అమరావతి : తాడిపత్రి వైసీసీ మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి ఎట్టకేలకు 15నెలల తర్వాత తన సొంత నియోజకవర్గంలోని తాడిపత్రి సొంతింటికి చేరుకున్నారు. భారీ పోలీసు భద్రత మధ్య తాడిపత్రిలోని స్వగృహానికి వెళ్లారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అనంతపురం ఎస్పీ జగదీష్ స్వయంగా రంగంలోకి దిగి భద్రత కల్పించారు. 672 మంది పోలీసులతో బందోబస్తు ఏర్పాటు చేశారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పెద్దారెడ్డిని తాడిపత్రిలోకి రాకుండా ఆయన రాజకీయ ప్రత్యర్థి టీడీపీ నేత జేసీ ప్రభాకర్ రెడ్డి కూటమి ప్రభుత్వంపై ఒత్తిడి తేవడంతో పోలీసులు శాంతిభద్రతల నేపథ్యంలో ఆయనను సొంత నియోజకవర్గానికి అనుమతించలేదు. దీంతో పెద్దారెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సుప్రీంకోర్టు పెద్దారెడ్డికి తాడిపత్రి వెళ్లేందుకు అనుమతించింది ‘ఓ వ్యక్తిని తన నియోజకవర్గానికి వెళ్లకుండా ఎలా అడ్డుకుంటారు..?’ అని పోలీసులను ప్రశ్నించింది. రాష్ట్ర ప్రభుత్వం పెద్దారెడ్డికి తగిన భద్రత కల్పించాలని..ఆ ఖర్చును పెద్దారెడ్డి భరించాలనిసూచించింది. ఈ నేపథ్యంలో పోలీసు బందోబస్తు మధ్య పెద్దారెడ్డి శనివారం తాడిపత్రిలోని తన ఇంటికి చేరుకున్నారు.
ఈ సందర్భంగా పెద్దారెడ్డి మీడియాతో మాట్లాడుతూ 15 మాసాల తర్వాత తాడిపత్రికి రావడం ఆనందంగా ఉందన్నారు. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు పోలీసులు భద్రత కల్పించారని..వారికి అన్ని విధాలా సహకరిస్తానని తెలిపారు. తాడిపత్రిలో శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తానన్నారు. తాడిపత్రి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కరించే ప్రయత్నం చేస్తానన్నారు. నాకు ప్రతిపక్షం కొత్త కాదు..పోరాడటం కొత్త కాదు అని స్పష్టం చేశారు. ప్రజలకు అధికారంలో ఉన్నప్పుడు ఎలా అందుబాటులో ఉన్నానో.. ప్రతిపక్షంలో కూడా అలానే అందుబాటులో ఉంటానన్నారు. ఈ 15 నెలలు మా నాయకుల మీద అక్రమ కేసులు పెట్టారు..వారి ఇంటికి నేనే వెళ్ళి పరమర్శిస్తానని తెలిపారు.