అమరావతి : మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం నిర్ణయించడం ద్వారా పేదవాడికి ఖరీదైన వైద్యం అందకుండా కుట్ర చేస్తుందని వైసీపీ అధినేత, ఏపీ మాజీ సీఎం వైఎస్.జగన్ విమర్శించారు. గురువారం వర్షంలోనే నర్సీపట్నం మెడికల్ కాలేజీని వైఎస్ జగన్ సందర్శించి మాట్లాడారు. ప్రైవేట్ ఆస్పత్రులు ఎక్కువ ఛార్జీ చేస్తే.. తట్టుకోవడం పేదవాళ్లకు అసాధ్యం అని..అందుకే మా ప్రభుత్వ హయాంలో ప్రతి జిల్లాకు మెడికల్ కాలేజీలను తీసుకొచ్చాం అని జగన్ తెలిపారు. అలాంటి ఆధునిక దేవాలయాలను ఎందుకు ప్రైవేట్ పరం చేస్తున్నారంటూ చంద్రబాబుపై మండిపడ్డారు. అంతా ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా? అందుతుందని ప్రశ్నించారు. పేదల కోసం రాష్ట్రవ్యాప్తంగా 17మెడికల్ కాలేజీలను అందుబాటులోకి తెవడం ద్వారా..నర్సీపట్నంలో 52 ఎకరాల్లో మెడికల్ కాలేజీల నిర్మాణం చేపట్టాం అన్నారు. కోవిడ్ సంక్షోభంలోనూ రూ.500కోట్లు ఖర్చు చేశామని..ఈ మెడికల్ కాలేజీలో పూర్తయితే 600 బెడ్లతో పేదలకు ఉచిత వైద్యం అందేదని గుర్తు చేశారు. ఏడాదికి 150 మెడికల్ కాలేజీ సీట్లను అందుబాటులోకి తెచ్చాం అని..అలాంటి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేస్తే పేదవారికి వైద్యం ఎలా అందుతుందంటూ జగన్ మండిపడ్డారు. కోట్లాది మందికి వైద్యం,విద్య అందించే ఆధునిక దేవాలయాల్ని దగ్గరుండి చంద్రబాబు అమ్మేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని.. 17 మెడికల్ కాలేజీల్లో నిర్మాణాలు ఆపమని ఓ మోమో డిక్లేర్ చేశారని జగన్ వెల్లడించారు. తాము మంజూరు చేసిన మెడికల్ కాలేజీలకు జీవో ఎక్కడుందని స్పీకర్ అయ్యన్నపాత్రుడు అడుగుతున్నారని..ఇదిగో జీవో నెంబర్ 204 అంటూ జగన్ జీవో కాపీని ప్రదర్శించారు. స్పీకర్ పదవిలో ఉండి జీవో నెంబర్ 204 లేదని అబద్ధాలు చెప్పినందుకు మీ పదవికి మీరు అర్హులేనా? అని ఆలోచన చేయాలని జగన్ డిమాండ్ చేశారు.
ఏడాదికి వేయ్యికోట్లు ఖర్చు చేయలేరా..?
17మెడికల్ కాలేజీలకు ఐదేళ్లలో ఐదుకోట్లు.. ఏడాదికి వెయ్యి కోట్లు ఖర్చు చేయలేరా? అంటూ చంద్రబాబును జగన్ ప్రశ్నించారు. అమరావతిలో లక్ష ఎకరాలు సేకరించి.. అక్కడ రోడ్లు వేయడానికి, డ్రైనేజీలు కట్టడానికి, కరెంట్, నీళ్లు ఇవ్వడానికి మొత్తం 50వేల ఎకరాలు.. ఎకరాకు రెండు కోట్లు చొప్పున మొత్తం లక్షకోట్లు కావాలని చెప్పిన చంద్రబాబు.. మెడికల్ కాలేజీలకు రూ. రూ. 4,500 కోట్లు ఖర్చు చేయలేరా? అని నిలదీశారు. ఇప్పుడు 50వేల ఎకరాలు సరిపోవు.. మరో 50వేల ఎకరాలు కావాలని తీసుకుంటున్నారని ఆరోపించారు. ఇలా అమరావతి మొత్తంగా లక్ష ఎకరాలు.. రెండు లక్షల కోట్లు ఖర్చు పెట్టేందుకు సిద్ధమవుతూ.. 70వేల కోట్ల రూపాయల టెండర్లు పిలిచాం అని చెప్పుకుంటూ.. కోట్లాది మందికి మేలు చేసే మెడికల్ కాలేజీలకు ఏడాదికి వెయ్యికోట్లు.. ఐదేళ్లకు ఐదువేల కోట్లు ఖర్చు పెట్టలేక.. ప్రైవేట్ పరం చేయడం ఎంతవరకు సమర్థనీయం అని చంద్రబాబుపై జగన్ విమర్శలు గుప్పించారు.