హైదరాబాద్ : ఎలాంటి ఆశ్రయం లేని నిరాశ్రయులు.. బుక్కెడు బువ్వ కోసం భిక్షాటన చేస్తుంటారు. అలా భిక్షాటన చేస్తూ కడుపు నింపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఫుట్‌పాత్‌ల పైనే నిద్రిస్తుంటారు. అయితే భిక్షాటన చేసే వారిలో చాలా మంది.. విలువైన భూములు, భవనాలు, వస్తువులను కలిగి ఉన్నట్లు అప్పుడప్పుడు వార్తలు చూస్తూనే ఉంటాం. తాజాగా హైదరాబాద్‌లో ఓ యాచకురాలి వద్ద రూ. 45 వేల విలువ చేసే ఫోన్ ను చూసి పోలీసులు షాకయ్యారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆపరేషన్ ముస్కాన్, స్మైల్‌లో భాగంగా శనివారం రాత్రి.. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఫిల్మ్‌నగర్ పోలీసు స్టేషన్ల పరిధిలో పోలీసులు తనిఖీలు నిర్వహించారు. భిక్షాటన చేస్తున్న 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వారందరిని జూబ్లీహిల్స్ పీఎస్‌కు తరలించారు. వారి వివరాలు సేకరించే క్రమంలో ఓ మహిళ వద్ద రూ. 45 వేల విలువ చేసే ఖరీదైన ఫోన్‌ను పోలీసులు గుర్తించారు. ఖరీదైన ఫోన్ ఎలా వచ్చిందని ప్రశ్నించగా, తానే కొనుగోలు చేసినట్లు ఆమె తెలిపింది. దీనిపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. పట్టుబడిన వారందరిని పునరావాస కేంద్రానికి తరలించినట్లు పోలీసులు పేర్కొన్నారు.