అమరావతి : మొంథా తుపాన్ నేపథ్యంలో రైల్వేశాఖ అప్రమత్తమైంది. విశాఖ మీదుగా ప్రయాణించే 43 రైళ్ళను రద్దు చేసింది. తుపాన్ నేపథ్యంలో ముందస్తు అప్రమత్తతలో భాంగా ఈ నెల 27, 28, 29 తేదీలలో పలు రైళ్లను రద్దు చేస్తున్నట్లుగా ఈస్ట్ కోస్ట్ రైల్వే శాఖ పేర్కొంది. ప్రయాణికులు ముందస్తుగా సమాచారం తెలుసుకోవాలని సూచించింది.
విద్యాసంస్థలకు 31 వరకు సెలవులు
మొంథా తుపాను తీవ్రత దృష్ట్యా కాకినాడ జిల్లాలో అన్ని పాఠశాలలు, కళాశాలలకు ఈ నెల 27 నుంచి 31 వరకు కలెక్టర్ సెలవులు ప్రకటించారు. అటు తుఫాన్ దెబ్బకు కాకినాడ, విశాఖ, మచిలీపట్నం సహా పలు పోర్టులను మూసివేశారు. కాకినాడ సమీపంలో తుపాను తీరం దాటుతుందనే హెచ్చరికల నేపథ్యంలో ఈ ఓడరేవుకు ప్రమాద హెచ్చరిక జారీచేయడంతో యాంకరేజ్ పోర్టుతో పాటు, డీప్ సీ పోర్టును మొత్తం ఖాళీ చేశారు. ఎరువులు, పంచదార, బొగ్గు, గ్రానైట్, వంట నూనె, బియ్యం నిల్వలతో ఉన్న 15 నౌకలను సముద్రంలోనే సురక్షిత ప్రాంతానికి తరలించారు. సముద్రం మధ్యలోని హోప్ ఐలాండ్‌లో ఉంటున్న 110 మంది మత్స్యకారులను కాకినాడ సమీపంలోని తూరంగి కాలనీకి తరలించారు. తీరప్రాంత గ్రామస్థులను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు ఏర్పాట్లు చేశారు. విశాఖలో హార్బర్ కే 700బోట్లు పరిమితమయ్యాయి. అన్ని పోర్టుల్లో మూడో ప్రమాద హెచ్చరికలు జారీ చేశారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యల కోసం రంగంలో దిగాయి.
