ఛ‌త్తీస్‌గ‌ఢ్‌లో కొన‌సాగుతున్న పోలింగ్.. సుక్మాలో మావోయిస్టుల పేలుళ్లు..

  • Publish Date - November 7, 2023 / 03:07 AM IST

ఛ‌త్తీస్‌గ‌డ్ అసెంబ్లీ ఎన్నిక‌ల‌కు తొలి విడుత పోలింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతోంది. తొలి విడుత‌లో భాగంగా 20 అసెంబ్లీ స్థానాల‌కు మంగ‌ళవారం ఉద‌యం 7 గంట‌ల‌కు పోలింగ్ ప్రారంభమైంది. ఈ నియోజ‌క‌వ‌ర్గాలు చాలా వ‌ర‌కు మావోయిస్టు ప్ర‌భావిత ప్రాంతాల్లో ఉన్నాయి. దీంతో ఎలాంటి అవాంఛనీయ ఘ‌ట‌న‌లు చోటుచేసుకోకుండా పోలీసులు మూడంచెల భ‌ద్ర‌త ఏర్పాటు చేశారు. 25 వేల మంది పోలీసులు భ‌ద్ర‌తాచ‌ర్య‌ల్లో నిమ‌గ్న‌మ‌య్యారు.

ఇంత ప‌టిష్ట బందోబ‌స్తు ఏర్పాటు చేసిన‌ప్ప‌టికీ మావోయిస్టులు విధ్వంసం సృష్టించారు. సుక్మా పరిధిలోని తొండ‌మ‌ర్క ప‌రిధిలో మావోయిస్టులు రెచ్చిపోయారు. ఎన్నిక‌ల విధుల్లో ఉన్న జ‌వాన్ల‌ను ల‌క్ష్యంగా చేసుకుని పేలుళ్ల‌కు పాల్ప‌డ్డారు. ఐఈడీ బాంబు పేల్చ‌డంతో ఓ సీఆర్పీఎఫ్ జ‌వాను తీవ్రంగా గాయ‌ప‌డ్డారు. మావోయిస్టుల పేలుళ్ల‌తో పోలీసు బ‌ల‌గాలు అప్ర‌మ‌త్త‌మ‌య్యాయి. ఆ ప్రాంతంలో పోలీసులు కూంబింగ్ నిర్వ‌హించారు. సాయంత్రం వ‌ర‌కు పోలింగ్ ప్ర‌శాంతంగా కొన‌సాగించేందుకు పోలీసులు చ‌ర్య‌లు తీసుకుంటున్నారు.

మావోయిస్టు ప్ర‌భావిత నియోజ‌క‌వ‌ర్గాలైన మోహ్లా-మాన్‌పూర్, అంత‌గ‌ర్హ్‌, భానుప్ర‌తాప్‌పూర్, కాంకేర్, కేశ్‌క‌ళ్‌, కొండ‌గావ్, నారాయ‌ణ‌పూర్‌, దంతెవాడ‌, బీజాపూర్‌, కుంట‌లో మ‌ధ్యాహ్నం 3 గంట‌ల వ‌ర‌కే పోలింగ్ జ‌ర‌గ‌నుంది. కైరాగ‌ర్హ్‌, దొంగ‌ర్‌గ‌ర్హ్‌, రాజ్‌నంద్‌గావ్‌, దొంగ‌ర‌గావ్‌, కుజ్జి, పండరియా, కావ‌ర్ధ బ‌స్త‌ర్, జ‌గ‌దల్‌పూర్‌, చిత్ర‌కోట్ నియోజ‌క‌వ‌ర్గాల్లో సాయంత్రం 5 గంట‌ల వ‌ర‌కు పోలింగ్ కొన‌సాగ‌నుంది.

Latest News