ఫ్యామిలీ చిత్రాల హీరో ఇప్పటికీ డిఫరెంట్ జానర్‌లో సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తున్నారు. ఆయన నటించిన తాజా చిత్రం సైంధవ్. ఈ సినిమా వెంకీది 75వ మూవీ కాగా ఈ ల్యాండ్ మార్క్ చిత్రం మంచి విజయం సాధిస్తుందని ప్రతి ఒక్కరు భావిస్తున్నారు. వెంకీ మామ 75 సినిమాలు కంప్లీట్ చేసుకున్న తరుణంలో సైంధవ్ చిత్ర నిర్మాణ సంస్థ నిహారిక ఎంటర్టైన్మెంట్స్ గ్రాండ్ ఈవెంట్ ని నిర్వహించింది. ఈ ఈవెంట్ కి చిరంజీవి, రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా వచ్చారు. అలాగే నాని, శ్రీవిష్ణు, అడివిశేష్, బ్రహ్మానందం, అలీ.. ఇలా పలువురు సినీ ప్రముఖులతో పాటు చిత్ర యూనిట్ ఈవెంట్‌లో సందడి చేశారు.
ఈవెంట్‌లో వెంకటేష్ చేసిన కామెంట్స్ చర్చనీయాంశంగా మారాయి. మా గురువు రాఘవేంద్రరావు దర్శకత్వంలో వచ్చిన కలియుగ పాండవులు సినిమాతో నా ప్రయాణం మొదలైంది. దాసరి, విశ్వనాథ్ గారి లాంటి అగ్ర దర్శకులతో పనిచేసే అదృష్టం నాకు దక్కింది. అభిమానులు ఇచ్చిన ప్రేమతోనే ఇన్ని సినిమాలు చేశాను. జయాపజయాలు చూడకుండా నా సినిమాలని ఆదరించారు. విక్టరీ, రాజా, పెళ్లి కానీ ప్రసాద్, పెద్దోడు, వెంకీమామ.. ఇలా ఎన్నో పేర్లతో నన్ను పిలుచుకున్నారు. పిలుపులు మారిన కూడా మీ ప్రేమ మారలేదు. మీరు ఇచ్చిన ప్రేమ వల్లనే ఇప్పటికీ కూడా ఎంతో ఉత్సాహంగా సినిమాలు చేస్తున్నాను. ఓసారి నాకు సినిమాలు వదిలేసి హిమాలయాలకు వెళ్లిపోదామనుకున్నాను. చిరంజీవి గారు లేకుంటే సినిమా మానేసి నేను హిమాలయాలకు వెళ్లి ఉండేవాడిని.
హిమాలయాలకి వెళ్ళిపోదాం అనుకున్నప్పుడు 9 సంవత్సరాల విరామం తీసుకొని తిరిగి వచ్చి ఖైదీ నంబర్ 150తో బ్లాక్‌బస్టర్‌ను అందించారు. అప్పుడు నేను కూడా ఈ నటన కొనసాగాలని తెలుసుకున్నాను. నా తోటి హీరోలు చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున పాజిటివ్ ఎనర్జీ ఇచ్చేవాళ్ళు. అందుకే హిమాలయాలకు వెళ్లకుండా సినిమాలు చేసుకుంటూ వస్తున్నాను అని అన్నారు. చాలా రోజుల తర్వాత వెంకీమామ యాక్షన్ మూవీ చేస్తుండటంతో అంచనాలు భారీగా ఉన్నాయి.హిట్ 1,హిట్ 2 వంటి థ్రిలర్ మూవీస్ కు దర్శకత్వం వహించిన శైలేశ్ కొలను సినిమా కావడంతో ఈ సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇక చిరంజీవితో కలిసి త్వరలోనే సినిమా చేస్తాను అంటూ వెంకటేష్ అభిమానులకి ఆనందాన్ని ఇచ్చే విషయం తెలియజేశారు.