మీ వేలిగోర్లు మీ ఆరోగ్యం గురించి ఏం చెబుతున్నాయి?

అందమైన గోర్లు మంచి ఆరోగ్యాన్ని కూడా సూచిస్తాయి. గోర్లు మన ఆరోగ్యాన్ని నిత్యం గమనిస్తుంటాయి.ఎప్పుడైనా మీ గోర్లు పెళుసుగా ఉండ‌టం, ప‌సుపుప‌చ్చగా మార‌డం, పాలిపోయిఉండ‌టం

  • Publish Date - April 14, 2024 / 08:39 PM IST

అందమైన గోర్లు మంచి ఆరోగ్యాన్ని కూడా సూచిస్తాయి. గోర్లు మన ఆరోగ్యాన్ని నిత్యం గమనిస్తుంటాయి.ఎప్పుడైనా మీ గోర్లు పెళుసుగా ఉండ‌టం, ప‌సుపుప‌చ్చగా మార‌డం, పాలిపోయిఉండ‌టం గ‌మ‌నించారా? అవి మీకు ఏదో చెప్పాల‌నుకుంటున్నాయి. అది కూడా మీ ఆరోగ్యం గురించి. ఆశ్చర్యంగా ఉందా! మ‌న ఆరోగ్యం గురించి గోర్లకేం తెలుస‌నుకుంటున్నారా.. చ‌ద‌వండి.

చూడ‌టానికి ఎటువంటి హాని చేయని గోర్ల ల‌క్షణాలు, మ‌న శ‌రీరంలో అంతర్లీనంగా ఉన్న ఆనారోగ్యాన్ని సూచిస్తాయ‌ని జాన్ ఆంటోనీ, డెబ్రా జాలిమ‌న్ అనే ఇద్దరు అమెరికా చ‌ర్మవ్యాధి నిపుణులు చెబుతున్నారు. కింద చెప్పబోతున్న ఎనిమిది గోర్ల ల‌క్షణాలు మాత్రం ఎట్టి ప‌రిస్థితుల్లోనూ నిర్లక్ష్యం చేయ‌కూడ‌ద‌ని ఆ డాక్టర్లు హెచ్చరిస్తున్నారు.

1. ప‌సుపురంగు గోర్లు (Yellow Nails):
సాధార‌ణంగా గోళ్ల ప‌సుపురంగు ఫంగ‌ల్ ఇన్ఫెక్షన్‌ను సూచిస్తుంది. కానీ, కొన్ని అసాధార‌ణ ప‌రిస్థితుల్లో మ‌ధుమేహం, థైరాయిడ్ వ్యాధి, ఊపిరితిత్తుల వ్యాధిని కూడా సూచిస్తుంది. ధూమ‌పానం కూడా గోళ్లను ప‌సుపురంగుకు మారుస్తుంది.

2. ప‌గుళ్లు, పెళుసుబారిన గోళ్లు(Cracked or Brittle Nails):
డా. జాలిమ‌న్ ప్రకారం, ప‌గుళ్లతో కూడిన‌, పెళుసుబారిన గోళ్లు , గోరు ప‌ల‌క పూర్తిగా పొడిగాఉంద‌ని సూచిస్తాయి. ఇది థైరాయిడ్ వ్యాధితో కూడా ముడిప‌డివుంది. హైపోథైరాయిడిజంకు ఉన్న ల‌క్షణాల‌లో ఇది కూడా ఒక‌టి.

3. గుంట‌లుప‌డ్డ గోర్లు(Pitted Nails):
మెడిసిన్‌నెట్ చెప్పిన‌దాని ప్రకారం, గుంట‌లు, రంధ్రాలుప‌డ్డ గోర్లు, గోరుప‌ల‌క‌లోని పొర‌లు లోపాల‌తో పెరుగుతున్నాయ‌ని అర్థం. ఇది సోరియాసిస్‌తో బాధ‌ప‌డేవారిలో సాధార‌ణంగా క‌న‌బ‌డే ల‌క్షణం.

4. చార‌ల గోళ్లు(Ridged Nails):
కొన్నిసార్లు గోర్లు చార‌ల‌తో, గ‌ట్లతో క‌నిపిస్తాయి. ఇది గోళ్లకు నేరుగా గాయం అయినప్పుడు క‌నిపిస్తుంది. అయితే మిగతా వేళ్లకు కూడా ఇలాగే ఉంటే మాత్రం మ‌న రోగ‌నిరోధ‌క వ్యవ‌స్థ గోర్లను రిపేర్‌చేసే ప‌నిక‌న్నా శ‌రీరంలో తీవ్రమైన వ్యాధితో పోరాడుతుంద‌ని అర్థం.

5. పాలిపోయిన లేదా ముదురు గీత‌లున్న గోర్లు(Discolored or Dark Lines Beneath):
గోర్లపై రంగు మార‌డం, పాలిపోవ‌డం, న‌ల్లని గీత‌లు క‌నిపించ‌డం ప్రమాద‌క‌ర‌మైన సంకేతం. ఇది మెల‌నోమా వ‌ల్ల కావ‌చ్చు. మెల‌నోమా అంటే చ‌ర్మ క్యాన్సర్‌. ఇలా క‌నిపించిన వెంట‌నే డాక్టర్‌ను క‌ల‌వ‌డం చాలా ముఖ్యం.

6. కొరక‌బ‌డిన గోళ్లు(Bitten Nails):
మెడికల్ డైలీ, అమెరికన్ సైకియాట్రిక్ అసోసియేషన్ వారి డయాగ్నోస్టిక్ అండ్ స్టాటిస్టికల్ మాన్యువల్ ఆఫ్ మెంటల్ డిజార్డర్స్ ప్రకారం, గోళ్లు కొర‌క‌డాన్ని ఓసీడి()గా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకోవ‌చ్చు. ఇది తీవ్రమైతే మాన‌సిన వైద్య నిపుణుడిని సంప్రదించాల్సిందే.

7. నీలిరంగు గోర్లు(Bluish Nails):
వెబ్ఎమ్‌డీ చెప్పిన‌దానిక ప్రకారం, నీలి(బ్లూ)రంగు గోర్లు ఆక్సిజ‌న్‌లేమికి సంకేతం. శ‌రీరానికి సరిప‌డా ఆక్సిజ‌న్ అంద‌డంలేద‌ని చెబుతున్నట్లు. ఈ ల‌క్షణం, ఊపిరితిత్తులు, గుండె ప‌నితీరు స‌రిగా లేద‌ని సూచిస్తుంది. ఇది కూడా వెంట‌నే డాక్టర్‌ను క‌ల‌వాల్సిన ల‌క్షణం.

8. తెల్లటి మ‌చ్చలు(White Spots):
సాధార‌ణంగా గోళ్లపై తెల్లని మ‌చ్చల‌ను కాల్షియం లోపంగా ప‌రిగ‌ణిస్తారు. కానీ ఇది త‌ప్పు అని తేల్చారు. అది కేవ‌లం వేళ్లకు త‌ర‌చుగా త‌గిలే గాయాల మూలంగా ఏర్పడ‌తాయ‌ని డా. ఆంథోనీ చెపుతున్నారు.

ఇది మీ న‌ఖారోగ్యశాస్త్రం. కాబ‌ట్టి గోళ్లు కూడా ఉడ‌తాభ‌క్తిగా మ‌న ఆరోగ్యం గురించి స‌హాయం చేస్తాయ‌ని మ‌రువ‌కండి. వాటి గోల‌ను నిర్లక్ష్యం చేయ‌కండి.

Latest News