Site icon vidhaatha

షిఫాన్ చీర‌ల చ‌రిత్ర మీకు తెలుసా..? ఆ మ‌హారాణి వల్లే ఇండియాలో పాపులర్..!

భార‌తీయ మ‌గువ‌ల‌కు చీర‌లంటే ఎంతో మ‌క్కువ‌. సిల్క్ శారీస్ నుంచి మొద‌లుకుంటే ప‌ట్టు చీర‌ల వ‌ర‌కు అన్నింటిని ధ‌రించి, త‌మ అందంతో మ‌గాళ్ల మ‌నసుల‌ను దోచుకుంటారు మ‌గువ‌లు. త‌మ భార్య‌ల‌ను చీర‌క‌ట్టులోనే చూడాల‌నే మ‌గాళ్లు కూడా చాలా మందే ఉంటారు. భ‌ర్త‌ల‌కు ఇష్ట‌మైన చీర‌ల‌తో పాటు త‌మకు న‌చ్చిన చీర‌ల‌ను ధ‌రించేందుకు కూడా మ‌హిళ‌లు ఆస‌క్తి చూపిస్తారు. కొంద‌రు కాట‌న్ శారీస్ ధ‌రిస్తే, మ‌రికొంద‌రు సిల్క్, ఇంకొంద‌రు షిఫాన్ చీర‌లు ధ‌రించేందుకు ఇష్ట‌ప‌డుతుంటారు. ఇటీవ‌లి కాలంలో యువ‌తులు, మ‌హిళ‌లు షిఫాన్ చీర‌ల‌ను ఎక్కువ‌గా ఇష్ట‌ప‌డుతున్నారు. ఎందుకంటే ఈ చీర‌లు తేలిక‌గా ఉంటాయి.. అందులోనూ మ‌రింత అందంగా క‌నిపిస్తారు. మ‌రి ఇంత‌టి ప్రాధాన్య‌మున్న షిఫాన్ చీర‌ల‌కు పెద్ద క‌థే ఉంది. ఆ క‌థ తెలుసుకోవాలంటే ఓ వందేండ్లు వెన‌క్కి వెళ్లాల్సిందే. అందంగానే కాకుండా, ఎంతో సౌక‌ర్యంగా ఉండే షిఫాన్ చీర‌ల‌ను ఇండియాకు ప‌రిచయం చేసింది మ‌హారాణి ఇందిరా దేవి. ఆ మ‌హారాణి వ‌ల్లే షిఫాన్ చీర‌లు పాపుల‌ర్ అయ్యాయి. మ‌రి ఆ క‌థేంటో తెలుసుకుందామా..!

బ‌రోడా రాణి ఇందిరా దేవి.. 1892, ఫిబ్ర‌వ‌రి 19వ తేదీన బ‌రోడా గైక్వాడ్ కుటుంబంలో జ‌న్మించారు. శాయాజీ రావు గైక్వాడ్ III, ఆయ‌న రెండో భార్య మ‌హారాణి చిమ్నాబాయ్‌కు క‌లిగిన సంతాన‌మే ఇందిరా దేవి. 500 ఎక‌రాల్లో ఉన్న ల‌క్ష్మీ విలాస్ ప్యాలెస్‌లో ఇందిరా దేవి పెరిగి పెద్ద‌దైంది. ఉన్న‌త విద్య అభ్య‌సించిన ఫ‌స్ట్ ఇండియ‌న్ రాయ‌ల్ వుమెన్‌గా ఆమె ప్ర‌సిద్ధిగాంచారు.

త‌ల్లిదండ్రుల‌ను ఎదురించి ప్రేమ వివాహం..

ఇక ఇందిరా దేవి సౌంద‌ర్యానికి ఎంతో మంది మ‌గాళ్లు మంత్ర‌ముగ్ధుల‌య్యేవారు. ఆమెకు 18 ఏండ్ల వ‌య‌సు ఉన్న‌ప్పుడే.. 38 ఏండ్ల మాధో రావు సింధియాతో నిశ్చితార్థానికి త‌ల్లిదండ్రులు నిర్ణ‌యించారు. అయితే ఢిల్లీ ద‌ర్బార్‌లో 1911లో ఓ స‌మావేశం నిర్వ‌హించ‌గా, అక్క‌డికి ఇందిరా దేవి వెళ్లారు. కూచ్ బెహార్ మ‌హారాజా సోద‌రుడు జితేంద్ర నారాయ‌ణ్ ప‌ట్ల ఆమె మ‌న‌సు పారేసుకున్నారు. ఇక సింధియాను పెళ్లి చేసుకోన‌ని ఇందిరా త‌న త‌ల్లిదండ్రుల‌కు తెగేసి చెప్పింది. ఈ క్ర‌మంలో జితేంద్ర‌, ఇందిరా మ‌ధ్య ఉన్న సంబంధాన్ని చెరిపేసేందుకు బ‌రోడా మ‌హారాజు అనేక ప్ర‌య‌త్నాలు చేశారు. కానీ అవ‌న్నీ విఫ‌ల‌మ‌య్యాయి. చివ‌ర‌కు ఆ ప్రేమ ప‌క్షుల వివాహానికి మ‌హారాజు అంగీక‌రించారు. మొత్తానికి 1913లో లండ‌న్‌లో ఇందిరా, జితేంద్ర ఒక్క‌ట‌య్యారు.

ఫ్రాన్స్‌కు వెళ్లిన‌ప్పుడు షిఫాన్‌పై దృష్టి..

కూచ్ బెహార్ మ‌హారాజా సోద‌రుడు జితేంద్ర నారాయ‌ణ్‌ను ఇందిరా పెళ్లి చేసుకోవ‌డంతో ఆమె మ‌హారాణిగా మారారు. పెళ్లయిన కొద్ది రోజులకే జితేంద్ర తన సోదరుడిని కోల్పోయారు. దీంతో కూచ్ బెహార్ మహారాజా సింహాసనాన్ని అధిష్టించారు జితేంద్ర‌. ఇందిరా దేవిని రాణిగా మార్చాడు. ఈ దంప‌తుల‌కు ముగ్గురు కుమార్తెలు.. ఇద్ద‌రు కుమారులు. ఆల్క‌హాలిక్ పాయిజ‌న్ కార‌ణంగా జితేంద్ర చ‌నిపోయారు. నాటి నుంచి ఇందిరా దేవి.. తెలుపు రంగు చీర ధ‌రించి, సామాజిక జీవితాన్ని గ‌డిపారు. అయితే ఆమె అనేక ఈవెంట్ల‌లో పాల్గొనేందుకు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌ర్య‌టించేది. ఆమె యూర‌ప్‌కు వెళ్లిన‌ప్పుడు ఫ్రాన్స్‌లోని లియోన్‌లో తొలిసారిగా ఇందిరా షిఫాన్ బ‌ట్ట‌ను చూసింది. అది తేలిక‌గా ఉండ‌టంతో ఆమె త‌న‌కు స‌రైన శారీ మెటీరియ‌ల్ అవుతుంద‌ని భావించారు.

ఇందిరను మ‌రింత గ్లామ‌రైజ్ చేసిన షిఫాన్ శారీ

మ‌హారాణి ఇందిరా దేవి.. ఫ్రాన్స్‌లోని మ‌గ్గాల వ‌ద్ద త‌యారు చేయించిన బెస్పోక్ షిఫాన్ చీర‌ల‌ను ధ‌రించ‌డం మొద‌లు పెట్టారు. ఆరు గ‌జాల ఆ చీర ఆమెను మ‌రింత గ్లామ‌రైజ్ చేసింది. రాజ్యాధికారినికి ప్ర‌తీక‌గా కూడా ఆ చీర బాగుంటుంద‌ని భావించారు. ఇక అప్ప‌ట్నుంచి షిఫాన్ చీర‌ల‌ను భార‌త‌దేశానికి ప‌రిచయం చేసింది. ప్రస్తుత బరోడా రాణి మహారాణి రాధికా రాజే గైక్వాడ్, తన కుటుంబ పూర్వీకుల అడుగుజాడల్లో నడుస్తూ, ఆరు గజాల చేనేత కోసం పోరాడుతూ, వస్త్ర చరిత్రను కాపాడుతున్నారు. ఇందిరా దేవి ఆలోచ‌న‌కు ప్ర‌తిరూప‌మే నేటి షిఫాన్ చీర‌లు. ఇప్పుడు ప్ర‌తి ఇంట్లోని బీరువాలో షిఫాన్ చీర భాగ‌మైపోయింది. ప్ర‌తి మ‌హిళ షిఫాన్ చీర‌లు ధ‌రించి త‌ళుక్కున మెరిసిపోతూ అంద‌రిని మురిపిస్తున్నారు.   

Exit mobile version