Kurnool Bus Tragedy Victims Names Identified | కర్నూలు బస్సు ప్రమాదంలో మృతుల గుర్తింపు

కర్నూలు బస్సు ప్రమాదంలో 19 మంది దుర్మరణం చెందగా తెలంగాణ, ఆంధ్రకు చెందిన బాధితుల వివరాలు వెలుగులోకి వచ్చాయి. కవేరీ ట్రావెల్స్ నిర్లక్ష్యంపై దర్యాప్తు కొనసాగుతోంది.

Kaveri travels bus fire accident

విధాత: కర్నూలు జిల్లా చిన్నటేకూరులో జరిగిన కావేరీ ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ప్రమాదం మృతుల గుర్తింపు కొనసాగుతుంది. హైదరాబాద్‌ నుంచి బెంగళూరు వెళ్తున్న వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు బైక్‌ను ఢీ కొట్టడంతో చెలరేగిన మంటల్లో బస్సు దగ్దమై అందులోని ప్రయాణికులు 19మంది సజీవ సమాధి అయ్యారు. ప్రమాద సమయంలో బస్సులో 41 మంది ప్రయాణికులు, ఇద్దరు డ్రైవర్లు ఉన్నారు. ప్రయాణికుల్లో ఇద్దరు చిన్నారులు, 10 మంది మహిళలు ఉన్నారు. బస్సు నుంచి 19మంది మృతదేహాలను వెలికితీశారు. వారి వివరాలను గుర్తిస్తున్నారు. ప్రమాదంలో తెలంగాణకు చెందిన యాదాద్రి భువనగిరి జిల్లా గుండాల మండలం వస్తాకొండూరుకు చెందిన అనూషారెడ్డి మృతి చెందినట్లుగా గుర్తించారు. అనూషారెడ్డి బెంగళూరులో సాప్ట్‌వేర్ ఉద్యోగం చేస్తున్నారు. దీపావళి పండుగ సందర్భంగా.. సొంతూరుకు వచ్చిన అనూషారెడ్డి తిరిగి బెంగళూరు వెళ్లేందుకు రాత్రి ఖైరతాబాద్‌లో బస్సు ఎక్కారు. తమ కూతురు బస్సు ప్రమాదంలో సజీవదహనం కావడంతో తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. ఏపీలోని బాపట్ల జిల్లా యద్ధనపూడి మండలం పూసపాడుకు చెందిన గన్నమనేని ధాత్రి (27) కూడా ప్రమాదంలో చనిపోయారు. ధాత్రి కూడా బెంగుళూరులో సాఫ్ట్ వేర్ ఇంజనీర్ గా పనిచేస్తున్నారు. ధాత్రి ఇటీవల దీపావళి సందర్భంగా హైదరాబాద్‌లోని మేనమామ ఇంటికి వచ్చారు. అక్కడి నుంచి బెంగళూరు వెళ్లేందుకు గురువారం రాత్రి వేమూరి కావేరి ట్రావెల్స్‌ బస్సు ఎక్కి ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు.

హైదరాబాద్ నుంచి సూరారంలో ఇద్దరు, జేఎన్‌టీయూ వద్ద ముగ్గురు ప్రయాణికులు బస్సు ఎక్కారు. సూరారం వద్ద ఎక్కిన గుణసాయి కిటికీలోంచి దూకి సురక్షితంగా బయటపడగా.. మరో వ్యక్తి ప్రశాంత్‌ ఫోన్‌ సిచ్చాఫ్‌ వస్తోంది. జేఎన్‌టీయూ వద్ద ఎక్కిన ముగ్గురిలో ఒకరు సురక్షితంగా బయటపడగా.. మరో ఇద్దరి ఫోన్లు స్విచ్చాఫ్‌ వస్తున్నాయి.

కర్నూలు బస్సు ప్రమాద ఘటన.. వెలుగులోకి షాకింగ్ నిజాలు

కర్నూలు జిల్లాలోని చిన్నటేకూరులో ప్రమాదానికి గురైన బస్సుపై తెలంగాణలో 16 చలాన్లు ఉన్నాయి. రూ.23,120 ఫైన్లు పెండింగ్‌లో ఉన్నాయి. 27 జనవరి 2024 నుంచి.. 9 అక్టోబర్ 2025 వరకు 16 సార్లు ట్రాఫిక్ నిబంధనల ఉల్లంఘనలు జరిగాయి. 9 సార్లు నో ఎంట్రీ జోన్‌లోకి బస్సు ప్రవేశించింది. హైస్పీడ్, డేంజరస్ డ్రైవింగ్ విభాగంలోనూ జరిమానాలున్నాయి.
ఈ ఏడాది మార్చి 31వ తేదీన బస్సు ఫిట్‌నెస్ వాలిడిటీ ముగిసింది. ఇన్సూరెన్స్, పొల్యూషన్ వాలిడిటీ కూడా 2024ఏప్రిల్ 2వ తేదీతో ముగిసింది. ఇన్సూరెన్స్ వాలిడిటీ కూడా గత ఏడాది ఏప్రిల్ 20న ముగిసింది.

వేమూరి వినోద్ కుమార్ వేమూరి కావేరి ట్రావెల్స్ పేరిట ఈ బస్సులు నడుపుతున్నారు. బస్సును డయ్యూ డామన్ లో మొదట రిజిస్టర్ చేశారు. తర్వాత ఒడిశా రాయగడ ఆర్టీవో కి బదిలీ చేసి ఆలిండియా ట్రాన్స్పోర్ట్ పర్మిట్ పొందారు. నడిపేది మాత్రం బెంగళూరు హైదరాబాద్ మధ్య కావడం గమనార్హం.