Pinnelli Ramakrishna | వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి అరెస్టు.. మాచర్ల కోర్టుకు తరలింపు

వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావుపేటలో ఆయన్ను అరెస్టు చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు

  • Publish Date - June 26, 2024 / 04:59 PM IST

విధాత, హైదరాబాద్ : వైసీపీ మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణా రెడ్డిని పోలీసులు అరెస్టు చేశారు. నరసరావుపేటలో ఆయన్ను అరెస్టు చేసి ఎస్పీ కార్యాలయానికి తరలించారు. అక్కడి నుంచి కాసేపట్లో మాచర్ల కోర్టుకు తరలించనున్నారు. ఈవీఎం ధ్వంసం, అడ్డుకున్నవారిపై దాడి సహా పలు కేసుల్లో పిన్నెల్లి ముందస్తు బెయిల్ పిటిషన్లను హైకోర్టు కొట్టివేయడంతో పోలీసులు ఆయనను అరెస్టు చేశారు. సార్వత్రిక ఎన్నికల సందర్భంగా గొడవలకు పాల్పడిన మాచర్ల అసెంబ్లీ నియోజకవర్గం వైసీపీ అభ్యర్థి పిన్నెల్లి రామకృష్ణారెడ్డిపై నమోదైన నాలుగు కేసులలో అరెస్టు నుంచి రక్షణ కల్పించేందుకు ఉన్నత న్యాయస్థానం నిరాకరించిన విషయం తెలిసిందే. గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను రద్దు చేసిన ధర్మాసనం నాలుగు ముందస్తు బెయిల్ పిటిషన్లను బుధవారం తిరస్కరించింది.

ఎన్నికల పోలింగ్ రోజు పాల్వయిగేటు పోలింగ్ బూత్‌లో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి ఈవీఎంను బద్దలుకొట్టడంతో పాటు అడ్డుకోబోయిన టీడీపీ ఏజెంట్ నంబూరి శేషగిరిరావుపై దాడి చేసి, హత్యాయత్నానికి పాల్పడ్డారు. దీనిపై ప్రశ్నించిన చెరుకూరి నాగశిరోమణి అనే మహిళను దుర్భాషలాడి బెదిరించారు. అలాగే పోలింగ్ మరుసటిరోజు పిన్నెల్లి, ఆయన తమ్ముడు వెంకట్రామిరెడ్డి అనుచరులతో కలిసి కారంపూడిలో అరాచకం సృష్టించారు. సీఐ నారాయణస్వామిపై దాడిచేసి గాయపరిచారు. వీటన్నింటి పైనా పోలీసులు కేసులు నమోదు చేశారు. ముందస్తు బెయిల్ కోసం పిన్నెల్లి రామకృష్ణారెడ్డి దాఖలు చేసిన నాలుగు పిటిషన్లు జూన్ 20న హైకోర్టులో వాదనలు ముగియగా.. ధర్మాసనం బుధవారం తీర్పు వెలువరించింది. ముందస్తు బెయిల్ నిరాకరించిన నేపథ్యంలో పిన్నెల్లిని పోలీసులు అరెస్టు చేశారు.

Latest News