తొలి టీ20లో భార‌త మ‌హిళ‌ల జ‌ట్టు ఓట‌మి.. బీసీసీపై ఫ్యాన్స్ ఫైర్

  • Publish Date - December 7, 2023 / 02:11 AM IST

భార‌త్ వేదికగా ఆస్ట్రేలియాతో జ‌రిగిన ఐదు టీ20ల సిరీస్‌లో భార‌త్ నాలుగు గెలిచి ట్రోఫీ ద‌క్కించుకున్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు భార‌త్- ఇంగ్లండ్ జ‌ట్లకి సంబంధించిన మ‌హిళ మ‌ధ్య టీ20 సిరీస్ న‌డుస్తుంది. ముంబై వేదికగా బుధవారం జరిగిన తొలి మ్యాచ్‌లో ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు భార‌త్‌ని 38 ప‌రుగుల తేడాతో ఓడించింది. ముందుగా బ్యాటింగ్ చేసిన ఇంగ్లండ్ మ‌హిళ‌ల జ‌ట్టు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 197 పరుగుల భారీ స్కోర్ చేసింది. డేనియల్ వ్యాట్(47 బంతుల్లో 8 ఫోర్లు, 2 సిక్స్‌లతో 75), నాట్ సీవర్(53 బంతుల్లో 13 ఫోర్లతో 77) హాఫ్ సెంచరీలతో దుమ్ము రేప‌డంతో భార‌త్ ముందు భారీ ల‌క్ష్యాన్ని ఉంచారు.

భారీ లక్ష్యచేధనకు దిగిన టీమిండియా మహిళ‌లు నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 159 పరుగులు మాత్ర‌మే చేశారు .షెఫాలీ వర్మ(42 బంతుల్లో 9 ఫోర్లతో 52) ఒక్కతే హాఫ్ సెంచరీతో రాణించగా.. మిగతా బ్యాటర్లు ఎవ‌రు కూడా పెద్ద‌గా ర‌ణించ‌లేక‌పోయారు. ఇన్నింగ్స్ మూడో ఓవర్‌లోనే స్మృతి మంధాన(6)ని నాట్ సీవర్ క్లీన్ బౌల్డ్ చేసింది. ఆ వెంటనే జెమీమా రోడ్రీగ్స్(4)ను కెంప్ కీప్ క్యాచ్‌గా పెవిలియన్ చేర్చ‌గా, ఆ త‌ర్వాత హ‌ర్మ‌న్ ప్రీత్ కౌర్.. షెఫాలీతో క‌లిసి స్కోర్ బోర్డ్ ప‌రుగెత్తించే ప్ర‌య‌త్నం చేసింది. ఆచితూచి ఆడుతూ వీలు చిక్కిన బంతిని బౌండరీకి తరలించారు. క్రీజులో పాతుకుపోయే ప్రయత్నం చేసిన ఈ జోడీని ఎకెల్‌స్టోన్ విడదీసింది. హర్మన్‌ప్రీత్(26)ను క్లీన్ బౌల్డ్ చేయ‌డంతో పెవీలియ‌న్ బాట ప‌ట్టింది.. ధాటిగా ఆడే క్రమంలో రిఛా ఘోష్(21)తో పాటు షెఫాలీ వర్మ(52) ఔట్ కావ‌డంతో భార‌త్ ఓటమి ఖాయ‌మైంది.

అయితే ముంబై క్రికెట్ అసోసియేషన్ అధికారులకు మహిళల క్రికెట్ అంటే చాలా చిన్న చూపు ఉందని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు క్రికెట్ అభిమానులు. బీసీసీఐతో పాటు ముంబై క్రికెట్ అసోసియేషన్‌ను ఓ ఆట ఆడుకుంటున్నారు.మ్యాచ్‌కు అతి కొద్ది మందే ప్రేక్షకులే హాజరవ్వగా వారికి కూడా సరైన సౌకర్యాలను క‌ల్పించ‌లేక‌పోయారంటూ తిట్టిపోస్తున్నారు. స్కోర్ బోర్డ్ అంద‌రికి కనిపించేలా పెట్ట‌లేదు, అలానే మైదానం మొత్తం ఒకే ఒక్క స్క్రీన్ సౌకర్యాన్ని కల్పించిన నిర్వాహకులు అది కూడా.. అభిమానులు కూర్చున్న వైపే పెట్టారు. అమ్మాయిల క్రికెట్ అంటే ఇంత నిర్లక్ష్యం, ఇంత చిన్న చూపా? అంటూ కొంద‌రు ప్ర‌శ్నిస్తున్నారు.

Latest News