రైల్వే శాఖ‌లో 5,696 ఉద్యోగాలు.. ద‌ర‌ఖాస్తుల‌కు ఇక‌ ఐదు రోజుల గ‌డువే..!

రైల్వే శాఖ‌లో కొలువుల జాత‌ర కొన‌సాగుతోంది. వివిధ జోన్ల‌లో 5,696 అసిస్టెంట్ లోకో పైల‌ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల గ‌డువు స‌మీపిస్తోంది.

  • Publish Date - February 14, 2024 / 01:55 AM IST

రైల్వే శాఖ‌లో కొలువుల జాత‌ర కొన‌సాగుతోంది. వివిధ జోన్ల‌లో 5,696 అసిస్టెంట్ లోకో పైల‌ట్ పోస్టుల భ‌ర్తీకి ద‌ర‌ఖాస్తుల గ‌డువు స‌మీపిస్తోంది. ఆస‌క్తి గ‌ల అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకునేందుకు ఇంకా ఐదు రోజులు మాత్ర‌మే గ‌డువు ఉంది. అంటే ఫిబ్ర‌వ‌రి 19వ తేదీ అర్ధ‌రాత్రి 11:59 గంట‌ల వ‌ర‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. అర్హులైన అభ్య‌ర్థులు ఆఖ‌రి నిమిషం వేచి చూడ‌కుండా ముందే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డం మేల‌ని రైల్వే శాఖ సూచిస్తోంది.

అర్హ‌త‌లు ఇవే..

అభ్య‌ర్థులు సంబంధిత విభాగాల్లో ఐటీఐ పూర్తి చేసి ఉండాలి. లేదా మెకానిక‌ల్, ఎల‌క్ట్రిక‌ల్, ఎల‌క్ట్రానిక్స్ లేదా ఆటోమొబైల్ ఇంజినీరింగ్‌లో మూడేండ్ల డిప్లొమా చేసి ఉండాలి. అంతేగాక ఇంజినీరింగ్ పూర్తి చేసిన వాళ్లూ ఈ పోస్టుల‌కు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల వ‌య‌సు జులై 1, 2024 నాటికి 18 ఏండ్ల నుంచి 33 ఏండ్ల మ‌ధ్య ఉండాలి. కేట‌గిరీల వారీగా వ‌యో ప‌రిమితిలో స‌డ‌లింపు ఉంటుంది. కంప్యూట‌ర్ ఆధారిత రాత ప‌రీక్ష‌ల్లో మెరిట్, మెడిక‌ల్ ఫిట్‌నెస్ ప‌రీక్ష‌లు, డాక్యుమెంట్ వెరిఫికేష‌న్ త‌దిత‌ర ప్ర‌క్రియల ద్వారా ఎంపిక చేస్తారు.

రాత ప‌రీక్ష‌లు ఎప్పుడంటే..?

కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష జూన్ – ఆగ‌స్టు నెల‌ల్లో జ‌రిగే అవకాశం ఉంది. రెండో ద‌శ కంప్యూట‌ర్ ఆధారిత ప‌రీక్ష సెప్టెంబ‌ర్‌లో నిర్వ‌హించనున్నారు. ఆప్టిట్యూడ్ టెస్టు న‌వంబ‌ర్‌లో నిర్వ‌హిస్తారు. ఆప్టిట్యూడ్ టెస్టు అయిన త‌ర్వాత డాక్యుమెంట్ వెరిఫికేష‌న్‌కు షార్ట్‌లిస్ట్ అయిన అభ్య‌ర్థుల జాబితాను న‌వంబ‌ర్ లేదా డిసెంబ‌ర్ నెల‌లో విడుద‌ల చేసే అవ‌కాశం ఉంది. త‌దిత‌ర వివ‌రాల కోసం https://www.recruitmentrrb.in/#/auth/landing అనే వెబ్‌సైట్‌ను లాగిన్ అవ్వండి. 

Latest News