Site icon vidhaatha

Amarnath Yatra | అమర్‌నాథ్‌ యాత్రకు వెళ్దామనుకుంటున్నారా..? యాత్ర తేదీలు, రిజిస్ట్రేషన్‌ ఎప్పటి నుంచో తెలుసా..?

Amarnath Yatra | త్వరలోనే జమ్మూకశ్మీర్‌లో అమర్‌నాథ్‌ యాత్ర ప్రారంభం కానున్నది. ఈ ఏడాది రెండునెలలకుపైగా యాత్ర నిర్వహించేలా అధికార యంత్రాంగం ఏర్పాట్లు చేస్తున్నది. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం రాజ్‌భవన్‌లో అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు కీలకసమావేశం జరుగనున్నది. ఇందులో అమర్‌నాథ్‌ యాత్రకు సంబంధించిన తేదీలను ఖరారు చేసే అవకాశం ఉన్నది. అమర్‌నాథ్‌ గుహతో పాటు మార్గంలో మంచు తొలగింపు, ఇతర పనుల కోసం బోర్డు టెండర్లు జారీ చేసింది. ఏప్రిల్‌-మే మధ్య మంచును తొలగించి భక్తుల ప్రయాణానికి సన్నాహాలు చేయనున్నారు.

సమాచారం మేరకు.. అమర్‌నాథ్‌ దేవస్థానం బోర్డు చైర్మన్‌, కశ్మీర్‌ లెఫ్టినెంట్‌ గవర్నర్‌ మనోజ్‌ సిన్హా అధ్యక్షతన సాయంత్రం 4 గంటలకు రాజ్‌భవన్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ భేటీకి సభ్యులందరినీ ఆహ్వానించారు. యాత్ర తేదీలను ప్రకటించిన అడ్వాన్స్‌డ్‌ రిజిస్ట్రేషన్‌ను ఏప్రిల్‌లో ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తున్నది. జులై ఒకటి నుంచి యాత్ర ప్రారంభం కానున్నట్లు సమాచారం. జమ్మూ కశ్మీర్‌లోని నిర్దేశిత ఆసుపత్రులలో పర్యాటకులకు ఆరోగ్య ధ్రువీకరణపత్రాలు జారీ చేయనున్నారు. రోజుకు పదివేల మంది యాత్రికులు సంప్రదాయ బల్తాల్‌, పహల్గాం మార్గాల ద్వారా అమర్‌నాథ్‌ గుహకు వెళ్లనున్నారు. ఆన్‌లైన్‌లోనే కాకుండా ఆఫ్‌లైన్‌లో దేశవ్యాప్తంగా 500 వివిధ బ్యాంకు శాఖల్లో రిజిస్ట్రేషన్‌ చేసుకునేందుకు అవకాశం ఉండనున్నది. మరో వైపు యాత్ర కోసం భారీగా భక్తులు పెరిగే అవకాశం ఉందని అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలో సౌకర్యాలను పెంచేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. శ్రీనగర్‌లో యాత్రి నివాస్‌ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.

ప్రయాణంలో వర్షాలు కురుస్తుండడంతో జమ్మూ-శ్రీనగర్ జాతీయ రహదారిని మూసివేయడం పెద్ద సవాల్‌గా మారుతున్నది. ఈసారి ఇలాంటి పరిస్థితుల్లో జమ్మూ నుంచి శ్రీనగర్‌ వెళ్లే మార్గంలో వేలాది మంది ప్రయాణికులు ఉండేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. ఇక 2023లో జరిగిన అమర్‌నాథ్‌ యాత్ర 62 రోజుల పాటు కొనసాగింది. యాత్రలో 4.45 లక్షల మంది భక్తులు మంచులింగాన్ని దర్శించుకున్నారు. 2011లో అత్యధికంగా 6.36 లక్షల మంది ప్రయాణికులు రాగా.. 2012లో 6.20 లక్షల మంది ప్రయాణికులు అమర్‌నాథ్‌కు చేరుకున్నారు.

Exit mobile version