- రాజస్థాన్, ఎంపీ, ఛత్తీస్‌గఢ్ ఫలితాలు అందుకు సహకరిస్తాయా?
- బీజేపీకి 4,81,33,463 ఓట్లు
- కాంగ్రెస్‌కు 4,90,77,907 ఓట్లు
- ‘ప్రభుత్వ వ్యతిరేకత ప్రమాదం’ బీజేపీకి లేదా?
న్యూఢిల్లీ : మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ విజయాల తర్వాత ఇక ఆ పార్టీని ఆపేవాళ్లు ఎవరూ లేరని, కేంద్రంలో హాట్రిక్ ఖాయమని అభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. బీజేపీ శ్రేణులు రాబోయే లోక్‌సభ ఎన్నికల్లో ఇప్పుడే గెలిచినంత హంగామా చేస్తున్నాయి. ఇటువంటి వ్యవహారాలతో మైండ్ గేమ్ ఆడటం బీజేపీకి అలవాటే. ఈ సంగతి పక్కనపెడితే.. నిజంగానే మోదీ ప్రభుత్వం హ్యాట్రిక్ సాధిస్తుందా? ఇందులో నిజమెంత? ఒక చిన్న గీత పక్కన ఇంకాస్త చిన్నగీత గీస్తే.. మొదటి గీతే పెద్దదిగా కనిపిస్తుంది. ప్రత్యర్థులు డీలాపడిపోతారు. ప్రశాంతంగా ఆలోచిస్తే.. ఇందులోని కిటుకు బయటపడిపోతుంది.
గణాంకాలు చెబుతున్నదేంటి?
డిసెంబర్ 3వ తేదీన విడుదలైన నాలుగు రాష్ట్రాల అసెంబ్లీ ఫలితాలను విశ్లేషిస్తే.. బీజేపీకి మొత్తం 4,81,33,463 ఓట్లు వచ్చాయి. మూడు రాష్ట్రాల్లో ఓడిపోయినా.. కాంగ్రెస్‌కు 4,90,77,907 ఓట్లు లభించడం గమనార్హం. అంటే మొత్తంగా కాంగ్రెస్‌కు బీజేపీకంటే అదనంగా 9.5 లక్షల ఓట్లు పెరగడం ఆషామాషీ పరిణామం కాదని విశ్లేషకులు అంటున్నారు. హిందీ మాట్లాడే మూడు రాష్ట్రాల ఫలితాలను గమనిస్తే.. బీజేపీ సీట్లు గెలిచినా.. కాంగ్రెస్ మాత్రం ఓట్లు గెలిచింది. రాజస్థాన్‌లో బీజేపీకి 41.7% ఓట్లు లభించాయి. కాంగ్రెస్‌కు 39.6% వచ్చాయి. అంటే తేడా 2 శాతమే. ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి 46.3 శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్‌కు 42.2 శాతం లభించాయి. ఇక్కడ తేడా 4.1 శాతంగా ఉన్నది. మధ్యప్రదేశ్‌లో మాత్రమే కాస్తంత అధికంగా.. అంటే 8 శాతం తేడా ఉన్నది. ఇక్కడ బీజేపీకి 48.6 శాతం ఓట్లు వస్తే.. కాంగ్రెస్‌కు 40శాతం వచ్చాయి. మూడు రాష్ట్రాల్లో ఓడిపోయినప్పటికీ.. కాంగ్రెస్‌కు 40 శాతానికిపైగా ఓటింగ్ లభించడం గమనార్హం. వీటి ప్రకారం చూస్తే లోక్‌సభ ఎన్నికల నాటికి కాంగ్రెస్ పుంజుకోవడం మరీ అంత కష్టమేమీ కాదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. తెలంగాణను గమనిస్తే.. ఇక్కడ కాంగ్రెస్‌కు 39.4 శాతం ఓట్లు వస్తే.. బీజేపీకి 13.9 శాతం వచ్చాయి. ఓట్లపరంగా.. కాంగ్రెస్‌కు 92 లక్షల ఓట్లు, బీజేపీకి 32 లక్షల ఓట్లు లభించాయి. 2018 ఎన్నికల తర్వాత ఒక దశలో ఎన్నికల రేసులో ఊసే లేకుండా పోతుందనుకునే స్థాయి నుంచి ఇప్పుడు అధికారం చేపట్టే స్థాయికి చేరుకోవడం ఒక బలమైన రాజకీయ సంకేతంగా విశ్లేషకులు పేర్కొంటున్నారు.
ఆ మూడింటి ఎన్నికల తర్వాతే లోక్‌సభ పోల్స్
గత రెండు దశాబ్దాల చరిత్ర చూస్తే.. మధ్యప్రదేశ్, రాజస్థాన్, ఛత్తీస్‌గఢ్ ఎన్నికలు లోక్‌సభ ఎన్నికలకు కొద్ది నెలల ముందు జరుగుతూ వచ్చాయి. గతంలో 2018లో బీజేపీ ఈ మూడు రాష్ట్రాలనూ కోల్పోయింది. అప్పట్లో ప్రధాని కానీ, మీడియా కానీ లోక్‌సభ ఎన్నికల్లో దీని ప్రభావం ఉంటుందని చెప్పలేదు. పార్లమెంటు ఎన్నికల్లో బీజేపీ ఈ మూడు రాష్ట్రాలతోపాటు హిందీబెల్ట్‌లోనూ గణనీయమైన విజయాలు సాధించింది. 2003లో కాంగ్రెస్ ఈ మూడు రాష్ట్రాల్లోనూ పరాజయం పాలై.. కొద్ది నెలల తర్వాత 2004 లోక్‌సభ ఎన్నికల్లో అనూహ్య విజయాన్ని నమోదు చేసింది. అసెంబ్లీ ఎన్నికలతో పోల్చితే లోక్‌సభ ఎన్నికల స్వభావం వేరుగా ఉంటుందని ఈ విజయాలు పేర్కొంటున్నాయని విశ్లేషకులు చెబుతున్నారు. ఈ మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల ఫలితాల ఆధారంగా పార్లమెంటు ఎన్నికల ఫలితాలను అంచనా వేయలేమని దీని ద్వారా అర్థమవుతున్నదని పేర్కొంటున్నారు. ఈ ధోరణిని బీజేపీ మార్చగలదు అనుకుంటే.. ఆ అవకాశం కాంగ్రెస్‌కు కూడా ఉంటుందని అంటున్నారు.
ఆ మూడు రాష్ట్రాల్లో 65 సీట్లు.. బీజేపీకి ఇప్పటికే 61
మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్, రాజస్థాన్‌లో 65 లోక్‌సభ సీట్లు ఉంటే.. ఇప్పటికే ఆ రాష్ట్రాల్లో బీజేపీకి 61 ఉన్నాయి. కాంగ్రెస్‌కు ముగ్గురు ఇక్కడ ఎంపీలు. అంటే.. బీజేపీ ఈ మూడు రాష్ట్రాల్లోని ఎంపీ స్థానాలను నిలుపుకోవడంతోపాటు.. తెలంగాణలోని నాలుగు సీట్లకు అదనంగా తెచ్చుకోవాల్సి ఉంటుంది. కాంగ్రెస్ విషయానికి వస్తే.. ఆ పార్టీకి మూడు రాష్ట్రాల్లో కొత్తగా పోయేవి ఏమీ లేవు. జాతీయ రాజకీయాల కోణంలో చూస్తే మూడు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ కొత్తగా సాధించింది ఏమీ లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.
ఐదు రాష్ట్రాల్లో 83 సీట్లు
ఈ ఐదు రాష్ట్రాల్లో కలిపి 83 పార్లమెంటరీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2019 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ 65 చోట్ల నెగ్గితే కాంగ్రెస్ ఆరు సీట్లు గెలుచుకున్నది. మిగిలినవి బీఆరెస్, ఎంఎన్‌ఎఫ్, ఎంఐఎం గెలిచాయి. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో లభించిన ఓట్లే బీజేపీ, కాంగ్రెస్‌కు 2024 లోక్‌సభ ఎన్నికల్లో వస్తే.. రాజస్థాన్‌లో బీజేపీకి 14, కాంగ్రెస్‌కు 11, ఛత్తీస్‌గఢ్‌లో బీజేపీకి 8, కాంగ్రెస్‌కు 3, మధ్యప్రదేశ్‌లో బీజేపీకి 25, కాంగ్రెస్‌కు 4, తెలంగాణలో కాంగ్రెస్‌కు 9, బీజేపీకి 0 ఉంటాయి. ఇక్కడ బీఆరెస్ 7, ఎంఐఎం 1, మిజోరంలో జెడ్పీఎం 1 గెలుచుకుంటాయి. అంటే మొత్తంగా ఈ 83 సీట్లలో బీజేపీకి 46, కాంగ్రెస్‌కు 28 సీట్లు వస్తాయని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. అంటే.. ఈ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలనే పరిగణనలోకి తీసుకుంటే.. బీజేపీ కొత్తగా గెలిచేది లేకపోగా.. 19 సీట్లు కోల్పోయే అవకాశం కనిపిస్తున్నదని చెబుతున్నారు. అదే సమయంలో కాంగ్రెస్ కొత్తగా 22 సీట్లు గెలుచుకునే అవకాశం ఉన్నది. కాంగ్రెస్ చేయాల్సిందల్లా అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చిన ఓట్లను తిరిగి లోక్‌సభ ఎన్నికల్లోనూ సాధించడమేనని విశ్లేషిస్తున్నారు. లేదు.. మోదీ మ్యాజిక్ పనిచేస్తుందని అంటే.. అది విశ్వాసమే అవుతుందని, అప్పుడు ఈ ఫలితాలను చూసి బీజేపీ నేతలు చంకలు గుద్దుకోవాల్సిన అవసరమేంటని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు.
కేంద్రానికి ‘యాంటి ఇంకంబెన్సీ’ వర్తించదా?
తెలంగాణలో పదేళ్ల పాలనతో ప్రజల్లో వ్యతిరేకత వచ్చిందనేది వాస్తవం. కేసీఆర్ హ్యాట్రిక్ చాన్స్ అడిగితే ప్రజలు తిరస్కరించారు. మరి ఇదే సిద్ధాంతం కేంద్రంలోని ప్రభుత్వానికి వర్తించే అవకాశాల్లేవా? అన్న ప్రశ్నలు కూడా తలెత్తుతున్నాయి. పదేళ్లుగా కునారిల్లిపోయిన కాంగ్రెస్ ఒక్కసారిగా ముందుకు రావడం గమనిస్తే.. కేంద్రంలోనూ అదే రిపీట్ అయ్యేందుకు అవకాశాలు లేవని ఎందుకు అనుకోవాలని ఒక విశ్లేషకుడు వ్యాఖ్యానించారు.
డబుల్ ఇంజిన్ మాట పక్కకు
గతంలో డబుల్ ఇంజిన్ సర్కార్ అని మోదీ చెబుతుండేవారు. కానీ.. ప్రధానంగా నాలుగు రాష్ట్రాల ఎన్నికల ప్రచారంలో ఆ మాట పక్కకుపోవడం గమనార్హం. దాని స్థానంలో మోదీ గ్యారెంటీ అనేది ముందుకు వచ్చింది. అంతేకాదు.. ఎంపీలను, ముగ్గురు కేంద్రమంత్రులను సైతం అసెంబ్లీ ఎన్నికల బరిలో నిలపాల్సి వచ్చింది. అంతేకాదు.. ప్రచారం మొత్తం మోదీ కేంద్ర బిందువుగా సాగింది. వసుంధరరాజె, రమణ్‌సింగ్, శివరాజ్‌సింగ్ చౌహాన్ వంటి కీలక నేతలు సైతం మోదీ వెనుకే నిలబడాల్సి వచ్చింది. ఒక విధంగా రాష్ట్రాల్లో కాంగ్రెస్‌కు, కేంద్రంలో బీజేపీకి మధ్య పోటీ అన్నట్టు సాగింది.