Site icon vidhaatha

Karnataka Assembly: కర్ణాటకలో 18మంది బీజేపీ ఎమ్మెల్యేల 6నెలల సస్పెన్షన్

Karnataka Assembly: కర్ణాటక అసెంబ్లీ సమావేశాలు రణరంగాన్ని తలపించాయి. కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకువచ్చిన ముస్లింలకు ప్రభుత్వ కాంట్రాక్టుల్లో 4 శాతం రిజర్వేషన్లు కల్పించడాన్ని ప్రతిపక్ష బీజేపీ తీవ్రంగా వ్యతిరేకించింది. శుక్రవారం సభలో బీజేపీ ఎమ్మెల్యేలు వెల్ లోకి ప్రవేశించి, స్పీకర్ పోడియం దగ్గర కుర్చీ ముందు కాగితాలు చింపి విసిరేసి నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సభలో అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీజేపీ మధ్య తీవ్రస్థాయిలో తోపులాటలు నెలకొన్నాయి. బీజేపీ సభ్యుల ఆందోళనల మధ్యే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు సభ ఆమోదం తెలిపింది. రిజర్వేషన్ బిల్లు రాజ్యాంగ విరుద్ధమని.. చట్టబద్దంగా ఎదుర్కొంటామని బీజేపీ హెచ్చరించింది. సభలో బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ పరిణామాల మధ్య స్పీకర్ యూటీ. ఖాదర్ మాజీ ఉప ముఖ్యమంత్రి డాక్టర్ సీఎన్ అశ్వత్ నారాయణ్ తో సహా 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి 6 నెలల పాటు సస్పెండ్ చేస్తూ  సంచలన నిర్ణయం తీసుకున్నారు. “క్రమశిక్షణారాహిత్యం” కారణంగా సస్పెండ్ చేసినట్లు చెప్పారు.

అసెంబ్లీ కార్యకలాపాలకు అంతరాయం కలిగించినందుకు 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలను ఆరు నెలల పాటు సస్సెండ్ చేసే బిల్లును కర్ణాటక అసెంబ్లీ ఆమోదించింది. ఈ బిల్లును కర్ణాటక లా అండ్ పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి హెచ్ కే. పాటిల్ ప్రవేశపెట్టారు. సామాజిక న్యాయం కోసమే ప్రభుత్వ కాంట్రాక్టులలో 4 శాతం ముస్లిం కోటాను ఆమోదించినట్లు కాంగ్రెస్ పేర్కొంది. ఓ వైపు హనీ ట్రాప్ కుంభకోణంపై రచ్చ సాగుతున్న వేళ అనూహ్యంగా ముస్లిం కోటా బిల్లును అసెంబ్లీలో కాంగ్రెస్ ఆమోదించింది.

బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి మాట్లాడుతూ.. “హనీ ట్రాప్ కుంభకోణం గురించి చర్చించడానికి బదులుగా..రాజ్యంగ విరుద్ధంగా ముఖ్యమంత్రి నాలుగు శాతం ముస్లిం బిల్లు ఆమోదం కోసం ప్రయత్నించడాన్ని తాము నిరసించామని తెలిపారు. సభలో పలు సందర్భాల్లో ప్రభుత్వ ఎమ్మెల్యేలు కూడా కాగితాలను చించి, పుస్తకాలు విసిరారని..అలాంటప్పుడు ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై సస్పెన్షన్ ఎందుకని ప్రశ్నించారు.

Exit mobile version