Site icon vidhaatha

MS Dhoni: మళ్లీ ధోనినే.. స్వరాజ్ ట్రాక్టర్ల బ్రాండ్ అంబాసిడర్‌‌

ముంబయి: మహీంద్రా గ్రూప్‌లో భాగమైన స్వరాజ్ ట్రాక్టర్ల యాజమాన్యం.. ప్రముఖ క్రికెటర్, ఎంఎస్ ధోనితో తమ అనుబంధాన్ని కొనసాగిస్తున్నట్లు ప్రకటించింది. ఆయన్ని బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగిస్తున్నట్లు తెలిపింది. ఈ సహకారం రైతులకు యాంత్రీకరణ పరిష్కారాలతో సాధికారత కల్పించాలనే తమ నిబద్ధతను ప్రతిబింబిస్తోందని సంస్థ తెలిపింది. ధోని.. 2023 నుంచి స్వరాజ్ ట్రాక్టర్స్‌కు బ్రాండ్ అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్నారు. రైతుగా ధోని వ్యక్తిగత అనుభవం, వ్యవసాయంతో లోతైన అనుబంధం కారణంగా స్వరాజ్ ఈ నిర్ణయం తీసుకుంది.

ధోని ప్రభావం స్వరాజ్ ఉనికిని బలోపేతం చేయడమే కాకుండా, ఆధునిక సాంకేతిక వ్యవసాయ పద్ధతులను అలవర్చుకోవడానికి వివిధ తరాల రైతులను ప్రేరేపించిందని సంస్థ తెలిపింది. మహీంద్రా అండ్ మహీంద్రా లిమిటెడ్ స్వరాజ్ డివిజన్ సీఈఓ గగన్‌జోత్ సింగ్ మాట్లాడుతూ..  “ఎంఎస్ ధోనితో మా సహకారాన్ని కొనసాగించడం సంతోషంగా ఉంది. ఆయన విలువలు స్వరాజ్ లక్ష్యమైన వ్యవసాయ ఆవిష్కరణలను ముందుకు తీసుకెళ్లడానికి ఉపయోగపడతాయి” అన్నారు.

ఈ సందర్భంగా ధోని మాట్లాడుతూ.. “వ్యవసాయం నాకు కేవలం అభిరుచి మాత్రమే కాదు. ఇది జీవన విధానం. స్వరాజ్ నా వ్యవసాయ ప్రయాణంలో నమ్మకమైన సహచరుడిగా నిలిచి, సవాళ్లను ధీటుగా ఎదుర్కొనేందుకు సహాయపడింది. రైతుల జీవితాల్లో అర్థవంతమైన మార్పు తీసుకురావడానికి, భారత వ్యవసాయ పురోగతికి దోహద పడే బ్రాండ్‌తో కలిసి పనిచేయడం నాకు గర్వకారణం.” అని అన్నారు.

Exit mobile version