Phone Tapping case |ఫోన్ ట్యాపింగ్‌లో తీగలు కదుపుతున్న కొద్దీ సంచలన విషయాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్రంలో టెలిఫోన్ ట్యాపింగ్ అనేది గత అసెంబ్లీ ఎన్నికలకు ముందు సాగిందని ప్రచారంలో ఉన్నా.. చాలా ఏళ్ల తరబడి ఈ వ్యవహారం నడుస్తున్నదని స్వయానా ఇంటెలిజెన్స్ మాజీ డీఎస్పీ ప్రణీత్‌రావు వెల్లడించారని సమాచారం. తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ ఎప్పుడో ప్రారంభమైందని, ఈ విషయంలో సమాచారం తెలుసుకోవడంలో మీరే పూర్తిగా వెనుకబడి ఉన్నారంటూ ప్రణీత్ రావు స్పష్టం చేయడంతో సిట్ అధికారులు కంగుతిన్నట్లు తెలిసింది. దానిపై మరింత లోతుగా ప్రశ్నించడంతో.. ఆయన మొత్తం వ్యవహారాన్ని పూసగుచ్చినా.. కీలక వ్యక్తి ఎవరో మాత్రం తనకు తెలియదని చెప్పారని విశ్వసనీయవర్గాలు చెబుతున్నాయి.
2018 ఎన్నికల సమయంలోనూ ట్యాపింగ్!
రాష్ట్రంలో ముందస్తు అసెంబ్లీ ఎన్నికలు జరిగిన 2018తో పాటు 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో కూడా ఫోన్ ట్యాపింగ్ జరిగిందని, వేల కొద్దీ ఫోన్లను ట్యాప్ చేశామని సిట్ విచారణ సందర్బంగా ప్రణీత్ వెల్లడించినట్టు తెలుస్తున్నది. 2018 నుంచే ఫోన్ ట్యాపింగ్ చేస్తునట్లు ప్రణీత్ రావు తన స్టేట్‌మెంట్‌లో పేర్కొన్నారు. నాలుగేళ్లలో వేల సంఖ్యలో ఫోన్లు ట్యాప్ చేసినట్లు తన వాంగ్మూలంలో వెల్లడించారు. ఆ డాటా అంతా పెన్ డ్రైవ్‌లో కాపీ చేసి, ఎస్ఐబీ మాజీ చీఫ్ టీ ప్రభాకర్ రావుకు ఇచ్చినట్లు వెల్లడించారు. ఆ పెన్ డ్రైవ్‌ను ప్రభాకర్ రావు ఎవరికి ఇచ్చేవారో తనకు తెలియదని చెప్పారని తెలిసింది. దీంతో ప్రభాకర్‌రావు ఆ వివరాలను ఎవరికి చేరవేశారనేదానిపై నిర్దిష్ట ఆధారాలను సేకరించే పనిలో పడ్డారని సమాచారం.
అనుమతులతోనే ట్యాపింగ్
తాము ఫోన్ ట్యాపింగ్ సందర్భంగా ఎలాంటి అక్రమ పద్ధతులను పాటించలేదని, అన్నీ అనుమతులతోనే చేశామని, కేంద్ర హోం శాఖ కూడా ఆమోదం తెలిపిందని ప్రణీత్ సమర్ధించుకునే ప్రయత్నం చేశారని సమాచారం. కాకపోతే ఇక్కడ అనుమానించాల్సింది ఏమంటే మావోయిస్టుల పేర్లతో మొబైల్, ల్యాండ్ లైన్ నంబర్లను పంపించి, కేంద్ర హోం శాఖ నుంచి అనుమతి పొందారు. అయితే కేంద్ర ప్రభుత్వం కూడా ఈ నంబర్లు ఎవరి పేరు మీద ఉన్నాయి? వేలు, వందల సంఖ్యలో పంపిస్తున్న నంబర్లు సరైనవా? కావా? అనేది ప్రాథమికంగానైనా పరిశీలించలేదా? అనేది సందేహాస్పదంగా మారింది. ట్యాప్ చేసిన అన్ని నంబర్లను పంపించి ఆమోదం తీసుకున్నారా, కొన్ని నంబర్లు పంపించి తమకు కావాల్సిన నంబర్లన్నింటినీ ట్యాప్ చేశారా అనేది విచారణలో వెల్లడి కావాల్సి ఉంది.
ప్రభాకర్‌రావు రాకతో కొత్త విషయాలు
మాజీ ఎస్ఐబీ చీఫ్ టీ ప్రభాకర్ రావు విదేశాల నుంచి వచ్చి విచారణకు హాజరవుతున్నప్పటి నుంచి కొత్త కొత్త విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. గత ప్రభుత్వంలో మూడు ఉప ఎన్నికలు జరిగాయి. హుజూరాబాద్, మునుగోడు, దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గాల ఉప ఎన్నికల సందర్భంగా ప్రత్యర్థి పార్టీలకు చెందిన ముఖ్యమైన నేతలందరి ఫోన్లన్నటినీ నిఘాలో పెట్టినట్టు తెలుస్తున్నది. వీరే కాకుండా రెవెన్యూ, పోలీసు అధికారులవి కూడా నిఘాలో ఉంచారని సమాచారం. ప్రత్యర్థి పార్టీలు డబ్బులు తరలించే సమాచారాన్ని ఎప్పటికప్పుడు ప్రణీత్ రావు, టాస్క్ ఫోర్స్ డీసీపీ రాధాకిషన్ రావుకు తెలిపేవాడని, వెంటనే రాధాకిషన్ రావు టీమ్ రంగంలోకి దిగి, డబ్బులు స్వాధీనం చేసుకుని హవాలా డబ్బులు అంటూ ఆదాయపు పన్ను శాఖకు అప్పగించారని అంటున్నారు. శేరిలింగంపల్లి నుంచి పోటీ చేసిన భవ్య ఆనంద్ ప్రసాద్‌కు సంబంధించిన డబ్బులు సికింద్రాబాద్ ప్యారడైజ్ సమీపంలో, దుబ్బాక ఉప ఎన్నికల్లో ప్రస్తుత ఎంపీ రఘునందన్ రావు బంధువు నుంచి రూ.1 కోటితో పాటు మునుగోడు ఎన్నికల సందర్భంగా పెద్ద ఎత్తున డబ్బులు స్వాధీనం చేసుకున్నారు.
రివ్యూ కమిటీ ఆమోదం తప్పనిసరి
ఏదైనా ఓ వ్యక్తి ఫోన్‌ను ట్యాప్ చేయాలనుకుంటే పోలీసులు ఇండియన్ టెలిగ్రాఫ్ యాక్ట్, 1885లోని సెక్షన్ 5(2) ప్రకారం ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. అయితే అందుకు తగిన కారణాలు, ట్యాపింగ్ చేయాలనుకుంటున్నవారి వివరాలు సమగ్రంగా తెలియచేయాలి. రాష్ట్ర డీజీపీ లేదా హోం శాఖ ముఖ్య కార్యదర్శి నుంచి అనుమతి తీసుకోవాలి. ఆ నంబర్లను పరిశీలించిన తరువాత రివ్యూ కమిటీకి సిఫారసు చేస్తారు. ఆ నంబర్లపై ఎందుకు విచారణ చేస్తున్నారు? కారణాలు ఏమిటి అనేది సంబంధిత అధికారులతో చర్చిస్తారు. అన్నీ సక్రమంగా ఉన్నాయని నిర్ణయానికి వచ్చిన తరువాతే రివ్యూ కమిటీ కేంద్ర ప్రభుత్వంలోని డిపార్ట్‌మెంట్ ఆఫ్ టెలికం (డీవోటీ)కు నంబర్లను, వివరాలను పంపిస్తారు. డీవోటీ ఆమోదం తెలిపిన తరువాత సదరు నంబర్ల ట్యాపింగ్‌ను ఎస్ఐబీ అధికారులు మొదలు పెడతారు. అప్పటి రివ్యూ కమిటీ చైర్మన్‌గా అప్పటి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి, ప్రస్తుత డీజీపీ జితేందర్ (అప్పుడు హోం సెక్రెటరీ), ప్రస్తుత అడిషనల్ డీజీ అనిల్ కుమార్ (అప్పటి ఇంటెలిజెన్స్ విభాగం చీఫ్) ఉన్నారు.
గత ఎన్నికల్లో ట్యాపింగ్‌పైనే ఆధారపడిన బీఆరెస్!
మొన్న జరిగిన అసెంబ్లీ ఎన్నికలకు కొద్ది రోజుల ముందు బీఆర్ఎస్ ప్రభుత్వం ట్యాపింగ్ పైనే ప్రధానంగా ఆధారపడిందని తెలుస్తున్నది. ప్రధాన ప్రత్యర్థి కాంగ్రెస్ పార్టీని కోలుకోకుండా దెబ్బతీసేందుకు ఈ దుష్ట విధానాన్ని అనుసరించి ఆర్థికంగా, మానసికంగా దెబ్బతీసిందన్న చర్చ జరుగుతున్నది. పలు దఫాలుగా వేయికి పైగా ఫోన్ నంబర్లను ట్యాపింగ్ చేసేందుకు అప్పటి ఎస్ఐబీ చీఫ్ టీ ప్రభాకర్ రావు ఫైళ్లు పంపించడం, రివ్యూ కమిటీ ఆమోదించడం వెంటవెంటనే జరిగిపోయాయి. ఆమోదం తెలియజేయడంలో మాజీ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి పాత్ర ఉన్నట్లు సిట్ విచారణలో తేలడంతో ఆమెకు నోటీసులు పంపించారు. నోటీసులు అందుకున్న ఆమె సోమవారం సిట్ ముందు హాజరై వివరాలు అందచేశారు. ఈమెతో పాటు సాధారణ పరిపాలన విభాగం (జీఏడీ) సెక్రెటరీ ఎం రఘునందన్ రావును సిట్ అధికారులు ప్రశ్నించారు. టీ ప్రభాకర్ రావు, డీ ప్రణీత్ రావు తెలిపిన వివరాల ఆధారంగా వీరిద్దరి నుంచి స్టేట్ మెంట్ ను సిట్ రికార్డు చేసింది.
ఎంపీ ఈటల, గుజ్జల, గంగిడిలకు పిలుపు!
ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తు సంస్థ సిట్ నుంచి మాజీ మంత్రి, బీజేపీ మల్కాజిగిరి ఎంపీ ఈటల రాజేందర్‌కు, బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్ రెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు గంగిడి మనోహర్ రెడ్డిలకు పిలుపు వెళ్లింది. ఈటల, ప్రేమేంద్ రెడ్డిలను మంగళవారం ఉదయం 11గంటలకు విచారణకు హాజరు కావాలని సిట్ కోరింది. ఫోన్ ట్యాపింగ్ బాధితుల జాబితాలో వారు కూడా ఉండటంతో వారిని సిట్ సాక్షులుగా విచారించి వాంగ్మూలం తీసుకోనుంది. హుజురాబాద్ ఉప ఎన్నిక సందర్భంతో పాటు అంతకుముందు.. తర్వాత తన ఫోన్ ట్యాపింగ్ గురైనట్లుగా ఈటలు పలు సందర్భాల్లో తెలిపారు. అలాగే మునుగోడు ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థిగా పోటీ చేసిన గంగిడి ఫోన్ కూడా ట్యాపింగ్ గురైందంటున్నారు. బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ఇన్‌చార్జ్‌గా మనోహర్ రెడ్డి వ్యవహరించారు. మునుగోడు ఉప ఎన్నికలో బీజేపీ కోఆర్డినేటర్‌గా ఉన్నారు. అప్పటి కేసీఆర్ ప్రభుత్వం బండి సంజయ్ వెన్నంటి ఉన్న నేతల ఫోన్లన్నీ ట్యాప్ చేసినట్లుగా సిట్ గుర్తించిందని సమాచారం. వీలు చూసుకుని రెండు రోజుల్లో సిట్ ముందు హాజరుకావాలని గంగిడికి సిట్ అధికారులు సూచించారు. గత అసెంబ్లీ ఎన్నికల సమయంలో నాటి బీఆర్‌ఎస్ ప్రభుత్వం పీసీసీ లీగల్ సెల్ కామారెడ్డి జిల్లా చైర్మన్ దేవరాజు గౌడ్ ఫోన్‌ను ట్యాపింగ్ చేసినట్లు తేలడంతో విచారణకు హాజరుకావాలని ఆయనను కూడా సిట్ ఆదేశించింది. దేవరాజు గౌడ్ నివాసంలో ఉంటూ కామారెడ్డి నియోజకర్గ ఎన్నికలను కొండల్ రెడ్డి పర్యవేక్షించారు. కొడంగల్ తోపాటు ఈ నియోజకవర్గం నుంచి రేవంత్ రెడ్డి పోటీ చేసిన విషయం తెలిసిందే. ఇకపోతే సోమవారం మేడ్చల్ కాంగ్రెస్ నేత హరివర్ధన్‌రెడ్డి, వరంగల్ కాంగ్రెస్ నేత సుధీర్‌రెడ్డి సిట్ ముందు హాజరై తమ ఫోన్ ట్యాపింగ్ వివరాలపై వాంగ్మూలం ఇచ్చారు. ఇటీవల ఫోన్ ట్యాపింగ్ కేసులో పలువురు బాధితులను సిట్ వరుసగా విచారిస్తోంది. వీరిచ్చే వివరాలతో నిందితులను ప్రశ్నించనుంది. ఫోన్ ట్యాపింగ్ కేసులో ప్రధాన నిందితుడు టీ ప్రభాకర్ రావు వరుసగా ఆరోసారి సోమవారం మరోసారి సిట్ విచారణకు హాజరయ్యారు.