి, ఆ భయానక దృశ్యం చూసి షాక్‌కు గురై వెంటనే పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు అక్కడికి చేరుకుని యశ్వంత్‌ను అదుపులోకి తీసుకుని, గదిలో బంధించబడిన విజయభాస్కర్ రెడ్డిని విడిపించి తీసుకువచ్చారు. ప్రొద్దుటూరు టౌన్ సీఐ వేణుగోపాల్ కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.

స్థానికుల కథనం ప్రకారం, యశ్వంత్ గత కొన్ని నెలలుగా మానసికంగా స్థిరంగా లేడని చెబుతున్నారు. తరచుగా పట్టరాని ఆవేశంతో ప్రవర్తించేవాడనీ, సినిమాల్లో అవకాశాలు రాకపోవడం, కుటుంబ సలహాల ఒత్తిడి ఇంకా నిరుద్యోగం కలిసి అతని మానసిక స్థితిని మరింత దెబ్బతీశాయని పోలీసులు చెబుతున్నారు.

సమాజంలో పెరుగుతున్న ఈ తరహా సంఘటనలు కుటుంబ సంబంధాలు, ఆర్థిక ఒత్తిడులు, యువతలో మానసిక ఆరోగ్యంపై ఉన్న నిర్లక్ష్యాన్ని ఎత్తి చూపిస్తున్నాయి. కుటుంబ సభ్యుల మానసిక స్థితిలో మార్పులను గమనించి సమయానికి వారికి ఆసరా ఇవ్వడం ఎంతో అవసరమని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.