OMC Case | ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు కీలక తీర్పు వెలువరించింది. కేసులో ఐదుగురిని దోషులుగా తేల్చింది. ఇద్దరిని నిర్ధోషులుగా ప్రకటించింది. ఏ1 బీ.వీ.శ్రీనివాసరెడ్డి, ఏ2 గాలి జనార్దన్‌రెడ్డి, ఏ3 గనుల శాఖ డైరక్టర్ వీడీ రాజగోపాల్, ఏ4 ఓఎంసీ కంపెనీ, జనార్ధన్ రెడ్డి పీఏ ఏ 7 అలిఖాన్ లను కోర్టు దోషులుగా ప్రకటించి శిక్షలు ప్రకటించింది. శ్రీనివాస్ రెడ్డి, జనార్ధన్ రెడ్డితో పాటు ఐదుగురు నిందితులకు ఏడేళ్ల జైలు శిక్ష ఖరారు చేసింది. కేసులో అప్పటి మైనింగ్ శాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డితో పాటు మాజీ ఐఏఎస్ కృపానందంలను నిర్ధోషులుగా ప్రకటించింది.
ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ 2009లో ఓఎంసీ కేసు నమోదు, 2011లో గాలి జనార్థన్ రెడ్డిని అరెస్టు చేసిన సీబీఐ 2012లో చార్జిషీట్ దాఖలు చేసింది. 16ఏళ్ల తర్వాతా ఈ కేసులో తీర్పు వెలువడింది. కేసులో కీలక నిందితురాలుగా ఉన్న ఐఏఎస్ అధికారి శ్రీలక్ష్మిపై అభియోగాలను గతంలో హైకోర్టు కొట్టివేసింది. ఇప్పుడు అనాటి మంత్రి సబితాఇంద్రారెడ్డికి క్లీన్ చీట్ ఇచ్చింది. ఈ కేసులో మొత్తం 9మందిని నిందితులుగా చేర్చింది. మరో అధికారి ఏ5 లింగారెడ్డి కేసు విచారణ దశలోనే చనిపోయారు. శ్రీనివాస్ రెడ్డి గాలి జనార్థన్ రెడ్డి వ్యాపార భాగస్వామిగా ఉన్నారు. ఇప్పటికే ఈ కేసులో జనార్ధన్ రెడ్డి నాలుగేళ్ల శిక్ష అనుభవించారు. తను చేసిన సేవా కార్యక్రమాలు, వయసు..కంపెనీలు, ఉద్యోగ బాధ్యతల నేపథ్యంలో శిక్ష తగ్గించాలని జనార్ధన్ రెడ్డి చేసిన అభ్యర్థనను కోర్టు తిరస్కరించింది. కోర్టు తీర్పు అనంతరం నిందితులను జైలుకు తరలించనున్నారు. 244మంది సాక్ష్యులను విచారించి తీర్పు వెలువరించింది.
పన్నెండేళ్ల వేదనకు కోర్టు తీర్పుతో ఉపశమనం: సబితా ఇంద్రారెడ్డి
ఓబుళాపురం మైనింగ్ కేసులో ఏ తప్పు చేయకపోయినా కోర్టు మెట్లు ఎక్కానని మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలు వచ్చినప్పుడల్లా అవినీతి పరురాలు అంటూ ప్రచారాలు చేశారని..చేయని తప్పుకు పన్నెండున్నర ఏళ్ళు అనేక అపవాదులు భరించానన్నారు. ఆలస్యమైనా న్యాయస్థానాలు నాకు న్యాయం చేశాయని సంతోషం వ్యక్తం చేశారు. న్యాయ వ్యవస్థ ద్వారా న్యాయం కలుగుతుందని నమ్మాను న్యాయం జరిగిందని వ్యాఖ్యానించారు. ఎన్ని అపవాదులు వచ్చినా నా నియోజకవర్గ ప్రజలు అండగా నిలిచారన్నారు. ఓబుళాపురం మైనింగ్ కేసులో నాంపల్లి సీబీఐ కోర్టు తుది తీర్పు వెల్లడించిన సంగతి తెలిసిందే. 15 ఏండ్ల పాటు సుదీర్ఘ విచారణ అనంతరం ఈ కేసులో మొత్తం ఐదుగురిని దోషులుగా, ఇద్దరిని నిర్దోషులుగా ప్రకటించింది. ఈ కేసులో అప్పటి గనుల శాఖ మంత్రిగా ఉన్న సబితా ఇంద్రారెడ్డికి క్లీన్ చీట్ ఇచ్చింది.