విధాత:శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి,రాష్ట్ర పాఠశాల విద్య నియంత్రణ, పర్యవేక్షణ కమిషన్ సీఈఓ ఆలూరు సాంబశివారెడ్డి కుమారుడు విరాట్ ఆలూరు పుట్టినరోజు సందర్భంగా నార్పల ప్రభుత్వాసుపత్రికి రూ.14 లక్షల విలువచేసే అల్ట్రాసౌండ్ స్కానింగ్ మిషన్ విరాళంగా ఇచ్చారు.
తమ కుమారుడి పుట్టినరోజు నాడు వారు ప్రతి ఏడాది సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తూ వస్తున్నారు.
ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి శింగనమల నియోజకవర్గ ప్రజలకు ఎన్నికలప్పుడు చేసిన వాగ్దానాన్ని ఈరోజు నెరవేర్చారు.శింగనమల నియోజకవర్గం యొక్క భౌగోళిక విస్తృతిని దృష్టిలో పెట్టుకొని పద్మావతి ఈ వాగ్దానం చేశారు. గర్భవతులు స్కానింగ్ చేసుకోవాలంటే జిల్లా కేంద్రమైన అనంతపురం వెళ్లాలి. రవాణా ఖర్చుతో పాటు స్కానింగ్ కయ్యే ఖర్చు భరించే స్థితిలో చాలా మంది లేరు.దీనివల్ల చాలామంది గర్భవతులు స్కానింగ్ చేసుకోకుండానే బిడ్డలకు జన్మనిస్తున్నారు.పోషకాహార లోపం, అవగాహన లేమి,ఆరోగ్యంపై ఉదాసీనత వంటి కారణాల వల్ల శిశుమరణాలు జరుగుతున్నాయి.నియోజకవర్గం మొత్తానికి ఒక మొబైల్ స్కానింగ్ మిషన్ దీనికి ఏకైక పరిష్కారమని ఎమ్మెల్యే భావించారు. అయితే ప్రస్తుతానికి సాంకేతిక సమస్య వల్ల ఈ స్కానింగ్ మిషన్ నార్పల ప్రభుత్వ ఆసుపత్రికి మాత్రమే పరిమితమైంది.మున్ముందు దీని సేవలు నియోజకవర్గ వ్యాప్తంగా అందించనున్నారు.
ఈ నేపథ్యంలో ప్రభుత్వాసుపత్రికి అల్ట్రా సౌండ్ స్కానింగ్ మిషన్ ని అందించారు. దీనివల్ల గర్భిణుల్లో పౌష్టికాహార లోపాలను గమనించి, వారికి తగిన వైద్యసేవలు అందిస్తే, శిశు మరణాలు తగ్గే అవకాశం ఉంది. అలాగే గర్భవతులు ఆరోగ్యకరమైన బిడ్డకు జన్మనిస్తారు.
ఇలా ప్రతిరోజు ప్రతిక్షణం, ప్రజలకు ఏం చేస్తే బాగుంటుందని ఆలోచిస్తూ, అవకాశం ఉన్న అన్ని మార్గాల ద్వారా ప్రజాసేవ చేస్తున్న ఆలూరు దంపతులకు ధన్యవాదాలు చెబుతూ, రాబోవు రోజుల్లో మరిన్ని సేవా కార్యక్రమాలతో ముందడుగు వేస్తారని అందరూ ఆశిస్తున్నారు.
ప్రతి శుక్రవారం మరియు ప్రతి నెలా 9వ తేదీ గైనకాలజిస్ట్ ద్వారా స్కానింగ్ నిర్వహిస్తామని, గర్భవతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని, ఆరోగ్యాన్ని పరిరక్షించుకోవాలని జిల్లా వైద్యాధికారి డాక్టర్. కామేశ్వరరావు కోరారు.
ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ నాగలక్ష్మి సెల్వరాజన్, ఎస్పీ ఫకీరప్ప , జాయింట్ కలెక్టర్ సిరి మరియు అధికారులు హాజరయ్యారు.