ఇక పుజ‌రా, ర‌హానేల కెరీర్ ఖ‌త‌మైన‌ట్టేనా..ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌కు దూరం పెట్టేశారుగా..!

  • Publish Date - January 13, 2024 / 02:33 AM IST

కొత్త సంవ‌త్స‌రంలో టీమిండియా మంచి విజ‌యాల‌తో దూసుకుపోతుంది. జ‌న‌వ‌రిలో సౌతాఫ్రికాతో టెస్ట్ మ్యాచ్ ఆడిన భార‌త్ మంచి విజ‌యం సాధించింది. ఇక ఆ త‌ర్వాత ఆఫ్ఘ‌నిస్తాన్‌తో ఆడుతుంది. రీసెంట్‌గా జ‌రిగిన‌ తొలి టీ20లో మంచి విజ‌యం సాధించింది. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా రేపు రెండో టీ 20 జ‌ర‌గ‌నుంది. ఈ సిరీస్ త‌ర్వాత ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్ ఉండ‌నుంది. భారత్‌- ఇంగ్లండ్‌ల మధ్య జనవరి 25 నుంచి టెస్ట్‌ సిరీస్‌ ప్రారంభం కానుంది. ఇరు జట్ల మధ్య మొత్తం 5 టెస్ట్‌ మ్యాచ్‌లు జ‌ర‌గ‌నుండ‌గా, సొంత గ‌డ్డ‌పై భార‌త్ అమీతుమి తేల్చుకోవాల‌ని చూస్తుంది.

అయితే ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్‌లో భాగంగా తొలి రెండు మ్యాచ్‌ల కోసం 16 మంది సభ్యులతో కూడిన భారత జట్టును బీసీసీఐ సీనియర్ సెలక్షన్ కమిటీ ప్రకటించింది . ఈ సిరీస్‌కు ఇంగ్లాండ్ బోర్డు ఇప్పటికే తమ జట్టును ప్రకటించగా, ఇక ఇప్పుడు భార‌త జ‌ట్టు కూడా ఆట‌గాళ్ల‌ని ప్ర‌క‌టించింది. ఇంగ్లండ్‌తో జరిగే టెస్ట్ సిరీస్‌లోని తొలి మ్యాచ్ హైదరాబాద్‌లోని రాజీవ్ గాంధీ అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. రెండో మ్యాచ్ విశాఖపట్నంలోని వైఎస్ రాజశేఖరరెడ్డి ఏసీఏ-వీడీసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరగనుంది. ఈ రెండు టెస్ట్ మ్యాచ్‌ల‌లో కొత్త ఆట‌గాళ్ల‌కి అవ‌కాశం ఇచ్చింది బీసీసీఐ. మ‌హ్మ‌ద్ ష‌మీ ఇంకా గాయం నుండి కోలుకోలేద‌ని తెలుస్తుండ‌గా, అతనిని ఎంపిక చేయ‌లేదు. ఇక యువ వికెట్ కీపర్-బ్యాటర్‌ ఇషాన్ కిషన్ కు కూడా టెస్టు జట్టులో చోటు దక్కలేదు.

ఇటీవల దక్షిణాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు ఎంపికయ్యాడు. అయితే టెస్టు సిరీస్ ప్రారంభానికి ముందే భారత్‌కు తిరిగొచ్చాడు. ప్రస్తుతం ఇంగ్లండ్‌తో ఎంపిక చేసిన టెస్టు జట్టులో కిషన్‌కు కూడా చోటు దక్కలేదు. కిషన్ అందుబాటులో లేకపోవడంతో అతడి స్థానంలో మూడవ ఛాయిస్ వికెట్ కీపర్‌గా ధ్రువ్ జురెల్‌ని జట్టులోకి తీసుకున్నారు. సెలెక్టర్ల నుంచి ఈ యువ ఆటగాడికి తొలిసారి పిలుపు అందింది. తొలి 2 మ్యాచ్‌లకు ఎంపిక చేసిన జట్టులో నలుగురు స్పిన్నర్లు ఉన్నారు. రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌లకు చోటిచ్చింది. పేస్ విభాగానికి వస్తే అవేష్ ఖాన్, మహ్మద్ సిరాజ్, జస్ప్రీత్ బుమ్రా, ముఖేష్ కుమార్‌లను ఎంపిక చేసింది. ఇక ఈ జట్టుకి రోహిత్ శర్మ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా, స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా వైస్ కెప్టెన్‌గా సెలక్ట్ అయ్యాడు . ఇక సీనియ‌ర్ బ్యాట్స్‌మెన్స్ ర‌హానే, పుజారాకి మ‌రోసారి నిరాశే ఎదురైంది.

ఇంగ్లండ్‌తో జ‌ర‌గ‌బోయే టెస్ట్ కోసం భార‌త జ‌ట్టు ఇలా ఉంది.. రోహిత్ శర్మ సారధిగా, జస్ప్రీత్ బుమ్రా వైస్‌కెప్టెన్‌గా, శుభ్‌మన్ గిల్, యశస్వి జైస్వాల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, వికెట్ కీపర్ కేఎల్ రాహుల్, కేఎస్ భరత్ (వికెట్ కీపర్), ధ్రువ్ జురెల్ (వికెట్ కీపర్), రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా, అక్షర్ పటేల్, కుల్ దీప్ యాదవ్, మహ్మద్ సిరాజ్, ముకేశ్, అవేశ్ ఖాన్‌లను ఎంపిక చేసింది.


Latest News