YS Jagan : ఎమ్మెల్యే బాలకృష్ణపై వైఎస్ జగన్ సంచలన వ్యాఖ్యలు

ఏపీ అసెంబ్లీలో బాలకృష్ణ తనపై చిరంజీవిపై చేసిన వ్యాఖ్యలకు వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. తాగి అసెంబ్లీకి వచ్చిన వ్యక్తిని ఎలా అనుమతించారని స్పీకర్‌ను ప్రశ్నించారు. నకిలీ మద్యం, క్రెడిట్ చోరీ, అదానీ-గూగుల్ డేటా సెంటర్ ఉద్యోగుల మోసం రైతు సమస్యలపై చంద్రబాబు ప్రభుత్వాన్ని తీవ్రంగా విమర్శించారు.

YS Jagan Vs Nandamuri Balakrishna

అమరావతి: ఏపీ అసెంబ్లీలో సినీ నటుడు, హిందూపురం టీడీపీ ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఇటీవల తనపైన, చిరంజీవిపైన చేసిన వ్యాఖ్యలపై వైసీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ ఘాటుగా స్పందించారు. అసెంబ్లీలో మాట్లాడాల్సింది ఏంటి? బాలకృష్ణ తాగి మాట్లాడింది ఏంటి? అసలు తాగి వచ్చిన వ్యక్తిని అసెంబ్లీకి ఎలా అనుతించారు?. అలా మాట్లాడేందుకు అనుమతించినందుకు స్పీకర్‌కు బుద్ది లేదు అని జగన్ విమర్శించారు. బాలకృష్ణ మానసిక స్థితి ఏంటో అక్కడే అర్థమవుతోందని..అలా మాట్లాడినందుకు సైకలాజికల్‌ ఆరోగ్యం ఎలా ఉందో ఆయనే ప్రశ్నించుకోవాలి అని జగన్‌ అన్నారు.

నకిలీ మద్యం అమ్మకాలు చంద్రబాబు మనుషుల నిర్వాకమే

నకిలీ మద్యాన్ని తయారు చేస్తోంది వాళ్లే.. బెల్ట్‌షాపులు పెట్టి నడిపిస్తోంది సీఎం చంద్రబాబు మనుషుల పనే అని..అక్రమ మద్యం కేసులో మా పార్టీ వాళ్లను అనవసరంగా వేధిస్తున్నారని వైఎస్ జగన్ విమర్శించారు. ఒక్క ములకలచెరువులోనే 20,208 బాటిళ్ల నకిలీ మద్యం దొరికిందని, మరో 8,166 బాటిళ్లకు సరిపడా నకిలీ మద్యాన్ని పట్టుకున్నారని, 30 క్యాన్లల్లో సిద్ధం చేసి ఉన్న 1,050 లీటర్ల స్పిరిట్ కూడా లభ్యమైందని, వాటాల్లో తేడా వచ్చింది కాబట్టే నకిలీ మద్యం వ్యవహారం బయటకు వచ్చిందన్నారు. నకిలీ మద్యం వ్యాపారంతో ప్రభుత్వానికి రూ.వేల కోట్ల నష్టం కలిగిస్తున్నారని జగన్ అన్నారు. జనార్థన్ రావుతో, జోగీ రమేష్, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలకు లింక్ పెట్టేందుకు చేసిన టీడీపీ కుట్ర అందరికి అర్ధమైందన్నారు. ఆర్గనైజ్డ్‌గా క్రైమ్‌చేయడం చంద్రబాబు, లోకేష్‌లకు అలవాటేనన్నారు. మద్యం షాపులే మీవి అయినప్పుడు క్యూఆర్‌ కోడ్‌ ఎందుకు? క్యూఆర్‌ కోడ్‌ అంటూ మరో డైవర్షన్‌ రాజకీయం చేస్తున్నారని జగన్ మండిపడ్డారు.

క్రెడిట్‌ చోరీలో చంద్రబాబు పీక్‌.. రాష్ట్ర పరిస్థితి వీక్‌

వేరే వాళ్లకి దక్కాల్సిన క్రెడిట్‌ను చోరీ చేయడంలో చంద్రబాబు ఎప్పుడూ ముందుంటారని, క్రెడిట్‌ చోరీలో చంద్రబాబు పీక్‌.. రాష్ట్ర పరిస్థితి వీక్‌ అంటూ జగన్ చురకలేశారు. 2020లో.. కరోనా టైంలోనే అదానీ డాటా సెంటర్‌ ఒప్పందానికి బీజం వేశాం అని, 2021 మార్చిలో సింగపూర్‌ ప్రభుత్వానికి ఈ ఒప్పందానికి సంబంధించి లేఖ రాశాం అని, 2023 మే 3న.. ఆ తర్వాత డాటా సెంటర్‌కు వైజాగ్‌లో శంకుస్థాపన కూడా చేశాం అని జగన్ గుర్తు చేశారు. ఆనాడే.. సింగపూర్‌ నుంచి సబ్‌సీ కేబుల్‌ తీసుకొచ్చే అంకురార్పణ జరిగిందని, దీనికి కొనసాగింపుగానే గూగుల్‌ డాటా సెంటర్‌ వచ్చిందన్నారు. అదానీ ఇందులో రూ.87 వేల కోట్ల పెట్టుబడి పెడుతున్నారని, అదానీ ప్రాజెక్టు విస్తరణే ఈ గూగుల్‌ డాటా సెంటర్‌ అని, వైఎస్సార్‌సీపీ వేసిన బీజానికి కొనసాగింపే వైజాగ్‌ గూగుట్‌ డాటా సెంటర్‌ అని, చంద్రబాబు మాత్రం ఆ క్రేడిట్ తనది చెప్పుకుంటున్నారని జగన్ ఆరోపించారు. గతంలో హైదరాబాద్‌ సైబర్‌ టవర్స్‌ , హైటెక్ సిటీ విషయంలోనూ చంద్రబాబు ఇలాగే చేశారని, నేదురుమల్లి జనార్థన్ రెడ్డి, వైఎస్సార్, కేసీఆర్ పాలనలో జరిగిన అభివృద్ధిని తన ఘనతగా తప్పుడు ప్రచారం చేసుకున్నాడని జగన్ విమర్శించారు. హైదరాబాద్‌ అభివృద్ధికి అసలు చంద్రబాబుకే సంబంధం లేదు అన్నారు.

ఉద్యోగులను, రైతులను మోసం చేశారు

ఉద్యోగులనూ చంద్రబాబు మోసం చేశారని, నాలుగు డీఏలు పెండింగ్‌లో పెట్టారని, దీపావళి కానుకగా ఒక్కటి ఇస్తామన్నారని, మేం ఐదేళ్లలో 10 డీఏలు ఇవ్వాల్సి ఉంటే.. మేం 11 ఇచ్చాం అని జగన్ చెప్పుకొచ్చారు. చంద్రబాబు పాలనలో వైద్యరంగం.. ఆరోగ్యశ్రీ నీరుగారిపోయిందని, పేదవాడికి వైద్యం అందించాల్సిన ఆస్పత్రులు ధర్నాలు చేస్తున్నాయన్నారు. మెడికల్ కాలేజీలకు ప్రైవేటీకరణ చేస్తున్నాడని జగన్ విమర్శించారు. గ్రామస్థాయిలో పాలనను చంద్రబాబు గాలికొదిలేశారని, గ్రామ సచివాలయం, వలంటీర్‌లాంటి వ్యవస్థలను నిర్వీర్యం చేశారన్నారు. రైతులకు ఏపీలో ఇప్పటికీ డీఏపీ, యూరియా దొరకని పరిస్థితి అని, బీమా సంగతి పట్టించుకోవడం లేదు అన్నారు. సబ్సిడీ విత్తనాలు లేవని, ఉల్లి రైతులను గాలికి వదిలేశారని, అరటి, టమాట, పత్తికి డిమాండ్‌ లేదు అని, క్వింటాల్‌ పత్తికి ఒకప్పుడు రూ.12 వేలు ఉండేది.. ఇప్పుడు రూ.5 వేలు కూడా లేదు అని, టమాట రైతులు పంటను పొలాల్లోనే వదిలేస్తున్నారని జగన్ విమర్శించారు.