- ముగిసిందనుకున్న కేసు మళ్లీ మొదటికి
- ఇప్పటికే గతంలో జైలు జీవితం..
- మానసిక వేదనతో తీవ్ర అనారోగ్యం
- మళ్లీ కోలుకుని విధుల్లో చేరిన ఐఏఎస్
- తెలివైన, చురుకైన అధికారిణిగా ప్రఖ్యాతి
- చిన్న తప్పుతో పదిహేనేళ్లుగా కోర్టుల చుట్టూ
- ఐఏఎస్ అధికారి ఎర్రా శ్రీలక్ష్మి వ్యథ ఇది!
IAS Srilakshmi | ఆమె చిన్న వయస్సులో ఐఏఎస్‌కు ఎంపికయ్యారు. జీవితంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి స్థాయి వరకు వెళ్తుందని తల్లిదండ్రులు, బంధువులు ఆనందపడ్డారు. కానీ.. నాటి ప్రభుత్వ పెద్దల ఒత్తిడితోనో, మరో కారణంతోనో చేసిన చిన్న తప్పు.. ఆమెకు నిత్య నరకం చూపిస్తున్నది. ముగిసిపోయిందనుకున్న కేసు.. మళ్లీ నెత్తిమీదకు వచ్చింది. ఆమె మరెవరో కాదు.. వైఎస్ ప్రభుత్వ హయాంలో ఒక వెలుగు వెలిగిన ఐఏఎస్ అధికారిణి ఎర్రా శ్రీలక్ష్మి (1988 బ్యాచ్). ఓబుళాపురం మైనింగ్ కంపెనీ అనుమతిలో ‘క్యాప్టివ్’ అనే పదం తొలగించినందుకు గత పదిహేనేళ్లుగా ఆమె కోర్టు చుట్టూ తిరుగుతున్నారు. ఇప్పటికే ఒకసారి ఇదే కేసులో జైలుకు వెళ్లిన ఆమె.. తాజా విచారణలో ఏ మాత్రం తేడా వచ్చినా.. మళ్లీ జైలు ఊచలు లెక్కబెట్టే ప్రమాదంలో ఉన్నారు.
ఇదీ ఆమె చేసిన పొరపాటు కథ..
ఏపీలోని అనంతపురం జిల్లాలో ఓబుళాపురం మైనింగ్ కంపెనీ (ఓఎంసీ) అక్రమ తవ్వకాల కేసులో సుప్రీంకోర్టు రెండు రోజుల క్రితం సంచలన తీర్పునిచ్చింది. ఈ కేసులో సీనియర్ ఐఏఎస్ అధికారిణి శ్రీలక్ష్మీకి విముక్తి కల్పిస్తూ తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చిల్లకూరు సుమలత 2022 ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ తీర్పును సీబీఐ సుప్రీంకోర్టులో సవాల్ చేసింది. సీబీఐ వాదనలను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు ఈ కేసును తెలంగాణ హైకోర్టు మళ్లీ విచారించాలని చెప్పడమే కాకుండా.. విచారణను కూడా మూడు నెలల్లో పూర్తి చేయాలని గడువు విధించడం గమనార్హం. వై శ్రీలక్ష్మీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2006 నుంచి 2009 వరకు పరిశ్రమలు, వాణిజ్య శాఖ కార్యదర్శిగా విధులు నిర్వర్తించారు. ఆ సమయంలో ఓఎంసీకి రెండు మైనింగ్ లీజులను ప్రభుత్వం కట్టబెట్టింది. అనంతపురం జిల్లా బళ్లారి రిజర్వ్ ఫారెస్టు పరిధిలోని ఓబుళాపురం, మాలపనగుడిలో గనుల తవ్వకానికి అనుమతులు ఇచ్చారు. అప్పటి మంత్రివర్గం నిర్ణయం కానీ, సంబంధిత గనుల మంత్రి నోట్ ఫైల్‌లో గాని.. ‘క్యాప్టివ్’ అని ప్రస్తావించారు. ఆ పదాన్ని శ్రీలక్ష్మి తొలగించి, ఉత్తర్వులు జారీ చేయడం ఈ మొత్తం కేసులో కీలకంగా మారింది. క్యాప్టివ్ అంటే మన సొంత ఉత్పత్తి కోసం ముడి ఖనిజం వాడుకోవడం. పైవారి సిఫారసులు, భారీ ఎత్తున ముడుపులు అందడంతో ఆ పదం తొలగించారని అప్పట్లో గుసగుసలాడారు. క్యాప్టివ్ పదాన్ని తీసేయడంతో ఓఎంసీ యజమాని గాలి జనార్దనరెడ్డి అడ్డగోలుగా గనులు తవ్వుకుని చైనాతో పాటు విదేశాలకు అమ్ముకుని వేలాది కోట్లకు పడగలెత్తాడు. కర్ణాటకలో ప్రభుత్వాన్ని పడగొట్టే స్థాయికి ఎదగడంతో పాటు ఉమ్మడి ఏపీ రాజకీయాల్లో కీలకంగా మారారు. ఢిల్లీలోని కాంగ్రెస్, బీజేపీ పెద్దలు చర్చించుకుని ఆందోళనకు గురయ్యే స్థాయికి చేరుకున్నారు.
ఈ విషయం ఎందుకు ప్రస్తావిస్తున్నామంటే పదిహేను సంవత్సరాలుగా నడుస్తున్న ఈ కేసు అనూహ్యంగా ఊహించని మలుపులు తిరుగుతున్నది. ముగింపు దశకు వచ్చిందని అనుకుంటున్న తరుణంలో దేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పుతో మళ్లీ మొదటికి వచ్చింది. మంగళవారం నాంపల్లిలోని సీబీఐ ప్రత్యేక కోర్టు గాలి జనార్ధన్ రెడ్డి, బీవీ శ్రీనివాస్ రెడ్డి, ఏపీ మైనింగ్ డైరెక్టర్ వీడీ రాజగోపాల్‌తోపాటు జనార్థన్ రెడ్డి పీఏ మెహపుజ్ అలీఖాన్‌కు ఏడేళ్లు జైలు శిక్ష విధించింది. ఆ మరుసటి రోజు అనగా బుధవారం సుప్రీంకోర్టు శ్రీలక్ష్మీకి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన బెయిల్ తీర్పును రద్దు చేసింది. తెలంగాణ హైకోర్టు మూడు నెలల్లో విచారణ పూర్తి చేయాలని తీర్పునివ్వడం ఐఏఎస్, రాజకీయ వర్గాల్లో సంచలనం సృష్టించింది. దేశంలో పనిచేస్తున్న ఐఏఎస్ అధికారులకు వై శ్రీలక్ష్మీ కేసు ఒక గుణపాఠం, మరో ఉదాహరణ కూడానని రిటైర్డ్ ఐఏఎస్ అధికారులు చెబుతున్నారు.
తెలివైన అధికారిణి శ్రీలక్ష్మి
నిజానికి శ్రీలక్ష్మి చురుకైన, తెలివైన అధికారిణిగా పేరు తెచ్చుకున్నారు. కానీ అక్రమార్కులతో చేతులు కలపడంతో భవిష్యత్తులో అత్యున్నత పోస్టులకు ఎదుగుతారని భావించిన ఆమె.. చివరకు జైలుపాలై, ఆరోగ్యం దెబ్బతిని, మానసిక వేదన అనుభవించి, పరువు బజారుపాలై, ఇప్పుడు మళ్లీ కోర్టు చుట్టూ తిరగాల్సిన దురవస్థకు వచ్చారు. ఈ కేసులో ఇదే కీలకమైనప్పుడు ఆమె నిర్దోషి ఎలా అవుతుందనేది సుప్రీంకోర్టు తాజా ఆదేశాల సారాంశంగా భావించాలి. సుప్రీంకోర్టు తీర్పుతో ఓఎంసీ కేసు మూడు నెలల్లో ముగింపునకు రానున్నది. తాజా తీర్పులను గమనిస్తే ఏపీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసు కూడా త్వరలోనే ఓ కొలిక్కి రావచ్చు. ఆంధ్రా రాజకీయాల్లో జగన్ భవిష్యత్తులో రాజకీయాలపై ఆశ వదులుకునేలా ఈ కేసులపై కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తుందనే రాజకీయ అంచనాలు ఉన్నాయి. దానితోపాటు లిక్కర్ స్కాం కేసును బలంగా తీసుకెళ్లాలనే దృఢ నిశ్చయంతో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు ఉన్నట్టు కనిపిస్తున్నది. జగన్ బెయిల్ రద్దు కోసం సీబీఐతో పిటిషన్ వేయిస్తారా? అనే సందేహాలూ తలెత్తుతున్నాయి.
శ్రీలక్ష్మికి సంబంధించిన ఆ వార్తకు ఇలా ప్రాధాన్యం!
జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తరువాత శ్రీలక్ష్మీకి అన్నిరకాలుగా అండగా నిలబడ్డారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెద్దలు, అప్పటి తెలంగాణ ముఖ్యమంత్రి కే చంద్రశేఖర్ రావుతో మాట్లాడి తెలంగాణ కేడర్ నుంచి ఏపీ కేడర్‌కు పర్మినెంట్ గా బదిలీ చేయించారనే చర్చలు నడిచాయి. జగన్ సీఎంగా ఉన్నప్పుడు ఆమెకు ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పదోన్నతులు ఇచ్చారు. అంతా ఇక సాఫీగా సాగిపోతుందనుకున్న తరుణంలో ఆమెను విధి వక్రీకరించింది.
ఇవి కూడా చదవండి..
HYDRA | హైడ్రాపై సీఎం రేవంత్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు
Southwest Monsoon | ముందుగానే నైరుతి రుతుపవనాల రాక! కేరళ తీరానికి ఎప్పుడంటే..
Free Bus Scheme | మహిళల ఉచిత బస్సు ప్రయాణానికి ఆధార్ కార్డే కావాలా?