Site icon vidhaatha

Cash Deposit Limit | బ్యాంకులో మీకు సేవింగ్‌ అకౌంట్‌ ఉందా..? గరిష్ఠంగా ఎంత డిపాజిట్‌ చేయాలో తెలుసా..?

Cash Deposit Limit | ప్రస్తుతం ద్రవ్యోల్బణం మండిపోతున్నది. దాంతో ప్రతి ఒక్కరూ పొదుపును పాటించడం తప్పనిసరిగా మారింది. చాలామందికి ఏదో బ్యాంకులో సేవింగ్‌ అకౌంట్‌ ఉంటుంది. నగదు డిపాజిట్‌ చేసేందుకు, కొన్నిసార్లు పెద్దమొత్తంలో ఒకేసారి విత్‌డ్రా చేసుకునేందుకు సేవింగ్‌ అకౌంట్స్‌ను ఉపయోగించుకుంటారు. అయితే, సేవింగ్‌ అకౌంట్స్‌కు సంబంధించి కొన్ని నిబంధనలు ఉన్నాయి. ఆ నిబంధనలను పాటించకపోతే జరిమానా చెల్లించాల్సి ఉంటుందని చాలా మందికి తెలియదు. ఇంతకీ ఆ రూల్స్‌ ఏంటో తెలుసుకుందాం.!

ఖాతాలో డబ్బులు డిపాజిట్‌ చేస్తున్నారా..? ముందు ఈ రూల్స్‌ తెలుసుకోండి..

ఆదాయపు పన్నుశాఖ నిబంధనల ప్రకారం.. సేవింగ్స్‌ అకౌంట్‌లో నగదు డిపాజిట్లపై పరిమితి ఉంటుంది. మీరు ఒక రోజులో గరిష్ఠంగా రూ.లక్ష వరకు డిపాజిట్‌ చేసుకునేందుకు వీలుంటుంది. ఫోర్బ్స్‌ నివేదిక ప్రకారం.. మీరు ఆర్థిక సంవత్సరంలో రూ.10లక్షలు డిపాజిట్‌ చేసుకోవచ్చు. అంతకంటే ఎక్కువ డిపాజిట్‌ చేస్తుంటే మాత్రం ఆదాయపు పన్నుశాఖకు తెలియజేయాల్సి ఉంటుంది. అయితే, కరెంట్‌ అకౌంట్‌ ఉంటే మాత్రం రూ.50లక్షలు డిపాజిట్‌ చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. పరిమితికి మించిన లావాదేవీలను ఆదాయపు పన్నుశాఖకు తప్పనిసరిగా తెలియజేయాల్సిందేనని నిబంధనలు పేర్కొంటున్నాయి. పొదుపు ఖాతాలు, కరెంటు అకౌంట్లు, ఆర్థిక సంస్థల నగదు లావాదేవీలపై నిఘా ఉంచేందుకు ఆదాయపు పన్నుశాఖ ఈ పరిమితిని విధించింది. తద్వారా మనీలాండరింగ్‌, పన్ను ఎగువేత, తదితర అక్రమ ఆర్థిక కార్యకలాపాలను నిరోధించవచ్చని భావిస్తున్నది.

సెక్షన్‌ 194A, సెక్షన్ 269ST గురించి తెలుసా..?

మీరు ఓ ఆర్థిక సంవత్సరంలో సేవింగ్‌ అకౌంట్‌ నుంచి రూ.కోటి కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే.. దానిపై 2శాతం టీడీఎస్‌ వసూలు చేస్తారు. గత మూడేళ్లుగా ఐటీఆర్‌ ఫైల్‌ చేయని వారు 2శాతం టీడీఎస్‌ చెల్లించాల్సి ఉంటుంది. అది కూడా రూ.20లక్షల కంటే ఎక్కువ విత్‌డ్రా చేస్తే మాత్రమే. అలాంటి వ్యక్తులు ఆర్థిక సంవత్సరం రూ.కోటి విత్‌డ్రా చేస్తే 5శాతం టీడీఎస్‌ చెల్లించాల్సి ఉంటుంది. ఆదాయపు పన్నుశాఖ చట్టంలో సెక్షన్ 269ST ప్రకారం.. ఒక వ్యక్తి నిర్దిష్ట ఆర్థిక సంవత్సరంలో రూ.2 లక్షలు.. అంతకంటే ఎక్కువ నగదు డిపాజిట్ చేస్తే, దానిపై జరిమానా విధించేందుకు అవకాశం ఉంటుంది. అయితే, బ్యాంకు నుంచి డబ్బును విత్‌డ్రా చేయడంపై ఈ పెనాల్టీ విధించేందుకు అవకాశం లేదు. నిర్దిష్ట పరిమితికి మించిన ఉపసంహరణలపై టీడీఎస్‌ తగ్గింపు మాత్రమే వర్తిస్తుంది.

Exit mobile version