Site icon vidhaatha

TSPSC | టీఎస్‌పీఎస్సీ ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో కీలక పరిణామం.. రంగంలోకి ఈడీ

TSPSC | తెలంగాణ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ లీకేజీ కేసులో కీలక పరిణామం చోటు చేసుకున్నది. ప్రశ్నపత్రాల లీకేజీ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ రంగంలోకి దిగింది. ఈ కేసులో ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డి వాంగ్మూలాలను తీసుకోవాలని నిర్ణయించింది.

వాంగ్మూలాలను నమోదు చేసేందుకు అనుమతి కోరుతూ మంగళవారం నాంపల్లి కోర్టులో పిటిషన్‌ దాఖలు చేసింది. అయితే, ప్రశ్నపత్రాల లీక్‌ కోసం భారీగా నగదు చేతులు మారినట్టు ఈడీ అనుమానిస్తుంది. పెద్ద ఎత్తున మనీలాండరింగ్‌ జరిగినట్లు అనుమానిస్తున్న ఈడీ భావిస్తున్నది.

సిట్‌ అధికారులు సాక్షిగా పేర్కొన్న శంకరలక్ష్మిపై ఈడీ ప్రధాన దృష్టి కేంద్రీకరించినట్లు సమాచారం. కాన్ఫిడెన్షియల్‌ సెక్షన్‌ ఆఫీసర్‌ అయిన శంకరలక్ష్మి కంప్యూటర్‌ నుంచే ప్రశ్నపత్రం లీక్‌ అయినట్లు గుర్తించిన విషయం తెలిసిందే.

ఈ క్రమంలో శంకరలక్ష్మితో పాటు కమిషన్‌కు చెందిన సత్యనారాయణకు అధికారులు నోటీసులు జారీ చేశారు. బుధ, గురువారాల్లో విచారణకు రావాలని నోటీసుల్లో ఆదేశించారు. అదే సమయంలో ప్రవీణ్‌, రాజశేఖర్‌రెడ్డిలను కస్టడీలోకి తీసుకొని ఈడీ అధికారులు విచారించనున్నారు. ప్రస్తుతం వీరిద్దరు చంచల్‌గూడ జైలులో జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్నారు.

ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంలో ఇప్పటి వరకు సిట్‌ 17 మంది నిందితులను అరెస్టు చేసింది. గ్రూప్‌-1 పరీక్షలో 100కు పైగా మార్కులు సాధించిన 121 మందితో పాటు జగిత్యాల జిల్లా మల్యాలలో గ్రూప్‌-1 మెయిన్స్‌కు అర్హత సాధించిన మరో 40 మంది సైతం విచారించింది.

అలాగే టీఎస్‌పీఎస్సీ చైర్మన్‌ జనార్దన్‌రెడ్డి సహా పలువురు కీలక వ్యక్తుల వాంగ్మూలలను సైతం నమోదు చేసింది. గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పేపర్‌ను ముందుగానే అందుకుని, విదేశాల నుంచి వచ్చి పరీక్షలు రాసిన వారు ఉండడంతో మనీలాండరింగ్‌ కోణం నేపథ్యంలో ఈడీ రంగంలోకి దిగింది.

ప్రశ్నపత్రాల లీకేజీలో టీఎస్‌పీఎస్సీ సెక్రెటరీ అనితారామచంద్రన్‌ ఫిర్యాదు మేరకు బేగంబజార్‌ పోలీసులు మార్చి 11న కేసు నమోదు చేశారు. కేసు తీవ్రత నేపథ్యంలో ప్రభుత్వం సీపీ సీవీ ఆనంద్‌ దర్యాప్తునకు సిట్‌ను ఏర్పాటు చేసింది. జాయింట్‌ సీపీ ఏఆర్‌ శ్రీనివాస్‌ నేతృత్వంలో సిట్‌ దర్యాప్తును చేపట్టింది.

సిట్‌ 17 మందిని అరెస్టు చేయడంతో పాటు వందలాది మందిని ప్రశ్నించింది. ప్రధాన నిందితులైన ప్రవీణ్‌, రాజశేఖర్‌ను కస్టడీకి తీసుకున్న సమయంలో పూర్తిస్థాయిలో విచారించడంతోపాటు సీన్‌ రీ-కన్‌స్ట్రక్షన్‌ చేపట్టింది.

ఈ కేసుకు సంబంధించి సిట్‌ నిర్వహించిన దర్యాప్తు, సేకరించిన వివరాలు, వాంగ్మూలాలు, ఫోరెన్సిక్‌ నివేదికలను సైతం ఈడీ అధికారులు సిట్‌ నుంచి తీసుకోనున్నారు. సిట్‌ ఇచ్చే సమాచారాన్ని పూర్తిస్థాయిలో పరిశీలించడం, ప్రవీణ్‌, రాజశేఖర్‌ స్టేట్‌మెంట్‌, విచారణలో శంకర్‌లక్ష్మి, సత్యనారాయణ ఇచ్చే సమాచారం మేరకు ఈ కేసులో అవసరమైన వారందరికి ఈడీ నోటీసులు జారీ చేసి విచారించే అవకాశం ఉంది.

Exit mobile version