నిప్పులు చెరుగుతున్న ష‌మీ..న‌యా చరిత్ర సృష్టించిన భార‌త పేస‌ర్

  • Publish Date - November 3, 2023 / 02:18 AM IST

భార‌త పేస్ బౌల‌ర్ త‌న పేస్ బౌలింగ్‌తో నిప్పులు చెరుగుతున్నాయి. హార్ధిక్ పాండ్యా గాయ‌ప‌డ‌డంతో జ‌ట్టులోకి వ‌చ్చిన ష‌మి ప్ర‌తి మ్యాచ్‌లోను అద్భుత‌మైన ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌రుస్తున్నాడు. ఇంగ్లండ్‌తో జరిగిన మ్యాచ్‌లో నాలుగు కీల‌క వికెట్స్ తీసిన ష‌మి తాజాగా శ్రీలంక‌తో జ‌రిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లు తీసి సరికొత్త చరిత్ర సృష్టించాడు. ప్రపంచకప్ చరిత్రలోనే అత్యధిక వికెట్లు తీసిన భారత బౌలర్‌గా స‌రికొత్త రికార్డ్ నెల‌కొల్పాడు. శ్రీలంకతో గురువారం జరిగిన మ్యాచ్‌లో ఐదు వికెట్లతో సత్తా చాటిన మహమ్మద్ షమీ(5/18) వన్డే ప్రపంచకప్ చరిత్రలో ఇప్పటి వరకు 45 వికెట్లు తీసాడు.

ష‌మీ త‌ర్వాత జహీర్ ఖాన్ 23 మ్యాచ్‌ల్లో 44 వికెట్లతో త‌ర్వాతి స్థానంలో ఉండగా ఆయ‌న త‌ర్వాత జవగళ్ శ్రీనాథ్(34 మ్యాచ్‌ల్లో 44 వికెట్లు), జస్‌ప్రీత్ బుమ్రా(16 మ్యాచ్‌ల్లో 33), అనిల్ కుంబ్లే(18 మ్యాచ్‌ల్లో 31), కపిల్ దేవ్(26 మ్యాచ్‌ల్లో 28) ఉన్నారు. వ‌న్డే ప్ర‌పంచ‌కప్ 2023లో కేవ‌లం మూడు మ్యాచ్‌లే ఆడిన ష‌మీ ఏకంగా 14 వికెట్స్ తీసుకున్నాడు. ఆడిన మూడు మ్యాచ్‌ల‌లో రెండు సార్లు ఐదు వికెట్లు, ఒక‌సారి నాలుగు వికెట్స్ తీసుకోవ‌డం విశేషం. అయితే మొత్తం మీద ష‌మీ త‌న కెరీర్‌లో ఇప్పటి వరకు 3 సార్లు ఐదు వికెట్ల ఫీట్ సాధించాడు. మహమ్మద్ షమీ(5/18), మహమ్మద్ సిరాజ్(3/18) సంచలన ప్రదర్శనతో గురువారం జ‌రిగిన మ్యాచ్‌లో శ్రీలంక 55 పరుగులకే కుప్పకూలింది.దీంతో భార‌త్ ఏకంగా 302 పరుగుల భారీ తేడాతో ఘ‌న విజ‌యం సాధించింది.

ప్రపంచకప్ చరిత్రలోనే టీమిండియా‌‌కు ఇది అతిపెద్ద విజయం కాగా, ఈ గెలుపుతో పాయింట్స్ టేబుల్‌లో అగ్రస్థానాన్ని కైవసం చేసుకుంది. అంతేకాదు మ‌రో రెండు మ్యాచ్‌లు మిగిలి ఉండగానే అధికారికంగా సెమీస్ బెర్త్‌ను దక్కించుకుంది భార‌త జ‌ట్టు. ఈ మ్యాచ్‌లో భార‌త్ తొలుత బ్యాటింగ్ చేసి నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లకు 358 పరుగులు చేసింది. శుభ్‌మన్ గిల్(92 బంతుల్లో 11 ఫోర్లు, 2 సిక్స్‌లతో 92), విరాట్ కోహ్లీ(94 బంతుల్లో 11 ఫోర్లతో 88), శ్రేయస్ అయ్యర్(56 బంతుల్లో 3 ఫోర్లు, 6 సిక్స్‌లతో 82) విధ్వంసకర బ్యాటింగ్‌తో భార‌త్ భారీ స్కోర్ సాధించింది. శ్రీలంక బౌలర్లలో మధుషంక(5/82) ఐదు వికెట్లతో సత్తా చాటాడు.ఇక శ్రీలంక 19.4 ఓవర్లలో 55 పరుగులకు కుప్పకూలింది. శ్రీలంక బౌలర్లలో కాసున్ రజితా(14), మహీష్ తీక్షణ(12 నాటౌట్), ఏంజేలో మాథ్యూస్(12) మాత్ర‌మే టాప్ స్కోరర్లుగా నిల‌వగా. ఐదుగురు బ్యాటర్లు డకౌటయ్యారు. భార‌త్ త‌న త‌దుప‌రి మ్యాచ్ సౌతాఫ్రికాతో ఆడ‌నుంది.

Latest News