Site icon vidhaatha

Peddireddy | అగ్నిప్రమాదంపై దర్యాప్తు చేయించుకోండి.. ఆ ఘటనతో నాకేమీ సంబంధం లేదు: మాజీ మంత్రి పెద్దిరెడ్డి

విధాత, హైదరాబాద్‌: అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్డీఓ ఆఫీసులో అగ్ని ప్రమాద ఘటనలో తన ప్రమేయంపై ఏ ఆధారాలు ఉన్నా చూపాలని, వాటిని నిరూపించాలని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సవాల్‌ చేశారు. ఆ ఘటనతో తనకే మాత్రం సంబంధం లేదని, అందుకే ఎవరితో, ఏ దర్యాప్తు జరిపినా తనకేం ఇబ్బంది లేదని ఆయన స్పష్టం చేశారు. హైదరాబాద్‌ లో బుధవారం రామచంద్రారెడ్డి మీడియాతో మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయాల్లోకి వచ్చిన నాటి నుంచి తమకు వ్యతిరేకంగా పని చేస్తున్నారని, జిల్లాలో ఆయనను ఎదుర్కొని రాజకీయాలు చేస్తున్నందువల్లనే, ఇలా టార్గెట్‌ చేసి, కుట్రలతో తానెలాంటి తప్పు చేయకపోయినా, దోషిని చేసే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆక్షేపించారు.

అదే పనిగా తన వ్యక్తిత్వ హననం చేస్తున్నారని, వాస్తవాలతో సంబంధం లేకుండా, తమ అనుకూల పత్రికల్లో దుష్ప్రచారం చేసి, వాటిని నిజాలుగా నమ్మించే ప్రయత్నం చేస్తున్నారని రామచంద్రారెడ్డి తెలిపారు. దానికి వత్తాసుగా ముఖ్యమంత్రి మొదలు, మంత్రులు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని, తన దోషిత్వంపై ఏ ఆధారాలు లేకపోయినా, అదే పనిగా బురద చల్లుతున్నారని చెప్పారు. మదనపల్లెలో అగ్ని ప్రమాదం జరిగి, రికార్డులు తగలబడ్డాయని చెబుతున్నారన్న రామచంద్రారెడ్డి, నిజానికి అవన్నీ తహసీల్డార్‌ ఆఫీస్, ఆర్డీఓ ఆఫీస్, కలెక్టర్‌ ఆఫీస్‌లో కూడా ఉంటాయని గుర్తు చేశారు.

మదనపల్లె ఆర్డీఓ ఆఫీస్‌లో అగ్ని ప్రమాదం కేసు దర్యాప్తును సీబీఐకి అప్పగిస్తున్నారన్న ఆయన, తామే తప్పు చేయనందువల్ల, ఎవరు దర్యాప్తు చేసినా తమకెలాంటి భయం లేదన్నారు. తప్పుడు పనులు చేయాల్సిన అవసరం తనకు లేదని, తను 7సార్లు ఎమ్మెల్యేగా గెల్చానని, తన కుమారుడు మూడుసార్లు ఎంపీ కాగా, తన తమ్ముడు కూడా 3సార్లు ఎమ్మెల్యే అని గుర్తు చేశారు. ప్రజాదరణ ఉంది కాబట్టే, ఇన్నాళ్లు రాజకీయాల్లో కొనసాగుతున్నామని రామచంద్రారెడ్డి తెలిపారు.

Exit mobile version