విధాత, హైదరాబాద్ : హైదరాబాద్ లో గణేష్ నిమజనోత్సవ శోభాయాత్ర సంబరంగా సాగుతుంది. వివిధ ప్రాంతాల నుంచి నవరాత్రి పూజలందుకున్న గణనాథులు గంగమ్మ ఒడి చేరేందుకు నిమజ్జనం కోసం ట్యాంక్ బండ్ వద్దకు చేరుకుంటున్నారు. గణనాథు రాకతో ట్యాంక్ బండ్(Tankbund) పరిసర ప్రాంతాలు కోలహలంగా మారాయి. నిమజ్జనోత్సం తిలకించేందుకు భక్తులు భారీ సంఖ్యలో ట్యాంక్ బండ్ కు తరలివచ్చారు. ఎన్టీఆర్ మార్గ్ లోని బాహుబలి క్రేన్ నెంబర్ 4 వద్దకు ఖైరతాబాద్ బడా గణేష్(Khairatabad Bada Ganesh) శోభాయాత్ర చేరుకుంది. హుస్సెన్ సాగర్ లో ప్రత్యేక పూజల అనంతరం బడా గణేష్ విగ్రహం నిమజ్జనోత్సవం చేశారు. 69 అడుగుల ఎత్తుతో విశ్వశాంతి మహాశక్తి గణపతి రూపంలో ఖైరతాబాద్(Khairatabad) గణనాథుడు ఈ ఏడాది 11రోజుల పాటు భక్తులకు దర్శనం ఇచ్చి గంగమ్మ ఒడికి చేరుకున్నాడు. వెళ్లారావయ్య గణపయ్య అంటూ భక్తులు ఘనంగా బడా గణేషుడికి వీడ్కోలు పలికారు.
వివిధ ప్రాంతాల నుంచి వినాయకుడి శోభాయాత్రలు శోభాయమానంగా సాగుతూ ట్యాంక్ బండ్ కు చేరుకుంటున్నాయి. భక్తలు భజనలు, కోలాటాలు, గణపతి బొప్పా మోరియా(Ganapati Bappa Morya) నినాదాలతో హైదరాబాద్ రోడ్లు, ట్యాంకు బండ్ పరిసరాలు మారుమ్రోగాయి. ఈ రోజు రాత్రి పొద్దుపోయే వరకు కూడా వినాయక విగ్రహాల నిమజ్జనం కొనసాగనుంది. పోలీసులు నిమజ్జనోత్సవం సందర్భంగా భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. భక్తులకు అవసరమైన ఏర్పాట్లును అధికార యంత్రాంగం పర్యవేక్షిస్తుంది.