AP Elections 2024 : ఏపీలో ఆగని ఎన్నికల ఘర్షణలు

ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి పార్టీల మధ్య తలెత్తిన ఘర్షణలు రెండో రోజు మంగళవారం కూడా కొనసాగాయి.

  • Publish Date - May 14, 2024 / 05:36 PM IST

రెండుచోట్ల కాల్పులు
కేసులు..అరెస్టులు

విధాత : ఏపీ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల పోలింగ్ సందర్భంగా అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ కూటమి పార్టీల మధ్య తలెత్తిన ఘర్షణలు రెండో రోజు మంగళవారం కూడా కొనసాగాయి. పోలీసు బలగాలు ఎన్నికల అనంతర ఘర్షణలను నివారించేందుకు ప్రయత్నిస్తున్నారు. పల్నాడు, గుంటూరు, మాచర్ల సహా పలు జిల్లాల్లో ఎన్నికల సందర్భంగా రెగిన ఘర్షణల నేపథ్యంలో పరస్పర ప్రతీకార దాడులు చేసుకున్నారు. పల్నాడు జిల్లా కొత్త గణేషునిపాడులో పోలింగ్ రోజు ఘర్షణలో గాయపడిన బాధితులను పరామర్శించేందుకు వచ్చిన వైసీపీ ఎమ్మెల్యే కాసు మహేశ్ రెడ్డి, ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ యాదవ్‌ల కాన్వాయ్‌పై కొంత మంది టీడీపీ కార్యకర్తలు రాళ్లు రువ్వారు. కర్రలు, రాళ్లతో దాడులకు దిగారు. పరిస్థితి అదుపుతప్పడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపారు.

ముందురోజు కొందరు వైసీపీ నేతల ఇళ్లను టీడీపీ నేతలు కూల్చేసి వైసీపీ వారిని గ్రామం నుంచి తరిమేశారు. వైసీపీ వర్గీయుల కుటుంబాల్లోని మహిళలు రాత్రంతా బిక్కుబిక్కుమంటూ గుడిలో తలదాచుకున్నారు. మంగళవారం తమ మద్దతుదారులతో కలిసి వైసీపీ వర్గీయులు తిరిగి గ్రామంలోకి ప్రవేశించే క్రమంలో ఈ గోడవ తలెత్తింది. పరిస్థితి ఉద్రిక్తతంగా మారడంతో పోలీసులు గాల్లోకి కాల్పులు జరిపి ఇరువర్గాలను అదుపు చేశారు.

మరోవైపు చంద్రగిరి టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి పులివర్తి నాని పద్మావతి మహిళా వర్సిటీలో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్ రూమ్ దగ్గర పరిశీలన చేసిన తిరిగి వెలుతున్న సందర్భంగా వైసీపీ నేత భాను, అతని అనుచరులు నాని కారుపై రాడ్‌, సుత్తితో దాడి చేయగా, కారు ధ్వంసమైంది. గన్‌మెన్‌కు గాయాలు కావడంతో అతను రెండురౌండ్లు గాల్లోకి కాల్పులు జరిపాడు. దాడులను నిరసిసూ టీడీపీ వర్గాలు నిరసనకు దిగాయి. పల్నాడు జిల్లా అచ్చంపేట మండలం వేల్పూరు, పేరూరుపాడు గ్రామాల్లో పరస్పర దాడుల్లో వాహనాలు ధ్వంసమయ్యాయి.

ప్రకాశం జిల్లా ఎర్రగొండపాలెం మండలం వాదంపల్లిలో వైసీపీ, టీడీపీ వర్గాలు పరస్పరం రాళ్లతో దాడులు చేసుకున్నాయి. పోలీసులు పికెట్ ఏర్పాటు చేసుకుని పరిస్థితి సమీక్షిస్తున్నారు. జమ్మలమడుగులో వైసీపీ, టీడీపీ వర్గాల మధ్య ఘర్షణలు కొనసాగాయి. దేవగుడిలోనే ఆదినారాయణ రెడ్డి, భూపేష్ రెడ్డిలను దేవగుడిలో, ముద్దనూరులో సుధీర్ రెడ్డిని పోలీసులు హౌజ్ అరెస్టు చేశారు. గురజాలలో పోలింగ్ రోజు పెట్రోల్ బాంబులతో దాడుల్లో గాయపడిన వారిని టీడీపీ ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాస్ పరామర్శించారు.

దాచెపల్లి తంగెడలో సైతం పెట్రోల్ బాంబుల దాడులతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. మరోవైపు వినుకొండలో జరిగిన పరస్పర ఘర్షణలో గాయపడ్డ వైసీపీ కార్యకర్తలను ఆసుపత్రిలో ఎమ్మెల్యే బొల్లం బ్రహ్మనాయుడు రెడ్డి పరామర్శించారు. కొత్తూరు, కొండ్రముట్ల, ముప్పాల గ్రామాల్లో ఘర్షణలు కొనసాగాయి. నరసరావుపేటలో ఉద్రిక్తతలు కొనసాగుతుండగా టీడీపీ అభ్యర్థి చదలవాడ అరవిందబాబు,వైసీపీ అభ్యర్థి గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి ఇంటివద్ద బందోబస్తు ఏర్పాటు చేసి, 144 సెక్షన్ అమలు చేస్తున్నారు.

నరసరావుపేట టీడీపీ ఎంపీ అభ్యర్థి అనిల్ కుమార్ గాయపడిన మద్దతుదారులను ఆసుపత్రిలో పరామర్శించారు. నంద్యాల జిల్లా పగిడియాల మండలం పడమర పాతకోట గ్రామంలో వైసీపీ కార్యకర్తలపై రాళ్ల దాడికి పాల్పడ్డారు. కోనసీమ జిల్లా ఆత్రేయపురంలో టీపీపీ, వైసీపీ శ్రేణులు రావిచెట్టు సెంటర్లో పరస్పరం ఘర్షణ దిగగా, పోలీసులు కలగచేసుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. అటు మంత్రి అంబటి రాంబాబు తన నియోజకవర్గంలోని దమ్మాలపాడు, నార్నేపాడు, చీమలమర్రి లోని ఆరు బూత్‌లలో రిగ్గింగ్‌ జరిగిందని, ఇక్కడ రీ పోలింగ్‌ జరుపాలని డిమాండ్‌ చేశారు.

కేసులు..అరెస్టులు

పోలింగ్ సందర్భంగా తెనాలి పోలింగ్ కేంద్రంలో క్యూలైనల్‌లో రావాలని కోరిన ఓటర్ గొట్టుముక్కల సుధాకర్ పై దాడి చేసిన తెనాలి సిటింగ్ ఎమ్మెల్యే, వైసీపీ అభ్యర్థి అన్నాబత్తుల శివకుమార్‌పై పోలీసులు కేసు నమోదు చేశారు. బాధితుడు గొట్టిముక్కల సుధాకర్ ఫిర్యాదు మేరకు ఎస్ఐఆర్ నమోదు చేసినట్లు పోలీసులు వెల్లడించారు. ఎమ్మెల్యేతోపాటు మరో ఏడుగురు తనపై దాడి చేసినట్లు సుధాకర్ తన ఫిర్యాదులో పేర్కొనడంపై వారిపై కేసు నమోదు చేశారు.

మరోవైపు మంత్రి, డోన్ వైసీపీ అభ్యర్థి బుగ్గన రాజేంద్రనాధ్ పై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పోలింగ్ నేపథ్యంలో స్వతంత్ర అభ్యర్థి పీఎన్ బాబ కారుపై బుగ్గన అనుచరులు దాడికి పాల్పడ్డారు. తనను కులం పేరుతో దూషించి ఇనుపరాడ్డులతో కారు అద్దాలను పగులగొట్టారని పీఎన్ బాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో బుగ్గనతో పాటు నగర పంచాయతీ చైర్మన్ చలంరెడ్డి, నాయకులు నాగరాజు, నాగేశ్వరరావు, మరో 30 మంది బుగ్గన అనుచరులపై బేతంచర్ల పోలీసులు ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేశారు. అలాగే మైదుకూరు వైసీపీ ఎమ్మెల్యే రఘురామరెడ్డిపైన కూడా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదైంది. పోలింగ్ సందర్భంగా చాపాడు మండలం చిన్నగులవలూరులో ఇద్దరు టీడీపీ ఏజెంట్లపై వైసీపీ కార్యకర్తలు దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన వారిద్దరూ ప్రాణాపాయ స్థితిలో ఉన్నారు. బాధితుల పిర్యాదు మేరకు ఎమ్మెల్యే సహా 11 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు.

అంబేద్కర్ కోనసీమ జిల్లాలో జనసేన నేత వేగుళ్ల లీలా కృష్ణ పై ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి అరెస్టు చేయడం ఉద్రిక్తతలకు దారితీసింది. తాడిపత్రి పట్టణంలో ఘర్షణలకు సంబంధించి టీడీపీ అభ్యర్థి జేఏసీ అస్మిత్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే జెసి ప్రభాకర్ రెడ్డి, మాజీ ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి, జేసీ పవన్ రెడ్డిలపై ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. తాడిపత్రి ఎమ్మెల్యే కేతి రెడ్డి పెద్దారెడ్డి కాన్వాయ్‌పై టీడీపీ నేతలు రాళ్లతో దాడి చేయడంతో ఐదు వాహనాలు ధ్వంసం కాగా ఇద్దరు కానిస్టేబుల్ సహా పలువురు కార్యకర్తలు గాయపడ్డారు. దీంతో వారిపై కేసులు నమోదు చేశారు.

 

Latest News