విధాత,విజయవాడ : జనసేన ప్రధాన లక్ష్యం సగటు ప్రజల కన్నీళ్లు తుడవటమే అని జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ అన్నారు. మంగళగిరిలోని జనసేన పార్టీ ప్రధాన కార్యాలయంలో ఆ పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా పవన్ కొవిడ్ బారిన పడి మృతిచెందిన వారికి సంతాపం తెలిపారు. నంద్యాలకు చెందిన సోమశేఖర్ కుటుంబానికి రూ.5 లక్షల చెక్కు అందజేశారు. అనంతరం మాట్లాడుతూ.. ‘‘కరోనా విపత్తులో తొలి, రెండో దశలో దేశంలో లక్షల మంది చనిపోయారు. జన సైనికులు, వారి కుటుంబ సభ్యులు, నా సన్నిహితులు, బంధువులు చాలా మందిని కోల్పోయాను.
విపత్తులో చనిపోయిన ప్రతి ఒక్కరికి జనసేన తరఫున నివాళులు. ప్రజాస్వామ్య విలువలు నిలబెట్టడానికి జనసేన కృషి చేస్తోంది. అందరి అభిమానం, నాయకుల అండతో పార్టీ నిలబడింది. పార్టీ బీమా పథకానికి నేను రూ.కోటి ఇచ్చా. అందరూ తమ వంతు సహకారం అందిస్తున్నారు’’ అని పవన్ అన్నారు.