విధాత : దక్షిణాఫ్రికాతో రాయపూర్ వేదికగా జరుగుతున్న రెండో వన్డేలో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ వరుసగా రెండోసెంచరీ(102)..యువ ఆటగాడు రుతురాజ్ గైక్వాడ్ సెంచరీ(105)లతో అదరగొట్టారు. కెప్టెన్ కేఎల్. రాహుల్ హాఫ్ సెంచరీ(66*)కూడా రాణించడంతో భారత్ 50ఓవర్లలో 5వికెట్ల నష్టానికి 358పరుగులు చేసింది. సఫారీ జట్టుకు 359పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది.
వరుసగా 20వ సారి భారత్ టాస్ ఓడిపోవడంతో దక్షిణాఫ్రికా ఫిల్డింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ కు దిగిన భారత జట్టు ఓపెనర్లు తొలి వికెట్ కు 4.5ఓవర్లలో 40పరుగులు చేశారు. రోహిత్ శర్మ(14) పరుగులకు ఔటవ్వగా..మరో ఓపెనర్ యశస్వీ జైస్వాల్22 (1సిక్స్, 2ఫోర్లు) మరోసారి యన్సెలోనే బౌలింగ్ లోనే ఔటై నిరాశ పరిచాడు. ఈ దశలో సీనియర్ బ్యాటర్ విరాట్ కోహ్లీ మరోసారి తన బ్యాటింగ్ పవర్ రుచిచూపించి వన్డేలలో 53వ సెంచరీ సాధించాడు. ఈ సిరీస్‌లో తొలి వన్డేలోనూ సెంచరీ (135) చేసిన సంగతి తెలిసిందే. ఇదిలా ఉండగా వన్డేల్లో విరాట్ వరుసగా రెండు మ్యాచుల్లోనూ సెంచరీలు చేయడం ఇది 11వ సారి.
ఈ మ్యాచ్ లో విరాట్ 102 (93బంతుల్లో 7ఫోర్లు, 2 సిక్స్ లు), యువ బ్యాటర్ రుతురాజ్ గైక్వాడ్ 105(83బంతుల్లో 12ఫోర్లు, 2 సిక్స్ లు)లతో సెంచరీలు నమోదు చేసి భారత్ భారీ స్కోర్ సాధించేందుకు బాటలు వేశారు. మూడో వికెట్ కు వారిద్దరు 156 బంతుల్లో 195 పరుగులు జోడించారు. మూడో వికెట్ రూపంలో రుతురాజ్ గైక్వాడ్ ఔటయ్యాడు. మార్కో యాన్సెన్ వేసిన 35.4 ఓవర్‌కు టోనీ డి జోర్జికి క్యాచ్ ఇచ్చాడు. కొద్దిసేపటికే సెంచరీ పూర్తి చేసుకున్న కోహ్లీ కూడా పెవిలియన్ చేరాడు. కోహ్లీ మ్యాచ్ 39.1 ఓవర్లో ఎంగిడి బౌలింగ్ లో మార్ క్రమ్ కు క్యాచ్ ఇచ్చాడు. అప్పటికే జట్టు స్కోర్ 284/4వికెట్లకు చేరింది.
అనంతరం వాషింగ్టన్ సుందర్ 8బంతులాడి 1పరుగుకే రనౌటై వరుసగా రెండో వన్డేలోనూ విఫలమయ్యాడు. కెప్టెన్ కేఎల్.రాహుల్ 66 నాటౌట్(43బంతుల్లో 6ఫోర్లు, 2సిక్స్ లు, రవీంద్ర జడేజా 24నాటౌట్(27బంతుల్లో 2ఫోర్లు)తో ఐదో వికెట్ కు 10.5ఓవర్లలో కేవలం 69పరుగులు జోడించారు.
దక్షిణాఫ్రికా బౌలర్లలో యన్సెన్ 2, బర్గర్ 1, ఎంగిడి 1 వికెట్లు పడగొట్టారు.
