2 గంట‌ల్లో 160 కి.మీ.. లోకో పైల‌ట్ లేకుండా దూసుకెళ్లిన గూడ్స్ రైలు..

ఓ గూడ్స్ రైలు లోకో పైల‌ట్ లేకుండానే దూసుకెళ్లింది. కేవ‌లం 2 గంట‌ల్లోనే 160 కిలోమీట‌ర్ల దూరం వెళ్లింది ఆ గూడ్స్ రైలు.

  • Publish Date - February 25, 2024 / 08:24 AM IST

ఓ గూడ్స్ రైలు లోకో పైల‌ట్ లేకుండానే దూసుకెళ్లింది. కేవ‌లం 2 గంట‌ల్లోనే 160 కిలోమీట‌ర్ల దూరం వెళ్లింది ఆ గూడ్స్ రైలు. ఈ ఘ‌ట‌న జ‌మ్మూక‌శ్మీర్ – పంజాబ్ మ‌ధ్య ఆదివారం ఉద‌యం చోటు చేసుకున్న‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు.

వివ‌రాల్లోకి వెళ్తే.. జ‌మ్మూక‌శ్మీర్‌లోని క‌థువా రైల్వే స్టేష‌న్‌లో ఓ గూడ్స్ రైలు ఆదివారం ఉద‌యం 7:10 గంట‌ల‌కు ఆగింది. లోకో పైల‌ట్ టీ తాగేందుకు రైలు దిగి వెళ్లాడు. అంత‌లోనే గూడ్స్ రైలు వేగం అందుకుని ప‌ఠాన్‌కోట్ వైపు బ‌య‌ల్దేరింది. గంట‌కు 100 కిలోమీట‌ర్ల వేగంతో రైలు దూసుకెళ్లింది. దీంతో అప్ర‌మ‌త్త‌మైన లోకో పైల‌ట్ రైల్వే అధికారుల‌కు స‌మాచారం అందించాడు.

రైల్వే అధికారులు.. క‌థువా నుంచి ప‌ఠాన్‌కోట్ వెళ్లే మార్గంలో ఉన్న అన్ని రైల్వే స్టేష‌న్ల సిబ్బందిని అప్ర‌మ‌త్తం చేశారు. రెండు గంట‌ల పాటు శ్ర‌మించి చివ‌ర‌కు పంజాబ్ ముకేరియ‌న్‌లోని ఉచ్సి బ‌స్సీ రైల్వే స్టేష‌న్ స‌మీపంలో గూడ్స్ రైలును ఆపారు. అయితే ఆ గూడ్స్ రైలు ఈ రెండు గంట‌ల్లో 160 కిలోమీట‌ర్లు ప్ర‌యాణించిన‌ట్లు రైల్వే అధికారులు తెలిపారు.

లోకో పైల‌ట్ లేకుండా దూసుకెళ్లిన గూడ్స్ రైలు నంబ‌ర్ 14806R. అయితే రైలు నుంచి కింద‌కు దిగే ముందు లోకో పైల‌ట్ హ్యాండ్ బ్రేక్ వేయ‌లేద‌ని స‌మాచారం. ఈ ఘ‌ట‌న‌లో ఎలాంటి ప్రాణ న‌ష్టం, ఇత‌ర న‌ష్టం జ‌ర‌గ‌లేద‌ని రైల్వే అధికారులు తెలిపారు. ఇప్ప‌టి వ‌ర‌కు లోకో పైల‌ట్ మీద కానీ, ఇత‌ర సిబ్బందిపై ఎలాంటి చ‌ర్య‌లు తీసుకోలేదు. అయితే ఈ ఘ‌ట‌న‌కు క‌చ్చిత‌మైన కార‌ణం తెలుసుకునేందుకు రైల్వే అధికారులు ద‌ర్యాప్తు చేప‌ట్టిన‌ట్లు స‌మాచారం. 

Latest News