Site icon vidhaatha

Telangana IAS Officers | ఐఏఎస్‌లూ తస్మాత్ జాగ్రత్త! వైఎస్‌ పాలనలో కేసులు గుర్తులేవా?

Telangana IAS Officers | హైదరాబాద్, జూలై 2 (విధాత) : ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో వైఎస్ రాజశేఖర్ రెడ్డి జమానాలో చోటు చేసుకున్న అక్రమాలు, అవినీతి కుంభకోణాలపై ఇప్పటికీ హైకోర్టు, సుప్రీంకోర్టు, సీబీఐ ప్రత్యేక కోర్టు, ఈడీ కోర్టులలో కేసులు కొనసాగుతున్నాయి. అందులో ఓబులాపురం మైనింగ్, వైఎస్ జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తుల కేసులు, ఎమ్మార్ ప్రాపర్టీస్ ఇలా చెప్పుకుంటూ పోతే చాలానే ఉన్నాయి. ఈ కేసుల్లో సీనియర్ ఐఏఎస్ అధికారులు బూసి శ్యాంబాబు, పీ రమాకాంత్ రెడ్డి, అజయ్ మిశ్రా, కే రత్నప్రభ, బీపీ ఆచార్య, ఎల్వీ సుబ్రహ్మణ్యం, సీవీఎస్‌కే శర్మ, మన్మోహన్ సింగ్, ఎం శామ్యూల్, యారా శ్రీలక్ష్మీ, కృపానందంలపై విచారణలు, కొందరి అరెస్టులు తెలిసిందే. ఈ కేసుల విషయంలో ఐఏఎస్ అధికారులు, అప్పటి మంత్రులు.. తప్పు మీదంటే మీదంటూ పరస్పరం విమర్శలు చేసుకున్నారు. 2011లో అప్పటి కాంగ్రెస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి పీ శంకర్ రావు.. జగన్మోహన్ రెడ్డి అక్రమాస్తులపై సీబీఐ దర్యాప్తు కోరుతూ రిట్ పిటిషన్ దాఖలు చేశారు. ఆ తరువాత సీబీఐ కేసు నమోదు చేసింది. జగన్ తన సంస్థలలో పెట్టుబడులకు ప్రతిఫలంగా వ్యక్తులు, కంపెనీలకు భూములు, గనుల అనుమతులు కేటాయించేలా చేసి వందల కోట్లు వెనకేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. సీబీఐ జగన్‌ను ఏ వన్‌ నిందితుడిగా చేర్చి 2012 మే నెలలో అరెస్టు చేయగా, 2013 సెప్టెంబర్‌లో బెయిల్ వచ్చింది. ఇప్పటికీ కేసులు నడుస్తున్నాయి, కొందరు ఐఏఎస్ అధికారులు కోర్టు వాయిదాలకు హాజరవుతున్నారు. ఈ ఉపోద్ఘాతం ఎందుకు చెప్పాల్సి వస్తున్నదంటే.. ఇంతటి భయంకరమైన కేసలు, తదనంతర పరిణామాలు, సీనియర్ ఐఏఎస్ అధికారుల అరెస్టులు, జైలు జీవితం వంటివి కళ్లముందే ఉన్నా.. తెలంగాణలోని కొందరు సీనియర్ ఐఏఎస్ అధికారులు వాటిని మర్చిపోయినట్టు కనిపిస్తున్నది. తమ బాధ్యతలను గుర్తెరిగి పనిచేయాల్సిన ఐఏఎస్ అధికారులు బీఆర్ఎస్ హయాంలో ముఖ్యమంత్రి, మంత్రులు చెప్పినట్లుగా ఫైళ్లపై సంతకాలు చేసి అడ్డంగా ఇరుక్కుపోయారన్న అభిప్రాయాలు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టులో 25 మంది సీనియర్ ఐఏఎస్ అధికారులు, ఫార్ములా ఈ రేసు కేసులో ఒక ఐఏఎస్ అధికారి విచారణను ఎదుర్కొంటున్నారు. ఉమ్మడి రాష్ట్రంలో మాదిరి.. ఈ తప్పు మాది కాదు అంటే, మాకు సంబంధం లేదనే విధంగా తప్పించుకునే ప్రయత్నాలు చేస్తున్నారు.

దులిపేసుకొనే ప్రయత్నం!

గతంలో కాళేశ్వరం ప్రాజెక్టుకు కర్త, కర్మ, క్రియ అన్నీ తానేన్నట్టు మాట్లాడిన కేసీఆర్.. తన మెదడును రంగరించి.. కాళేశ్వరం డిజైన్‌ చేశానని చెప్పుకొన్నారు. బీఆరెస్‌ నేతలు కూడా అదే ఊదరగొట్టారు. కేసీఆర్‌ ఇంజినీర్‌గా మారి ఆ ప్రాజెక్టు నిర్మించారని చెప్పేవారు. కానీ.. ఇప్పుడు అంతా తూచ్‌ అంటున్నారు. మంత్రిమండలి ఆమోదంతోనే ప్రాజెక్టు నిర్మాణం జరిగిందని, టెక్నికల్ కమిటీ సిఫారసు మేరకు బ్యారేజీ నిర్మాణ ప్రాంతాన్ని మార్చారని బీఆర్ఎస్ నాయకులు ఇప్పుడు వాదిస్తున్నారు. ఇదే విషయాన్ని కేసీఆర్ కూడా కాళేశ్వరం కమిషన్ ముందు వెల్లడించారు. ఫార్ములా ఈ రేసు కేసుపై తెలంగాణ అవినీతి నిరోధక విభాగం (ఏసీబీ) విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. దీనిపై ఈడీ కూడా ఈసీఐఆర్ నమోదు చేసింది. ‘మేము ఆదేశాలు ఇస్తాం, అంత వరకే మా బాధ్యత. అమలు చేయాలా? వద్దా? అనేది కార్యదర్శి చూసుకుంటారు’ అంటూ మాజీ మంత్రి కేటీఆర్ తన విచారణలో తెలిపారు. తనకేమీ తెలియదని, పాపం అంతా అప్పటి మున్సిపల్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అర్వింద్ కుమార్‌దేనని తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారు. కేటీఆర్ విచారణ తరువాత జూలై 1వ తేదీన విచారణకు హాజరు కావాల్సిన అర్వింద్ రాలేదు. దీంతో జూలై 3వ తేదీ గురువారం హాజరు కావాల్సిందిగా ఆయనకు మరోసారి ఏసీబీ నోటీసులు పంపించింది. ఈ విచారణలో అర్వింద్ కుమార్ ఏం చెబుతాడోనని బీఆర్ఎస్ ముఖ్య నాయకులు బిక్కుబిక్కుమంటున్నారు. ఆ తరువాత ఇద్దరిని ఎదురెదురుగా కూర్చోబెట్టి విచారించి సమాచారం రాబట్టనున్నట్లు తెలిసింది. ఇక ఫోన్ ట్యాపింగ్‌ కేసులో ప్రత్యేక విచారణ బృందం (సిట్) విచారిస్తున్నది. దీనిపై బీఆర్ఎస్ ముఖ్య నాయకులు ఇష్టానుసారంగా విమర్శలు గుప్పిస్తున్నారు. తెలంగాణ ఎస్ఐబీలో టీ ప్రభాకర్ రావు ఒక అధికారి మాత్రమే అని బీఆర్ఎస్ నాయకుడు ఆర్ ఎస్ ప్రవీణ్ కుమార్ అంటున్నారు. నోడల్ ఏజెన్సీ, అథారిటీ, రివ్యూ కమిటీలోని వారందరినీ ఎందుకు విచారణ చేయడంలేదనేది ఆయన ప్రశ్న. మాజీ డీజీపీ ఎం మహేందర్ రెడ్డికి ఒక న్యాయం, ప్రభాకర్ రావుకు మరో న్యాయం ఉంటుందా? అనే వాదన లేవనెత్తారు. మాజీ మంత్రి వీ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో అధికారులందరినీ విచారించాలని డిమాండ్ చేశారు. ఇలా ఎవరికి వారు విచారణలపై ఎదురు దాడి చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం తెలంగాణలో నెలకొని ఉన్నది.

సచివాలయం నిబంధనలు ఏం చెబుతున్నాయంటే

తెలంగాణ సచివాలయం బిజినెస్ రూల్స్ ప్రకారం మంత్రులకు సర్వాధికారాలు ఉన్నాయి. కీలక నిర్ణయాలు తీసుకునే అధికారం మంత్రులకు ఉండగా, అందుకు అనుగుణంగా ఆదేశాలు జారీ చేసి అమలు చేయించాల్సిన బాధ్యత ముఖ్య కార్యదర్శులపై ఉంటుంది. మంత్రులు నిబంధనలకు విరుద్ధంగా ఫైళ్లపై సంతకాలు చేస్తే తిరస్కరించి, ప్రధాన కార్యదర్శి ద్వారా ముఖ్యమంత్రికి పంపించే అధికారం ముఖ్య కార్యదర్శులకు ఉంటుంది. ముఖ్యమంత్రి ఆమోదం లభిస్తే సరి లేదంటే ఆ ఫైలు అక్కడితో ఆగిపోతుంది. గత ప్రభుత్వంలో మంత్రులు ఆమోదించిన ఫైళ్లపై సంతకాలు చేసిన పలువురు సీనియర్ ఐఏఎస్ అధికారులు ప్రస్తుతం కాళేశ్వరం కమిషన్, తెలంగాణ ఏసీబీ, ఫోన్ ట్యాపింగ్ సిట్ ముందు విచారణకు క్యూ కట్టిన విషయం తెలిసిందే. మంత్రులు సంతకం చేశారు, తాము కూడా చేశామంటే సరిపోదని సచివాలయం బిజినెస్ రూల్స్‌పై అవగాహన ఉన్న సీనియర్‌ అధికారులు చెబుతున్నారు. చిన్నా చితకా ఫైళ్లపై సంతకాలు చేసే అధికారం మాత్రమే ముఖ్య కార్యదర్శులకు ఉంటుందని, ముఖ్యమైన అధికారాలు మంత్రుల వద్దే ఉంటాయంటున్నారు. గత ప్రభుత్వంలో ముఖ్యమంత్రి కేసీఆర్, అప్పటి నీటి పారుదల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ కుమార్‌కు సూపరింటెండెంట్ ఇంజినీర్ స్థాయి వరకు బదిలీ చేసే అధికారం ఇచ్చారని మరో అధికారి గుర్తు చేశారు. మంత్రులుగా బాధ్యతలు స్వీకరించిన తరువాత తన అధికారం ఏమిటీ? తన వద్ద నుంచి ముఖ్య కార్యదర్శికి ఏం బదలాయించాలి? అనేది మంత్రే నిర్ణయం తీసుకుంటారని, ఆ మేరకు అధికారాలు కట్టబెడతారాని మరో అధికారి పేర్కొన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు అక్రమాల్లో తమకు సంబంధం లేదని, ముఖ్యమంత్రి లేదా మంత్రి చెబితే చేశామని ఐఏఎస్ లు వాంగ్మూలం ఇస్తే అంగీకరించరని మరొకరు వివరించారు.

Exit mobile version