Southwest Monsoon | భారత్ లోకి నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది ముందుగానే ప్రవేశించనున్నాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఈనెల 13న రుతుపవనాలు దక్షిణ అండమాన్ సముద్రం, ఆగ్నేయ బంగాళాఖాతం..నికోబార్ దీవులలోకి ప్రవేశించే అవకాశం ఉందని ఐఎండీ ప్రకటించింది. సాధారణంగా జూన్ 1వ తేదీ నాటికి కేరళ మీదుగా ఉత్తరం వైపుకు వెళ్లి, జూలై 15 నాటికి దేశం మొత్తానికి విస్తరించడం జరుగుతుంది. అయితే ఈ సంవత్సరం రుతుపవనాలు ఊహించిన దానికంటే ముందుగానే రానున్నాయి.
మే 25 నాటికే కేరళకు!
ఐఏండీ అంచనా మేరకు మే 25 నాటికి రుతుపవనాలు కేరళ తీరాలకు చేరుకుంటాయని అంచనా వేయబడింది. ఇది జూన్ 1 సాధారణ తేదీ కంటే ముందే ఉండవచ్చని తెలిపింది. ఈ సంవత్సరం వర్షాలు 105 శాతం పడతాయని, అంటే సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదవుతుందని ఇప్పటికే వాతావరణ శాఖ ప్రకటించింది. తెలుగు రాష్ట్రాలు ఏపి, తెలంగాణలో సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపింది. ఇది వ్యవసాయానికి ప్రయోజనకరంగా ఉంటుంది.