Site icon vidhaatha

Ind vs SA|సంజూ శాంస‌న్ తుఫాను సెంచ‌రీ, స్పిన్న‌ర్ల త‌డాఖా.. బెంబెలెత్తిపోయిన సౌతాఫ్రికా

Ind vs SA|న్యూజిలాండ్‌పై భార‌త జ‌ట్టు వైట్ వాష్‌కి గురి కావ‌డంతో భార‌త క్రికెట్ అభిమానులు నిరాశ‌లో ఉన్నారు. ఈ స‌మ‌యంలో కుర్రాళ్లు అద్భుత‌మైన ఆట‌తీరుతో స‌ఫారీల‌పై గెలిచి మ‌ళ్లీ ఉత్సాహం తీసుకు వ‌చ్చారు. నాలుగు టీ20ల సిరీస్‌లో భాగంగా శుక్రవారం జరిగిన తొలి మ్యాచ్‌లో టీమిండియా 61 పరుగుల భారీ తేడాతో ఆతిథ్య సౌతాఫ్రికాను ఓడించింది. ముందుగా బ్యాటింగ్‌లో సంజూ శాంసన్ సత్తా చాటగా.. ఆ త‌ర్వాత బౌలింగ్‌లో వరుణ్ చక్రవ‌ర్తి, ర‌వి బిష్ణోయ్‌ దుమ్మురేపారు. వ‌రుణ్ అయితే ఒకే ఓవర్‌లో డేంజరస్ బ్యాటర్లు డేవిడ్ మిల్లర్, హెన్రీచ్ క్లాసెన్‌లను పెవిలియన్ చేర్చ‌డంతో మ్యాచ్ టీమిండియా చేతుల్లోకి వ‌చ్చింది.

టాస్ ఓడి మొదట బ్యాటింగ్ కు దిగిన టీమిండియా దక్షిణాఫ్రికాకు 203 పరుగులు లక్ష్యాన్ని విధించింది.సంజూ శాంసన్‌(50 బంతుల్లో 7 ఫోర్లు, 10 సిక్స్‌లతో 107) విధ్వంసకర శతకంతో చెలరేగగా.. తిలక్ వర్మ(18 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్‌లతో 33) దూకుడుగా ఆడాడు. దాంతో భార‌త్ భారీ స్కోరు సాధించింది. చివ‌రి బ్యాట్స్‌మెన్స్ పెద్ద‌గా రాణించ‌లేదు కాని లేదంటే స్కోరు ఈజీగా 250 ప‌రుగులు దాటేది. ఇక సౌతాఫ్రికా బౌలర్లలో గెరాల్డ్ కోయిట్జీ(3/37) మూడు వికెట్లు తీయగా.. మార్కో జాన్సెన్, కేశవ్ మహరాజ్, పీటర్, క్రుగర్ తలో వికెట్ తీసారు. టీమిండియా హిట్ట‌ర్స్ కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ 21 పరుగులు చేశాడు. రింకూ సింగ్ 11 పరుగులు చేశాడు.

ఇక భారత బౌలర్ల దాటికి దక్షిణాఫ్రికా పూర్తి 20 ఓవర్లు కూడా ఆడలేకపోయింది. 17.5 ఓవర్లలలోనే 141 పరుగులకు ఆలౌటైంది. హెన్రీచ్ క్లాసెన్(22 బంతుల్లో 2 ఫోర్లు, సిక్స్‌తో 25), ర్యాన్ రికెల్టన్(11 బంతుల్లో3 ఫోర్లు, సిక్స్‌తో 21), గెరాల్డ్ కోయిట్జీ(11 బంతుల్లో 3 సిక్స్‌లతో 23) మాత్ర‌మే కాస్త చెప్పుకోద‌గ్గ స్కోరు చేశారు. భారత బౌలర్లలో వరుణ్ చక్రవర్తీ(3/25), రవి బిష్ణోయ్(3/28) మూడేసి వికెట్లు తీయగా.. ఆవేశ్ ఖాన్‌ రెండు వికెట్లు పడగొట్టాడు. అర్ష్‌దీప్ సింగ్‌కు ఓ వికెట్ దక్కింది. డర్బన్‌లో జ‌రిగిన‌ టీ20లో భారత్‌కు ఇది ఐదో విజయం కాగా, టీ20ల్లో వరుసగా 11వ విజయం. ఈ విజయంతో టీమిండియా సిరీస్‌లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. భారీ టార్గెట్ ను ఛేదించేందుకు బరిలోకి దిగిన సఫారీ బ్యాటర్లు ఆశించిన స్థాయిలో ఆడలేకపోవ‌డంతో ఓట‌మి బాట ప‌ట్టాల్సి వ‌చ్చింది.

Exit mobile version