- బీజేపీ ఏ ఎన్నికనూ తేలిగ్గా తీసుకోదు
- ఇదే ఆఖరి యుద్ధం అన్నట్టు పోరాడుతుంది
- 3 రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు ఓట్ల శాతం తగ్గలేదు
- బీజేపీ మితిమీరిన జాతీయవాదం డేంజర్
- గాలి ఇప్పుడు బీజేపీవైపు ఉన్నది.. కానీ.. గాలులు దిశ మార్చుకోవచ్చు
- 400-425 స్థానాల్లో ఉమ్మడి అభ్యర్థులు
- అప్పుడే బీజేపీ ఓడించగలం
- కాంగ్రెస్ రాజ్యసభ సభ్యుడు పీ చిదంబరం
న్యూఢిల్లీ : ప్రతిపక్ష ఇండియా కూటమి తక్షణ కర్తవ్యం రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో విజయం సాధించడమేనని మాజీ కేంద్రమంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత పీ చిదంబరం అన్నారు. రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికల్లో పార్టీ పరాజయం ఊహించనిదని చెప్పారు. ఇది ఆందోళన కలిగించే అంశమేనని అన్నారు. ఒక వార్తా సంస్థకు చిదంబరం ఆదివారం ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. అందులో దేశ రాజకీయ పరిస్థితులు, ఎన్నికలకు ఇండియా కూటమి సంసిద్ధత, బీజేపీ విజయాలు సాధించడం వెనుక కారణాలపై తన అభిప్రాయాలను వెల్లడించారు.
ఓడినా చెదరని ఓటు శాతం
2024 లోక్‌సభ ఎన్నికలకు ముందు ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్, మధ్యప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించడం ఆ పార్టీకి కలిసొచ్చే విషయమన్నారు. ఈ రాష్ట్రాల్లో లోపాలు ఎక్కడ జరిగాయో కాంగ్రెస్ అధిష్ఠానం గుర్తించి, తగిన చర్యలు తీసుకుంటుందని తెలిపారు. అయితే.. ఎన్నికలు జరిగిన నాలుగు పెద్ద రాష్ట్రాల్లో కాంగ్రెస్ 40 శాతం ఓటు షేరు భద్రంగా ఉన్నదని పేర్కొన్నారు. తుదిఘట్టంలో ప్రచారం, బూత్ మేనేజ్‌మెంట్, ఓటింగ్ రోజు ఇళ్లలోనే ఉండిపోయే ఓటర్లను పోలింగ్ కేంద్రాలకు తెప్పించుకోవడం తదితర అంశాలను సరిదిద్దుకోవడం ద్వారా లోక్‌సభ ఎన్నికల్లో తమ ఓటు షేర్‌ను 45 శాతానికి పెంచుకునే అవకాశం ఉన్నదని ఆశాభావం వ్యక్తం చేశారు.
మితిమీరిన జాతీయవాదం ప్రమాదకరం
‘బీజేపీ మొన్నటిదాకా సంక్షేమ పథకాలను వ్యతిరేకించింది. ఇప్పుడు ఆ వ్యతిరేకతను వదులుకున్నది. దానికంటే అత్యంత ఆందోళన కలిగించే అంశాలు ముస్లిం, క్రైస్తవ వ్యతిరేక ప్రచారం, విభజనవాదం, మితిమీరిన జాతీయవాదం అనేవి ఆందోళన కల్గిస్తున్నాయి. ఇవి అత్యంత శక్తిమంతమైనవి. ఉత్తర, మధ్య భారతదేశ రాష్ట్రాలు వీటికి సులభంగా ఆకర్షితులవుతాయి. దీనిని ఎలా ఎదుర్కొనాలనే అంశంలో కాంగ్రెస్ పార్టీ తగిన విధంగా స్పందించాలి’ అని ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు కూడా అయిన చిదంబరం చెప్పారు. 2024 ఎన్నికలకు కుల గణనతోపాటు నిరుద్యోగం, ద్రవ్యోల్బణం కూడా తమ ప్రధాన అజెండాలని తెలిపారు. ప్రత్యేకించి నిరుద్యోగం, ద్రవ్యోల్బణం అనేవి ప్రజలను నేరుగా ప్రభావితం చేస్తున్నాయన్నారు. నోట్ల రద్దు అనేది పాత విషయమని, ఆ గాయాలు కూడా మసకబారాయిని చిదంబరం చెప్పారు. అయితే.. పెద్ద నోట్లు రద్దు చేసిన తర్వాత కూడా పెద్ద మొత్తంలో నల్లధనం పట్టుబడుతున్న అంశంలో డీమానిటైజేషన్ గురించి మాట్లాడుతామని తెలిపారు. ఇటీవలి అసెంబ్లీ ఎన్నికల్లోనే దాదాపు 1760 కోట్ల నల్లధనం దొరికిన విషయాన్ని ఆయన ప్రస్తావించారు.
గాలి బీజేపీ వైపు ఉన్నా..
రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ మరోసారి సాధిస్తుందని సర్వేలు పేర్కొనడాన్ని ప్రస్తావించగా.. ‘గాలి బీజేపీ వైపు ఉన్నది. కానీ.. గాలులు తమ దిశను మార్చకోగలవు. బీజేపీ ఏ ఎన్నికనూ తేలిగ్గా తీసుకోదు. ఇదే ఆఖరి యుద్ధం అన్నట్టు పోరాడుతుంది. కాషాయ పార్టీ పోరాట నైపుణ్యాల గురించి ప్రతిపక్ష పార్టీలు అర్థం చేసుకోవాలి’ అని చిదంబరం చెప్పారు. లోక్‌సభ ఎన్నికలకు ఇండియా కూటమి సంసిద్ధత గురించి మాట్లాడుతూ.. కనీసం 400-425 స్థానాల్లో బీజేపీని ఓడించగల ఉమ్మడి అభ్యర్థులను కూటమి నేతలు ఎంపిక చేయాలని అన్నారు. ఇండియా కూటమి నాయకులు సమావేశమైనప్పుడు ఏం చర్చిస్తారో తనకు తెలియదని, కానీ ఎన్నికలకు ఇంకా మూడు నెలలే వ్యవధి ఉన్నదనే విషయాన్ని గుర్తించాలని చెప్పారు. ఇండియా కూటమి ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరు అన్న ప్రశ్నకు.. ప్రభుత్వానికి ఎవరు సారథ్యం వహించాలన్న అంశాన్ని ఎన్నికల తర్వాత నిర్ణయించుకోవచ్చని తెలిపారు. ప్రజల స్పందన ఎవరి పట్ల ఉంటుందనేది ప్రధాని అభ్యర్థిని ఎంపిక చేయడంలో కీలకంగా ఉంటుందన్నారు. కానీ.. తక్షణ కర్తవ్యం మాత్రం రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడమేనని చెప్పారు.