వైయస్‌ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు షాక్‌

  • Publish Date - April 4, 2024 / 08:22 PM IST

విధాత : మాజీ ఎంపీ వైఎస్‌.వివేకానందరెడ్డి హత్య కేసులో నిందితుడిగా ఉన్న వైయస్ అవినాష్ రెడ్డికి తెలంగాణ హైకోర్టు గట్టి షాక్ ఇచ్చింది. వైయస్ అవినాష్ రెడ్డికి మంజూరు చేసిన ముందస్తు బెయిల్ రద్దు పరచమని దస్తగిరి వేసిన పిటీషన్ పై గురువారం విచారణకు స్వీకరించిన హైకోర్టు ఇరుపక్షాల వాదనలు విన్నది. వైయస్ అవినాష్ రెడ్డి అబద్దపు సాక్ష్యం చెప్పమని వేధిస్తున్నారని, అధికారాన్ని అడ్డం పెట్టుకుని వైయస్ జగన్మోహన్ రెడ్డి, వైయస్ అవినాష్ రెడ్డిలు ఈ కేసులో సాక్షినైన తనని, తన కుటుంబ సభ్యులను బెదిరిస్తున్నారని పిటిషన్‌లో దస్తగిరి ఆరోపించారు. తన కుటుంబ సభ్యులకు ప్రాణహాని ఉన్నదని అవినాష్ రెడ్డి బెయిల్ తక్షణమే రద్దు పరచవలసిందిగా హైకోర్టును కోరారు. న్యాయవాది జడ శ్రావణ్‌కుమార్‌ దస్తగిరి తరుపున వాదనను వినిపించారు. వైయస్ అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ కండిషన్స్ పాటించకుండా సాక్షుల్ని ప్రభావితం చేస్తున్నాడని వాదించారు. అటు అవినాశ్‌రెడ్డికి మంజూరీ చేసిన ముందస్తు బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కౌంటర్ దాఖలు చేసింది. దస్తగిరికి,అతని కుటుంబ సభ్యులకు అవినాష్ రెడ్డి నుండి ప్రాణహాని ఉన్నదని సీబీఐ తన కౌంటర్లో పేర్కొంది. అవినాష్ రెడ్డి గత సంవత్సర కాలంగా సాక్షులను బెదిరిస్తున్నాడని సీబీఐ కౌంటర్‌లో పేర్కోంది. అయితే గత సంవత్సర కాలంగా సాక్షులను బెదిరిస్తుంటే సీబీఐ ఏం చేస్తుంది అంటూ తెలంగాణ హైకోర్టు సూటి ప్రశ్నించింది. 2023లో దస్తగిరి భార్య ప్రాణాపాయం ఉన్నదని సీబీఐకి తెలిపినా ఎందుకు చర్యలు తీసుకోలేదని సీబీఐఐ న్యాయవాదిపై ఘాటు వ్యాఖ్యలు చేసింది. డ్డి సాక్షులను బెదిరిస్తుంటే మీరు ఎందుకు బెయిల్ రద్దు పిటిషన్ వేయలేదని కోర్టు ప్రశ్నించింది. నిందితులు సాక్షులను బెదిరిస్తుంటే మీకు సాక్షుల రక్షణ పట్టదా అని ఆగ్రహం వ్యక్తం చేసింది. అవినాష్ రెడ్డి తరఫున అడ్వకేట్ నిరంజన్ రెడ్డి వాదనలు వినిపించారు. దస్తగిరి ఇతరుల ప్రోత్సాహంతోనే పిటిషన్ దాఖలు చేశాడని ఆరోపించారు.

దస్తగిరి దాఖలు చేసిన పిటిషన్ లో ఏ విధమైన ఆధారాలు చూపించలేదని, వైయస్ అవినాష్ రెడ్డి ఏ విధంగాను సాక్షులను ప్రభావితం చేయడం లేదని పేర్కోన్నారు. నిరాధారమైన ఆరోపణలతో పిటిషన్ వేశారని వాదించారు. సాక్షుల్ని ఈ విధంగా బెదిరిస్తుంటే ఏ విధంగా నిందారోపణ అంటారు అంటూ అవినాష్ రెడ్డి తరుపు న్యాయవాదిని కోర్డు నిలదీసింది. కోర్టు సమయం ముగియటంతో ఏప్రిల్ 15వ తారీఖున తుదివాదనలు వింటామన్న న్యాయస్థానం తెలిపి విచారణను వాయిదా వేసింది.

Latest News