Traffic Restrictions | భాగ్యనగరంలో గణేశ్ నిమజ్జన కార్యక్రమానికి సర్వం సిద్ధమైంది. విఘ్నేశ్వరుడి శోభాయాత్రలకు విఘ్నాలు తలెత్తకుండా ట్రాఫిక్ పోలీసులు చర్యలు చేపట్టింది. నగరంలో శోభాయాత్రలు సాగే దారుల్లో సాధారణ వాహనాల రాకపోకలపై ఆంక్షలు విధించారు. జిల్లాల నుంచి హైదరాబాద్‌లోకి వచ్చే ఆర్టీసీ బస్సులు, ఇతర వాహనాలపై కూడా ఆంక్షలు విధించారు. ఈ ఆంక్షలు గురువారం ఉదయం 6 నుంచి శుక్రవారం ఉదయం 10 గంటల వరకు అమల్లో ఉంటాయని పోలీసులు తెలిపారు.
ట్రాఫిక్ ఆంక్షలు ఇలా..
- బాలాపూర్ నుంచి ఎన్టీఆర్ మార్గ్ వరకు సాగే ప్రధాన శోభాయాత్రతో పాటు, ఊరేగింపు జరిగే దారుల్లో ఎలాంటి వాహనాలకు అనుమతి లేదు.
- ఇతర రాష్ట్రాలు, జిల్లాల నుంచి వచ్చే లారీలకు శనివారం రాత్రి వరకు అనుమతి లేదు.
- హైదరాబాద్ ఓల్డ్ సిటీలో కేశవగిరి, మహబూబ్‌నగర్ చౌరస్తా, ఇంజిన్ బౌలి, నాగుల్ చింత, హిమ్మత్‌పురా, హరిబౌలి, అస్రా హాస్పిటల్, మొఘల్ పురా, మదీనా చౌరస్తా, ఎంజే బ్రిడ్జి, దారుల్ షిఫా చౌరస్తా, సిటీ కాలేజీ వద్ద వాహనాల మళ్లింపు ఉంటుంది.
- చంచల్ గూడ జైలు చౌరస్తా, ముసారాంబాగ్, చాదర్ ఘాట్ బ్రిడ్జి, సాలార్జంగ్ బ్రిడ్జి, అఫ్జల్ గంజ్, పుత్లీబౌలి చౌరస్తా, ట్రూప్ బజార్, జామ్ బాగ్ క్రాస్ రోడ్స్, కోఠి ఆంధ్రా బ్యాంక్ వద్ద వాహనాలను మళ్లించనున్నారు.
- మెహిదీపట్నం వైపు నుంచి వచ్చే బస్సులను మాసాబ్ ట్యాంక్ వద్ద, కూకట్పల్లి బస్సులను ఖైరతాబాద్ చౌరస్తా వద్ద, సికింద్రాబాద్ బస్సులను సీటీవో, ప్లాజా, ఎస్బీహెచ్, క్లాక్ టవర్, చిలకలగూడ చౌరస్తా, ఉప్పల్ బస్సులను రామంతాపూర్ టీవీ స్టూడియో, దిల్సుఖ్ నగర్ బస్సులు గడ్డి అన్నారం వద్ద నిలిపివేయనున్నారు.
- జిల్లాల నుంచి ఎంజీబీఎస్‌కు వచ్చే ఆర్టీసీ బస్సులను కూడా దారి మళ్లించనున్నారు. కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ నుంచి వచ్చే బస్సులను జేబీఎస్, వైఎంసీఏ, సంగీత్ చౌరస్తా, తార్నాక, జామై ఉస్మానియా, విద్యానగర్, నింబోలి అడ్డా, చాదర్‌ఘాట్ మీదుగా ఎంజీబీఎస్ మళ్లించనున్నారు. బెంగళూరు హైవే నుంచి వచ్చే వాహనాలను ఆరాంఘర్ చౌరస్తా, చంద్రాయణగుట్ట చౌరస్తా, ఐఎస్ సదన్, నల్లగొండ క్రాస్ రోడ్స్, చాదర్‌ఘాట్ మీదుగా మళ్లించనున్నారు. ముంబై జాతీయ రహదారి వైపు నుంచి వచ్చే వాహనాలను గోద్రెజ్ కూడలి, నర్సాపూర్ చౌరస్తా, బోయిన్పల్లి, జేబీఎస్, తార్నాక, అడిక్‌మెట్, నింబోలి అడ్డాగా మీదుగా మళ్లించనున్నారు.