Site icon vidhaatha

నిజం గెలవాలి.. నారా భువనేశ్వరి పిలుపు

విధాత : టీడీపీ అధినేత, మాజీ సీఎం చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి బుధవారం ఉదయం తిరుపతి జిల్లాలో నిజం గెలవాలి పేరుతో యాత్ర ప్రారంభించారు. ముందుగా నారావారిపల్లెలో ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులు అర్పించారు. అనంతరం చంద్రబాబు అరెస్టుతో ఆవేదనతో మృతి చెందిన పార్టీ కార్యకర్తల కుటుంబాలను ఆమె పరామర్శించారు. ముందుగా చంద్రగిరి బజారువీధిలో పార్టీ కార్యకర్త దివంగత ప్రవీణ్‌రెడ్డి ఇంటికి వెళ్లిన భువనేశ్వరి ఆ కుటుంబాన్ని పరామర్శించి ఆర్థిక సాయం అందించారు.

అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. చంద్రగిరి నియోజకవర్గం ఆగరాలలో నిజం గెలువాలి కార్యక్రమంలో భువనేశ్వరి మాట్లాడుతూ నిజం గెలవాలి, నిజమే గెలవాలి, సత్యమేవ జయతే అని నారా భువనేశ్వరి నినాదాలు చేయించారు. చంద్రబాబు అరెస్టుతో రాష్ట్రాన్ని, న్యాయాన్ని నిర్భందించారని విమర్శించారు. నిజం గెలవటం ఒక పోరాటమని, ఆ పోరాటం నాది మాత్రమే కాదన్నారు. మన అందరిదని, రాష్ట్రం భవిష్యత్తు కోసం ఈ పోరాటమన్నారు. ఎన్టీఆర్ కుమార్తెగా గర్విస్తున్నానని, ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా చాలా సేవలు చేశానని, 3 వేల మంది అనాధ పిల్లలకు చదువు చెప్పిస్తున్నామన్నారు. తిరుపతిలో వరదలు వస్తే వారికి అండగా నిలబడ్డామన్నారు. చంద్రబాబును నేను ఆయన ఎదురుగా ఎప్పుడు పొగడ లేదని, ఆయన నెగెటివ్ పాయింట్స్ నేను చెప్పేదాన్నినన్నారు. విభజన రాష్ట్రంలో ఆయన పడిన తపనను చూసి ఎన్నో సార్లు ఆయన ఆరోగ్యం పై ఆందోళన చెందానని, ఐటీ విషయంలో నేను నెగిటివ్ గా చెపితే, భవిష్యత్తులో చూడమని చెప్పారన్నారు.

అలాంటి విజనరీ పై తప్పుడు కేసులు పెట్టారని, మొదట మూడు వేల కోట్లు అన్నారని, తర్వాత 300 కోట్లు అన్నారని, తర్వాత 27 కోట్లు అంటున్నారని, వాళ్ళ ఆలోచన ఎంత దిగజారుతోందన్నారు. కుటుంబంలోని అందరిపైనా కేసులు పెడుతామంటున్నారని, ఎవరిని కలిసినా 20, 30 కేసులు ఉన్నాయి అంటున్నారని, ఈ ప్రభుత్వానికి ఇదే ద్యాస తప్ప ప్రజా సంక్షేమం పట్టడం లేదన్నారు. తప్పుడు కేసులు పెట్టడమే. పరిపాలనగా మారిందని, భయ పెట్టడం తప్ప అభివృద్ధి లేదని, ఏ రాష్ట్రానికి ఇలాంటి కష్టం రాకూడదన్నారు. నిజాన్ని గెలిపించేందుకు చేయిచేయి కలిపి ముందుకు వెళ్దామన్నారు. చంద్రబాబునీ అరెస్ట్ చేస్తే ఆయన మానసికంగా శారీరకంగా కృంగి పోతారనిని వాళ్ళు అనుకుంటున్నారని, ఆయనది స్ట్రాంగ్ పర్శనాలిటీ అన్నారు. ఆయన ఇంకా ధైర్యంగా ముందుకు వచ్చి ప్రజలకు సేవలు అందిస్తారన్నారు.

భారతదేశం ప్రజాస్వామ్య దేశం, మన హక్కులు కాలరాస్తున్నారని, అడుగు వెనక్కు వేయకూడదని, తెలుగు పౌరుషం ఎంటో వారికి చూపించాలన్నారు. నారా భువనేశ్వరి తొలి విడత చంద్రగిరి, తిరుపతి, శ్రీకాళహస్తి నియోజకవర్గాల్లో మూడు రోజుల పర్యటన చేపట్టనున్నారు. మృతి చెందిన టీడీపీ నాయకుల, కార్యకర్తల కుటుంబాలను పరామర్శిస్తారు. మధ్యాహ్నం తర్వాత నుంచి మహిళలతో ముఖాముఖీ సమావేశాల్లో పాల్గొంటారు. 26న గురువారం తిరుపతిలో, 27న శుక్రవారం శ్రీకాళహస్తిలోనూ పర్యటిస్తారు.

Exit mobile version