Site icon vidhaatha

పారదర్శకత కోసమే గ్రామస్ధాయిలో రిజిస్ట్రేషన్లు

విధాత‌: ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు 51 గ్రామ సచివాలయాలలో త్వరితగతిన రిజిస్ట్రేషన్ సేవల ప్రారంభంపై దృష్టి సారించాలని రాష్ట్ర రెవిన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డాక్టర్ రజత్ భార్గవ అన్నారు. రిజిస్ట్రేషన్ ప్రక్రియలో పారదర్శకత తీసుకురావాలన్న తలంపుతోనే సిఎం ఈ కార్యక్రమానికి ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్నారని వివరించారు. సచివాలయంలోని తన ఛాంబర్ లో గురువారం స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖపై ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సమీక్ష నిర్వహించారు. ప్రత్యేకించి గ్రామ స్దాయిలో రిజిస్ట్రేషన్లు అన్న అంశంపై లోతుగా చర్చించారు. ఈ సందర్భంగా రజత్ భార్గవ మాట్లాడుతూ ప్రజల ఇంటి ముగింటకే వివిధ ప్రభుత్వ సేవలను అందించాలన్న లక్ష్యం మేరకు విభిన్న విభాగాల మధ్య సమన్వయం సాధించటానికి ప్రభుత్వం ఇప్పటికే పలు చర్యలు తీసుకుందన్నారు.

రిజిస్ట్రేషన్ శాఖ సేవలను వేగవంతం చేసే క్రమంలో గ్రామ స్థాయిలో రిజిస్ట్రేషన్ సేవలకు శ్రీకారం చుడుతూ కృష్ణా జిల్లా జగ్గయ్యపేట మండలం, తక్కెళ్లపాడు గ్రామంలో చేపట్టిన పైలెట్ ప్రాజెక్టు విజయవంతం అయ్యిందన్నారు. ఈ నేపధ్యంలో పంచాయితీ రాజ్, గ్రామీణాభివృద్ది, సర్వే సెటిల్మెంట్, భూమి రికార్డుల శాఖల సమన్వయంతో రీసర్వే ప్రాజెక్ట్ ఫేజ్ -1 పరిధిలోని 51 సచివాలయాలలో రిజిస్ట్రేషన్ సేవలను ప్రారంభిస్తున్నామన్నారు. 1908 రిజిస్ట్రేషన్ చట్టం సెక్షన్ 6ను అనుసరించి నిర్ధేశించిన 51 గ్రామ సచివాలయాలను సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలుగా సేవలు అందించటానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని డాక్టర్ రజత్ భార్గవ అధికారులను కోరారు. రిజిస్టేషన్ల ప్రక్రియలో ప్రజలు ఎటువంటి ఇబ్బందులు పడకుండా సచివాలయ కార్యదర్శులకు అవసరమైన పూర్తి స్దాయి శిక్షణను అందించాలని స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ కమీషనర్ శేషగిరి బాబును ఆదేశించారు. ఇందుకు అవసరమైన కార్యాచరణ సిద్దం చేయాలన్నారు. సమావేశంలో స్టాంపులు రిజిస్ట్రేషన్ల శాఖ అదనపు ఇన్ స్పెక్టర్ జనరల్ ఉదయ భాస్కర్, ఉప ఇన్ స్పెక్టర్ జనరల్ నాగలక్ష్మి తదితరులు పాల్గొన్నారు.

Exit mobile version