Telangana phone tapping case| సరెండర్ కండి..ప్రభాకర్ రావుకు సుప్రీంకోర్టు ఆదేశాలు

తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసులో సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక ఆదేశాలు చేసింది. ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావును రేపు శుక్రవారం తెలంగాణ పోలీసులకు లొంగిపోవాలని ఆదేశించింది. కేసు విచారణ జరుగుతున్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలని స్పష్టం చేసింది.

విధాత : తెలంగాణ ఫోన్ ట్యాపింగ్ కేసు(Telangana Phone Tapping Case)లో సుప్రీంకోర్టు(Supreme Court) ధర్మాసనం కీలక ఆదేశాలు చేసింది. ప్రధాన నిందితుడు, ఎస్ఐబీ మాజీ చీఫ్ టి.ప్రభాకర్ రావు(Prabhakar Rao)ను రేపు శుక్రవారం తెలంగాణ పోలీసులకు లొంగిపోవాలని(Surrender Order) ఆదేశించింది. కేసు విచారణ జరుగుతున్న జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ లో లొంగిపోవాలని స్పష్టం చేసింది. అయితే ప్రభాకర్ రావు సీనియర్ సిటిజన్ కావడం..మాజీ పోలీస్ అధికారిగా పనిచేసిన నేపథ్యంలో ఆయనను ఫిజికల్ గా టార్చర్ పెట్టకుండా ..థర్డ్‌ డిగ్రీ ప్రయోగించకుండానే ఇంటరాగేషన్‌ చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.

ఫోన్ ట్యాపింగ్ కేసు లో మాజీ డీఎస్పీ ప్రణీత్ రావు అరెస్టు కాగానే అమెరికా వెళ్లిపోయిన ప్రభాకర్ రావు సుప్రీంకోర్టు నుంచి అరెస్టు నుంచి ఊరట పొంది స్వదేశానికి తిరిగి వచ్చారు. అయితే పోలీసుల విచారణకు సహకరించాలని సుప్రీంకోర్టు ప్రభాకర్ రావుకు స్పష్టం చేసింది. అయితే ప్రభాకర్ రావు ఏ దశలో కేసు విచారణకు సహకరించలేదని..ఈ కేసులో కీలక ఆధారాల ధ్వంసంలో ఆయన ప్రముఖంగా ఉన్నారని పోలీసులు కోర్టుకు తెలిపారు. పోలీసుల వాదన విన్న సుప్రీంకోర్టు వెంటనే ఆయనను సరెండర్ కావాలని ఆదేశించింది.

ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రభాకర్ రావు విచారణకు సహకరించడం లేదని..ఆయనకు ఇచ్చిన బెయిల్ రద్దు చేయాలని తెలంగాణ పోలీసులు దాఖలు చేసిన పిటిషన్ ను జస్టిస్ వెంకటరత్నం ధర్మాసనం విచారించింది. నిందితుడు ప్రభాకర్ రావు దర్యాప్తుకు సహకరించడం లేదని, 5 ఐఫోన్ ల పాస్ వర్డ్ లలో కేవలం రెండింటి రీసెట్ కు మాత్రమే ఆయన సహకరించారని ప్రభుత్వ తరపు న్యాయవాదులు కోర్టుకు వివరించారు. ఆ రెండింటిలో కూడా ఎలాంటి డేటా లేదని, మరో మూడు ఐడీలు ఓపెన్ కాలేదని ధర్మాసనం దృష్టికి తెచ్చారు. ఫోరెన్సిక్ నిపుణుల ముందు ఐ క్లౌడ్, పాస్ వర్డ్ రీసెట్ చేయాలని గత విచారణలో ప్రభాకర్ రావును సుప్రీంకోర్టు ఆదేశించిన దానికి విరుద్దంగా ఆయన విచారణకు సహకరించడం లేదని ధర్మాసనానికి వివరించారు. ఈ నేపధ్యంలో ప్రభాకర్ రావు లొంగిపోవాలని సుప్రీంకోర్టు ఆదేశించింది.

ఇదిలా ఉంటే.. ఈ కేసులో మాజీ పోలీసు అధికారులు ప్రణీత్ రావు, రాధాకిషన్‌, తిరుపతి రావులు అరెస్ట్‌ అయ్యారు. రాధాకిషన్‌ తన కన్‌ఫెషన్‌లో మాజీ సీఎం కేసీఆర్‌ ప్రస్తావన తెచ్చినట్లు తెలుస్తోంది. ఈ కేసులో కేసీఆర్‌కు పదేళ్లపాటు ఓఎస్డీగా పని చేసిన పీ రాజశేఖర్‌ రెడ్డిని ఇటీవలే సిట్ ప్రశ్నించింది. అంతకుముందు మరో నిందితుడి శ్రవణ్ రావును సైతం విచారించింది. బీఆర్ఎస్ హయాంలో ప్రభాకర్ రావు బృందం అప్పటి ప్రభుత్వ పెద్దల కోసం ప్రతిపక్ష రాజకీయ నాయకులు, జర్నలిస్టులు, కాంట్రాక్టర్లు, రియల్టర్లు, సెలబ్రెటీలు, జడ్జీల ఫోన్లను ట్యాప్ చేసినట్లుగా సిట్ గుర్తించింది. దీనిపై కేసు నమోదు చేసి విచారణ కొనసాగిస్తుంది. విచారణలో భాగంగా పలువురి వాంగ్మూలాలను సైతం సిట్ నమోదు చేసింది.

Latest News