Site icon vidhaatha

CSK vs SRH|చెన్నై బౌల‌ర్స్ ముందు న‌డ‌వ‌ని హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ కుప్పిగంతులు…ఫ్లాఫ్ షో

CSK vs SRH| ఈ సీజ‌న్‌లో హైద‌రాబాద్ బ్యాట్స్‌మెన్స్ ఆట‌తీరు చూసి మిగ‌తా టీమ్స్ అంతా వ‌ణికిపోయారు. ట్రావిస్ హెడ్, అభిషేక్, క్లాసెన్ ఈ ముగ్గురు బ్యాట్స్‌మెన్స్ చెల‌రేగి ఆడుతూ వ‌ణుకు పుట్టిస్తున్నారు. ఈ సీజ‌న్‌లో ఎస్ఆర్‌హెచ్ భారీ స్కోర్స్ కూడా న‌మోదు చేయ‌డం మ‌నం చూశాం. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్‌కు వరుసగా మరో ఓటమి న‌మోదైంది. చెపాక్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ఎస్‌ఆర్‌హెచ్ 78 పరుగుల తేడాతో ఘోర పరాజయాన్ని చవిచూసింది. అటు బౌలింగ్ , ఇటు బ్యాటింగ్‌లో పేలవ ప్రదర్శన చేయ‌డంతో ఓట‌మి త‌ప్ప‌లేదు. మ్యాచ్‌లో మొదట బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో మూడు వికెట్లు కోల్పోయి 212 పరుగులు చేసింది.

కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ (98; 54 బంతుల్లో, 10×4, 3×6) మ‌రోసారి అద్భుత‌మైన ఇన్నింగ్స్ ఆడాడు. తృటిలో శతకాన్ని కోల్పోయాడు. డారిల్ మిచెల్ (52; 32 బంతుల్లో, 7×4, 1×6), శివమ్ దూబె (39*; 20 బంతుల్లో, 1×4, 4×6) మెరుపులు మెరిపించారు. ఈ క్ర‌మంలో భారీ స్కోరు ద‌క్కింది. ఇక‌ 213 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్‌ కు దిగిన హైదరాబాద్ ఆరంభం నుంచే ఫ్లాప్ షో ప్ర‌ద‌ర్శించింది. చెన్నై బౌల‌ర్స్ క‌ట్టుదిట్ట‌గంగా బౌలింగ్ చేయ‌డంతో ఆ జ‌ట్టు క్ర‌మం త‌ప్ప‌కుండా వికెట్స్ కోల్పోయింది. ఈ క్ర‌మంలోనే 18.5 ఓవర్లలో కేవలం 134 పరుగులకే ఎస్ ఆర్ హెచ్ ఆలౌట్‌ అయింది. ఆ జట్టులో మార్‌క్రమ్‌ ( 26 బంతుల్లో 32, 4 ఫోర్లు) టాప్‌ స్కోరర్ కాగా, ట్రావిస్‌ హెడ్‌ (13), అభిషేక్‌ శర్మ (15), అన్మోల్‌ప్రీత్‌సింగ్‌ (0), నితీశ్‌ రెడ్డి (15), క్లాసెన్‌ (20) సమద్‌ (19) ఎవ‌రు కూడా చెప్పుకోద‌గ్గ ప్ర‌ద‌ర్శ‌న క‌న‌బ‌ర‌చ‌లేక‌పోయారు.

11 ఓవర్లలోనే 85 పరుగులకు ఎస్‌ఆర్‌హెచ్ అయిదు వికెట్లు కోల్పోవ‌డంతో హైద‌రాబాద్ జ‌ట్టు ఇబ్బందులో ప‌డింది. అయితే హెన్రిచ్ క్లాసెన్ (19; 17 బంతుల్లో, 1×4, 1×6) క్రీజులో ఉండటంతో సన్‌రైజర్స్ శిబిరంలో ఆశలు సజీవంగానే ఉన్నాయి. కానీ క్లాసెన్‌ను పతిరనా ఔట్ చేసి సీఎస్కే విజయాన్ని ఖరారు చేశాడు. ఆ తర్వాత సన్‌రైజర్స్ బ్యాటర్లు వరుసగా వికెట్స్ స‌మ‌ర్పించుకున్నారు. ముఖ్యంగా చెన్నై బౌలర్‌ తుషార్‌ దేశ్‌పాండే (4/22) హైదరాబాద్ టాపార్డర్‌ను దెబ్బతీసి త‌మ జ‌ట్టుకి మంచి విజ‌యాన్ని అందించాడు. ఇక‌ పతిరన, ముస్తాఫిజుర్‌ చెరో రెండు వికెట్లు తీయగా, జడేజా, శార్దూల్‌ ఠాకూర్ ల‌కి ఒక్కో వికెట్ ద‌క్కింది.

Exit mobile version