Site icon vidhaatha

ఢిల్లీలో మళ్లీ పడిపోయిన వాయు నాణ్యత.. ‘తీవ్ర’ క్యాటగిరీలోకి!

ఎయిర్‌ క్వాలిటీ ఇండెక్స్‌ (ఏక్యూఐ) కాస్త మెరుగుపడిందని ఊపిరి పీల్చుకునేలోపే దేశ రాజధాని ఢిల్లీ మళ్లీ కాలుష్యం కోరల్లో చిక్కుకుపోయింది. శుక్రవారం అనేక ప్రాంతాలు తీవ్ర క్యాటగిరీలోకి చేరిపోయాయని కేంద్ర కాలుష్య నియంత్రణ బోర్డు తెలిపింది. బోర్డు విడుదల చేసిన డాటా ప్రకారం.. ఉదయం ఆరు గంటల ప్రాంతంలో ఆనంద్‌ విహార్‌ 412 పాయింట్లు, అశోక్‌విహార్‌ ప్రాంతాల్లో 405 పాయింట్లుగా గాలి నాణ్యత నమోదైంది. అంటే.. పరిస్థితి తీవ్రంగా ఉందని అర్థం.


ఇక జహంగీర్‌పురి, ద్వారక సెక్టర్‌ -8లో 411, 405గా రికార్డయింది. దేశ రాజధానిలో కాలుష్యం స్థాయి తగ్గించేందుకు ప్రభుత్వం కనీస చర్యలు తీసుకోవడం లేదని అనుజ్‌ కుమార్‌ అనే స్థానికుడు ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘ఢిల్లీలో కాలుష్యం తీవ్రస్థాయిలో ఉన్నది. ఉదయం పూట నడక సమయంలో ఊపిరి పీల్చుకోవడం కూడా మాకు కష్టంగా ఉంది’ అని ఆయన తెలిపారు. వర్షంతో కాస్త తగ్గినా ఇంకా ఇబ్బందికరంగానే ఉన్నదని చెప్పారు. కాలుష్యం ఇంత తీవ్ర స్థాయిలో ఉన్నా ప్రభుత్వం ఎలాంటి చర్యలూ తీసుకోవడం లేదని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.


మార్నింగ్‌ వాక్‌ సందర్భంగా మాస్క్‌ పెట్టుకుని కనిపించిన ఒక వృద్ధుడు ఒక వార్తా సంస్థతో మాట్లాడుతూ.. శ్వాస సంబంధమైన సమస్యలు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు. ‘కాలుష్యం తీవ్ర స్థాయిలో ఉన్నది. ఇది మానవులకు చాలా ప్రమాదకరం. మార్నింగ్‌వాక్‌ సమయంలో మాస్కులు పెట్టుకోవాల్సి వస్తున్నది. నేను వృద్ధుడిని. మార్నింగ్‌ వాక్‌ కోసం వచ్చాను. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కారణంగా కనీసం పది నిమిషాలు కూడా నడవలేక పోతున్నాను. చుట్టుపక్కల నిర్మాణ పనులు నడుస్తున్నాయి. ఇవాళ వర్షం కూడా లేకపోవడంతో కాలుష్యం స్థాయి అధికంగా ఉన్నది’ అని చెప్పారు. గాలి నాణ్యత సూచీ ప్రకారం.. 0 నుంచి 100 పాయింట్లు ఉంటే బాగున్నట్టు అర్థం. 100 నుంచి 200 మధ్య ఉంటే ఓ మోస్తరు అని, 200-300 మధ్య ఉంటే అధ్వాన్నం, 300-400 మధ్య ఉంటే మరీ అధ్వాన్నం, 400-500 మధ్య ఉంటే తీవ్రస్థాయి అని అంచనా వేస్తారు.


Exit mobile version