Site icon vidhaatha

రెండో వ‌న్డేలో పూర్తిగా నిరాశ‌ప‌ర‌చిన టీమిండియా.. సౌతాఫ్రికా ఘ‌న విజ‌యం

ప్ర‌స్తుతం టీమిండియా..సౌతాఫ్రికా టూర్‌తో బిజీగా ఉన్న విష‌యం తెలిసిందే. ఇప్పుడు మూడు వ‌న్డేల సిరీస్ ఆడుతుండ‌గా, తొలి వ‌న్డేలో ఘ‌న విజ‌యం సాధించారు. ఇక రెండో వన్డేలో భారత బ్యాటర్లు దారుణంగా విఫలమయ్యారు. బౌలింగ్‌కు అనుకూలంగా ఉన్న పిచ్‌పై సఫారీ బౌలర్లు చెలరేగడంతో తొలుత బ్యాటింగ్ చేసిన భార‌త్ 46.2 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. సాయి సుదర్శన్(83 బంతుల్లో 7 ఫోర్లు, సిక్స్‌తో 63), కేఎల్ రాహుల్(64 బంతుల్లో 7 ఫోర్లతో 56) హాఫ్ సెంచరీలతో రాణించ‌గా, మిగ‌తా బ్యాట్స్‌మెన్ ఎవ‌రు పెద్ద‌గా రాణించ‌లేదు. బర్గర్ వేసిన తొలి ఓవర్‌లోనే రుతురాజ్ గైక్వాడ్(4) వికెట్ల ముందు దొరికిపోగా, ఆ త‌ర్వాత క్రీజులోకి వచ్చిన తిలక్ వర్మతో సాయి సుదర్శన్ ఆచితూచి ఆడాడు. కాని తిలక్ వర్మ(10)ను బర్గర్ క్యాచ్ ఔట్‌గా పెవిలియన్ చేర్చాడు.

ఇక క్రీజులోకి వచ్చిన కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్ ఇన్నింగ్స్ చక్కదిద్దే ప్రయత్నం చేశాడు. సెంచరీ దిశగా సాగుతున్న సాయి సుదర్శన్ కీప‌ర్ క్యాచ్‌గా ఔట‌య్యాడు. త‌ర్వాత‌ బ్యాటింగ్‌కు దిగిన సంజూ శాంసన్‌(12)ను హెన్రీక్స్ క్లీన్ బౌల్డ్ చేశాడు. ఇక హాఫ్ సెంచ‌రీ పూర్త‌య్యాక రాహుల్ ఔటయ్యాడు. దూకుడ‌గా ఆడే ప్ర‌య‌త్నం చేసి రింకూ కూడా త్వ‌ర‌గానే ఔట‌య్యాడు. ఇక అక్షర్ పటేల్(7), కుల్దీప్ యాదవ్(1) ,అర్ష్‌దీప్ సింగ్(18), ఆవేశ్ ఖాన్(9) ఎవ‌రు కూడా పెద్దగా ఆక‌ట్టుకోక‌పోవ‌డంతో భారత్ 211 పరుగులకు కుప్పకూలింది. అనంత‌రం ల‌క్ష్య చేధ‌న‌కి దిగిన దక్షిణాఫ్రికా 42.3 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. టోనీ డి జార్జి ఆఫ్రికా తరుపున 119* పరుగులు చేసి జ‌ట్టుని గెలిపించాడు.

ఆఫ్రికన్ బ్యాట్స్‌మెన్ ఏకపక్షంగా లక్ష్యాన్ని ఛేదించారు. ఆఫ్రికా తరుపున ఓపెనర్లు చేసిన టోనీ డి జార్జి, రీజా హెండ్రిక్స్ 130 పరుగుల భాగస్వామ్యాన్ని నెల‌కొల్ప‌డంతో సౌత‌ఫ్రికా సునాయాసంగా విజ‌యం సాధించింది. 28వ ఓవర్లో హెండ్రిక్స్ వికెట్ చేజార్చుకున్న‌ప్ప‌టికీ, మూడో స్థానంలో వచ్చిన రాస్సీ వాన్ డెర్ డస్సెన్ 5 ఫోర్ల సహాయంతో 36 పరుగుల ఇన్నింగ్స్ ఆడాడు. టోనీ డి జార్జితో కలిసి రెండో వికెట్‌కు 76 పరుగుల (83 బంతుల్లో) భాగస్వామ్యాన్ని నెలకొల్ప‌డంతో సౌతాఫ్రికాకి మంచి విజ‌యం ద‌క్కింది. మ్యాచ్‌లో భార‌త ఆట‌గాళ్లు మంచి క్యాచ్‌లు చేజార్చ‌డం కూడా భార‌త్ ఓట‌మికి ప్ర‌ధాన కార‌ణాలుగా చెప్ప‌వచ్చు.

Exit mobile version