Soundarya’s mysterious death :
హీరోయిన్ సౌందర్య (Soundarya) మరణం నేటికి ఆమె అభిమానులు జీర్ణించుకోలేని వాస్తవం. 2004 ఏప్రిల్ 17న లోక్ సభ ఎన్నికల ప్రచారానికి వెళ్లే క్రమంలో ఆమె హెలిక్యాప్టర్ ప్రమాదంలో చనిపోయారు. ఈ ప్రమాదంలో సోదరుడు అమర్ నాథ్ కూడా మరణించారు. అయితే సౌందర్య మరణించిన 20ఏళ్ల తర్వాతా ఆమె మరణానికి ప్రమాదం కారణం కాదా ? సౌందర్యను నటుడు మోహన్ బాబు(Mohan Babu) హత్య చేయించారా? అన్న అంశం ఓ వ్యక్తి ఇచ్చిన పోలీసు ఫిర్యాదుతో హాట్ టాపిక్ గా మారింది. 20 ఏళ్ళ క్రితం చనిపోయిన సౌందర్య మరణం వెనుక మోహన్ బాబు హస్తం ఉందంటూ ఖమ్మం జిల్లా సత్యనారాయణపురం గ్రామం ఏదులాపురం గ్రామపంచాయతీకి చెందిన ఎదురుగట్ల చిట్టిమళ్లు అనే వ్యక్తి తాజాగా ఖమ్మం కలెక్టర్ కు, ఖమ్మం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేయడం సంచలనంగా మారింది.
హైదరాబాద్ జల్ పల్లిలో ఆరు ఎకరాలలో సౌందర్యకు చెందిన ఎస్టేట్ ఉండగా.. దానిని తనకు అమ్మాలని మోహన్ బాబు అడిగాడని… అందుకు సౌందర్య నిరాకరించారని చిట్టిమళ్లు పేర్కొన్నాడు. దీంతో ఎలాగైన జల్ పల్లి ఎస్టేట్ ను స్వాధీనం చేసుకోవాలన్న కుట్రతో మోహన్ బాబు ఎన్నికల ప్రచారానికి బయలుదేరిన సౌందర్యను, ఆమె సోదరుడు అమర్ నాథ్ ను సాక్ష్యాలు దొరక్కుండా పక్క పథకం మేరకు హెలిక్యాప్టర్ ప్రమాదంలో హత్య చేయించాడని ఫిర్యాదులో ఆరోపించాడు.
సౌందర్య మరణం తర్వాత, జల్ పల్లి గెస్ట్ హౌస్ ను మోహన్ బాబు అక్రమంగా అనుభవిస్తున్నాడని.. సౌందర్య మృతి ఘటనపై సమగ్ర విచారణ జరిపించాలని..మోహన్ బాబుపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, జల్ పల్లి ఎస్టేట్ ను ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని పేర్కొన్నాడు. అంతేకాదు.. మోహన్ బాబు నుంచి తనకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని కూడా చిట్టిమల్లు ఫిర్యాదులో కోరాడు.
సౌందర్య అభిమానిగా చెబుతూ చిట్టిమల్లు అనే వ్యక్తి మోహన్ బాబుపై చేసిన ఫిర్యాదుపై భిన్నాభిప్రాయాలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే సౌందర్య మరణించి 20 ఏళ్ళు దాటిపోయిందని.. ఇన్నాళ్ల తర్వాతా ఈ ఘటనపై ఫిర్యాదు చేయడం వెనుక మతలబు ఏమిటన్నది ప్రశ్నార్ధకంగా మారింది.పైగా చిట్టిమళ్లు సౌందర్య కుటుంబ సభ్యుడు కూడా కాదు. కేవలం అభిమాని మాత్రమే. ఒక అభిమానికి సౌందర్య ఆస్తుల గురించి, వ్యక్తిగత విషయాల గురించి తెలిసే అవకాశం లేదని.. మరి చిట్టిమల్లు, ఈ కేసుని కేవలం సంచలనం కోసం పెట్టాడా? లేక అతని మానసిక పరిస్థితి ఏమైనా బాగాలేదా? వంటి విషయాలు తేలాల్సిఉంది.
ఓ సాధారణ రైతుకూలీ గా ఉన్న చిట్టిమళ్లు మోహన్ బాబుపై ఎందుకు ఫిర్యాదు చేశాడు..వారిద్ధరికి గతంలో పరిఛయం ఉందా ..సౌందర్య మరణ వివాదం ఇప్పుడే ఎందుకు తెరమీదకు వచ్చిందన్న ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. గాంధీ మార్గమంటూ సత్యమేవజయతే ఫ్లెక్సీతో 495రోజుల నుంచి చిట్టిమళ్లు కేవలం ఆకులు తింటూ నిరాహార దీక్ష చేస్తుండం కూడా ఇప్పుడు చర్చనీయాంశమైంది. ఒక వైపు మంచు మోహన్‌బాబుకు, అతని కుమారుడు మంచు మనోజ్ కు మధ్య ఆస్తి గొడవలు జరుగుతున్న క్రమంలో సౌందర్య మరణం వివాదంపై ఆరోపణలు మోహన్ బాబుకు మరింత సమస్యగా తయారైంది.
సౌందర్య తెలుగు, తమిళం, కన్నడం, మలయాళం భాషలలో మొత్తం కలిపి 100కు పైగా చిత్రాలలో నటించింది. 12 సంవత్సరాలు నటిగా రాణించి స్టార్ హీరోయిన్ గా ఎదిగారు. 2004లో జరిగిన లోక్‌సభ ఎన్నికలలో బీజేపీకి ప్రచారం చేసింది. అదే ఏడాది ఏప్రిల్ 17న బెంగళూరు లోని జక్కూరు విమానాశ్రయం నుంచి కరీంనగర్ లో పార్లమెంట్ అభ్యర్థి (బీజేపీ) విద్యాసాగర్‌రావు తరపున ప్రచారం చెయ్యడానికి చార్టెర్ విమానంలో సౌందర్య బయలుదేరారు.
ఆ విమానంలో సౌందర్య, ఆమె సోదరుడు అమరనాథ్ ఉన్నారు. దురదృష్టవశాత్తు విమానం గాలిలోకి ఎగిరి కొన్ని క్షణాలకే పక్కనే ఉన్న గాంధీ విశ్వవిద్యాలయం (జీకేవీకే) ఆవరణలో కుప్పకూలిపోవడంతో వారు సజీవ దహనమయ్యారు. సౌందర్యకు భర్త జీఎస్. రఘు, తల్లి మంజుల, సోదరుడు అమరనాథ్ భార్య బి. నిర్మల, వారి కుమారుడు సాత్విక్ ఉన్నారు. సౌందర్య మృతి చెందిన తరువాత ఆస్తుల పంపకాలపై 2013వరకు కుటుంబ సభ్యుల మధ్య గొడవలు కొనసాగాయి.