న్యూఢిల్లీ : ప్రధాని నరేంద్ర మోదీని గద్దె దించేందుకు.. బీజేపీ వ్యతిరేక పార్టీలన్నీ కలిసి ఇండియా కూటమిగా ఏర్పడిన సంగతి తెలిసిందే. 2014, 2019 ఎన్నికల్లో బీజేపీ తరపున నరేంద్ర మోదీ వారణాసి నుంచి పోటీ చేసి గెలుపొందారు. ఈ రెండు ఎన్నికల్లో వారణాసి నియోజకవర్గం నుంచి కాంగ్రెస్ పార్టీ నాయకుడు అజయ్ రాయ్ పోటీ చేసి మోదీ చేతిలో ఓడిపోయారు. ఈ ఎన్నికల్లోనూ మోదీపై అజయ్ రాయ్ పోటీ చేయబోతున్నట్లు కాంగ్రెస్ పార్టీ విడుదల చేసిన నాలుగో జాబితాలో వెల్లడైంది. మొత్తం 45 మందితో నాలుగో జాబితాను కాంగ్రెస్ పార్టీ విడుదల చేసింది.
ఎవరీ అజయ్ రాయ్..?
అజయ్ రాయ్ తన రాజకీయ జీవితాన్ని ఆర్ఎస్ఎస్‌తో ప్రారంభించారు. ఏబీవీపీలో కూడా పని చేశారు. ఉత్తరప్రదేశ్‌లోని కోశాల నియోజకవర్గం నుంచి 1996 నుంచి 2007 మధ్య కాలంలో మూడు సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఈ మూడు సార్లు గెలిచింది కూడా బీజేపీ టికెట్‌పైనే. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో లోక్‌సభ టికెట్ బీజేపీ నిరాకరించడంతో సమాజ్‌వాదీ పార్టీలో చేరారు. 2012లో కాంగ్రెస్ పార్టీలో చేరారు. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పిండ్రా నియోజకవర్గం నుంచి అసెంబ్లీకి ఎన్నికయ్యారు. 2017 ఎన్నికల్లో ఓటమి చవిచూశారు. ఇక 2014, 2019 లోక్‌సభ ఎన్నికల్లో మోదీపై పోటికి దిగారు. ఈ రెండుసార్లు కూడా వారణాసి నుంచి పోటీ చేసి ఓడిపోయారు అజయ్. 2023లో యూపీ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా అజయ్ రాయ్ నియామకం అయ్యారు. వారణాసి నుంచి మూడోసారైనా మోదీపై గెలుస్తారా..? లేదా..? అన్నది వేచి చూడాల్సిందే.