Site icon vidhaatha

ఎలుగుబంటి భ‌యంతో బావిలో దూకిన మ‌హిళ‌.. 20 గంట‌ల పాటు న‌ర‌క‌యాత‌న‌..

తిరువ‌నంత‌పురం : ఓ మ‌హిళ ఎలుగుబంటి నుంచి త‌ప్పించుకునేందుకు 50 అడుగుల లోతు ఉన్న ఓ బావిలో దూకింది. 20 గంట‌ల పాటు ఆమె బావిలోనే ఉండిపోయింది. ఆ త‌ర్వాత గ్రామ‌స్తులు గ‌మ‌నించి, అగ్నిమాప‌క సిబ్బంది స‌హాయంతో బ‌య‌ట‌కు తీశారు. ఈ ఘ‌ట‌న కేర‌ళ‌లోని ఆడూరులో సోమ‌వారం సాయంత్రం చోటు చేసుకోగా, ఆల‌స్యంగా వెలుగు చూసింది.

వివ‌రాల్లోకి వెళ్తే.. ఆడూరు గ్రామ స‌మీపంలో ఓ 50 ఏండ్ల మ‌హిళ న‌డుచుకుంటూ వెళ్తుంది. అయితే ఆమెను ఎలుగుబంటి వెంబ‌డించింది. దీంతో భ‌యంతో ఆమె ప‌రుగులు పెట్టింది. ఎలుగుబంటి నుంచి త‌ప్పించుకునేందుకు అక్క‌డున్న ఓ బావిలో దూకేసింది.

సోమ‌వారం రాత్రి ఆ మ‌హిళ ఇంటికి చేరుకోక‌పోవ‌డంతో పోలీసుల‌కు ఫిర్యాదు చేశారు. పోలీసులు, గ్రామ‌స్తులు క‌లిసి ఆడూరు ప‌రిస‌రాల్లో వెతికారు. కానీ ఆమె ఆచూకీ ల‌భించ‌లేదు. మంగ‌ళ‌వారం మ‌ధ్యాహ్నం బావిలో నుంచి అరుపులు వినిపించాయి. మ‌హిళ అరుపులను గ‌మనించి స్థానికులు, అగ్నిమాప‌క సిబ్బందికి, పోలీసుల‌కు స‌మాచారం అందించారు.

ఘ‌ట‌నాస్థ‌లానికి చేరుకున్న పోలీసులు, అగ్నిమాప‌క సిబ్బంది.. బాధితురాలిని సుర‌క్షితంగా బ‌య‌ట‌కు తీశారు. 20 గంట‌ల పాటు ఆమె బావిలోనే ఉండిపోవ‌డంతో ఆమె శ‌రీరం కాస్త వాపు వ‌చ్చింది. దీంతో ఆమెను చికిత్స నిమిత్తం ఆస్ప‌త్రికి త‌ర‌లించారు. ప్ర‌స్తుతం బాధితురాలి ఆరోగ్యం నిల‌క‌డ‌గా ఉంద‌ని వైద్యులు తెలిపారు. 

Exit mobile version