Site icon vidhaatha

Former Minister Malla Reddy: రాష్ట్రంలో ఆ రెండు కుటుంబాలదే హవా!: మాజీ మంత్రి మల్లారెడ్డి

Former Minister Malla Reddy: మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి తరచు తన మాటలు..చేతలతో అందరినీ నవ్విస్తుంటారు. అదే తరహాలో మరోసారి మంగళవారం అసెంబ్లీ లాబీల్లో తన వ్యవహార శైలితో నవ్వులు పూయించారు. అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి తనకు ఎదురుపడిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామిని ఉద్దేశించి నమస్తే మంత్రిగారు అంటూ పలకరించారు. అందుకు థాంక్స్ మల్లన్నా.. అంటూ వివేక్ వెంకటస్వామి బదులిచ్చారు. ఈ సందర్భంగా మల్లారెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కోమటి రెడ్డి వెంకట రెడ్డి ఫ్యామిలీ, వివేక్ వెంకటస్వామి ఫ్యామిలీదే హవా నడుస్తుందంటూ కామెంట్ చేశారు. స్పందించిన వివేక్ బీఆర్ఎస్ హయంలో కేసీఆర్ , మల్లారెడ్డిదే హవా నడిచిందంటూ కౌంటర్ వేశారు. మేము అధికారం కోల్పోయినం మాదేం లేదన్నా.. అని మల్లారెడ్డి అనడంతో అక్కడున్న వారంతా నవ్వుల్లో మునిగారు.

అంతకుముందు అసెంబ్లీ లాబీలో మల్లారెడ్డి చిట్ చాట్ లో మాట్లాడుతూ ఒకప్పుడు పార్లమెంట్ లో వాజపేయి లాంటి వారు మాట్లాడుతుంటే దేశ ప్రజలు ఆసక్తిగా ఎదురుచూసేవారన్నారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి లాంటి నాయకులు సభలో మాట్లాడుతుంటే ప్రజలు టీవీలకు అతుక్కు పోయేవారన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత అసెంబ్లీలో కేసీఆర్ ఏం మాట్లాడతారని ఆసక్తి ఉండేదని..ఇప్పుడు అసెంబ్లీలో బట్టలు విప్పుడు, కత్తులు దూసుడే కనిపిస్తున్నదంటూ పరోక్షంగా ప్రభుత్వంపై తనదైన శైలిలో వ్యంగ్య విమర్శలు చేశారు.

ఇదే రోజు మల్లారెడ్డి డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కను కలిశారు. ఘట్ కేసర్ ఫ్లైవోవర్ పనులు 14ఏళ్లుగా పెండింగ్ లో ఉన్నాయని, నిధులు మంజూరు చేయాలని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కకు మల్లారెడ్డి వినతి పత్రం అందించారు. స్పందించిన భట్టి విక్రమార్క రూ.50లక్షలు మంజూరు చేస్తున్నట్లుగా ప్రకటించారు.

Exit mobile version