Site icon vidhaatha

నిరుపేదలకు శుభవార్త.. సొంత జాగా ఉంటే రూ.3లక్షలు

TS Budget 2023-24 | తెలంగాణ ప్రభుత్వం నిరుపేదలకు శుభవార్త చెప్పింది. సొంత స్థలం ఉన్న వారికి ఇంటి నిర్మాణం కోసం రూ.3లక్షల ఆర్థిక సాయం చేయనున్నట్లు శాసనసభలో ఆర్థికశాఖ మంత్రి హరీశ్‌రావు బడ్జెట్‌ ప్రసంగంలో తెలిపారు. నియోజకవర్గంలో 2వేల మందికి రూ.3లక్షల చొప్పున ఆర్థిక సాయం అందించనున్నట్లు ప్రకటించారు. పథకం ద్వారా 2.63లక్షల మందికి ఆర్థిక సాయం అందించేందుకు ప్రభుత్వం బడ్జెట్‌లో రూ.7,890 కోట్లు కేటాయించిందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు.

ముఖ్యమంత్రి కోటాలో మరో 25వేల మందికి ఆర్థికసాయం అందించనున్నట్లు తెలిపారు. దాంతో పాటు బడ్జెట్‌లో డబుల్‌ బెడ్‌రూం ఇండ్ల నిర్మాణానికి రూ.12వేల కోట్లు కేటాయించారు. జీహెచ్‌ఎంసీ పరిధిలో 67,782 డబుల్ బెడ్రూం ఇండ్ల నిర్మాణాలు పూర్తయ్యాయని, 32,218 నిర్మాణం వివిధ దశల్లో ఉన్నాయన్నారు. ఇదిలా ఉండగా.. ఇటీవల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌ సైతం సొంత స్థలం ఉన్న వారికి ఇండ్ల నిర్మాణానికి రూ.3లక్షలు ఇవ్వనున్నట్లు ఇటీవల మహబూబ్‌నగర్‌ బహిరంగ సభలో ప్రకటించిన విషయం తెలిసిందే. పథకాన్ని 15 రోజుల్లో ప్రారంభిస్తామన్నారు. ఈ మేరకు ప్రభుత్వం బడ్జెట్‌లో నిధులు కేటాయించింది.

Exit mobile version